రాష్ట్రీయం

టి.పథకాలకు సాటి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్స్, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులు, రైతులకు ఉచిత పెట్టుబడి వంటివి ఎంతో గొప్ప కార్యక్రమాలని, వీటిని దేశమంతా అధ్యయనం చేసి అమలు చేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ కితాబునిచ్చారు. రైతులకు ఉచిత పెట్టుబడి అందించాలనే నిర్ణయం గొప్పదని, ఈ పథకం ద్వారా చెక్కులు పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో తాను స్వయంగా పాల్గొంటానని అరవింద్ ప్రకటించారు. తొలి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని అరవింద్ అభిప్రాయపడ్డారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కె చంద్రశేఖర్‌రావుతో అరవింద్ సుబ్రమణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం వివరించగా, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డి
దృశ్య శ్రవణం ద్వారా వివరించారు. దేశంలో మరెక్కడా అమలు చేయని వినూత్న కార్యక్రమాలు తెలంగాణలోనే అమలు చేయడంపట్ల అరవింద్ ఆసక్తి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సుపరిపాలనకు గుండెకాయ వంటిదని వ్యాఖ్యానించారు. తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడకుండా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ మంచి కార్యక్రమని, ఇది తననెంతో ప్రభావితం చేసిందని అభినందించారు. శాంతి భద్రతలు బాగున్నప్పుడే ప్రగతి సాధ్యమని, తెలంగాణ ప్రభుత్వం దీనికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రశంసనీయమని కొనియాడారు. స్ర్తి, పురుష నిష్పత్తిలోనూ తెలంగాణలో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడం ప్రగతిశీల పరిణామమన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పారిశ్రామిక విధానం, కళ్యాణలక్ష్మి, హరితహారం, గురుకుల విద్యాలయాలు తదితర పథకాలను అధికారులు సవివరంగా వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో మొదటి విడతలోనే 93శాతం రికార్డులను పరిశీలించి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వడం అద్భుతమని అరవింద్ అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వమే కట్నం ఇస్తున్నదా అని హ్యాస్యోక్తి విసిరారు. అలాగే కెసిఆర్ కిట్స్ పథకాన్ని కేంద్రానికి వివరిస్తానని, ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. తాను త్వరలో తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాలను పరిశీలిస్తానని చెప్పారు.
నిలువరించే చర్యలొద్దు: కేసీఆర్
ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు నిధులు తగ్గించకుండా ప్రోత్సహించే విధంగా కేంద్ర విధానాలు ఉండాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా కేంద్రం ఆలోచించేందుకు చొరవ చూపాలన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ముందడుగు వేసే రాష్ట్రాలను నిలువరించే చర్యలు మానుకోవాలని సీఎం సూచించారు. ఆదాయవృద్ధిలో ముందంజలో ఉండి, చేసే అప్పులను తీర్చగలిగే స్థోమత కలిగిన రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని కోరారు. దేశ తలసరి ఆదాయం రూ.1.03 లక్షలుంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.55 లక్షలని, జీఎస్టీ అమలుకు ముందు ఆదాయవృద్ధి రేటు 21 శాతం ఉంటే, అమలు తర్వాత వృద్థి రేటు 16.5 శాతంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్ష 36 వేల కోట్లు కాగా, 2017-18లో తెలంగాణ బడ్జెట్ లక్ష 49 వేల కోట్లని గుర్తు చేశారు. ఇంత ముందడుగు వేస్తున్న తమ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి మరింత తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటే దేశ ప్రగతి కుంటుపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
కేంద్రానికి
కేసీఆర్ డిమాండ్లు
ఉద్యోగులకు ఏటా రెండుసార్లు డిఏ పెంచుతారు. ప్రతీ ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తారు. మరి రైతులకు మాత్రం ఎప్పుడో నిర్ణయించిన కనీస మద్దతు ధరనే అమలు చేస్తారు. తాజాగా మద్దతు ధరలను ప్రకటించాలి.
వ్యవసాయానికి అనుబంధంగా ఉండే గొర్రెలు, చేపలు, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తిపై వచ్చే ఆదాయంపై పన్ను విధించడం సబబు కాదు. వీటిని ఆదాయ పన్ను పరిధి నుంచి తొలగించాలి.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్చ ఉండాలి. శాఖల వారీగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలి. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకుంటాయి. ఒక్కో రాష్ట్రం అవసరం, ప్రాధాన్యతలు ఒక్కోరకంగా ఉంటాయి.
పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైంది. స్థానిక సంస్థలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. నిధులు లేక కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి, స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వాలి.
* కాంపా నిధులు బ్యాంకుల్లో మురిగిపోతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందించాలి. గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలి.
* తెలంగాణ రాష్ట్రంలో గతంలో బ్యాంకులకు నెలకు 3 వేల కోట్ల చొప్పున కరెన్సీ వచ్చేది. నోట్ల రద్దు తర్వాత కనీసం వెయ్యి కోట్లు కూడా రావడం లేదు. దీని వల్ల తీవ్ర కరెన్సీ కొరత ఏర్పడింది. బ్యాంకుల్లో డబ్బులున్నా ప్రజలు వాటిని వినియోగించుకోలేని దుస్థితి. కరెన్సీ ఎక్కువ విడుదల చేయడానికి ఆర్‌బిఐని ఆదేశించాలి.
చిత్రం..కేసీఆర్ కిట్స్‌ను ఆసక్తిగా పరిశీలిస్తున్న అరవింద్ సుబ్రమణ్యన్