రాష్ట్రీయం

హోదాను నీరుగార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పటివరకు రాకపోవటానికి సీఎం చంద్రబాబు అసమర్థతే కారణమని వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర తొలిరోజు సోమవారం బాపట్లలో జరిగిన బహిరంగసభలో బాబు పాలనపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించటంలో విఫలమైన చంద్రబాబు, నాలుగేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు హోదా అంటూ గొంతు చించుకుంటే ఒరిగేదేముంటుందన్నారు. 14వ ప్రణాళికా సంఘం నిర్ణయానుసారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని కేంద్రం చెబుతుంటే, చంద్రబాబు తల ఆడిస్తున్నారని, 13వ ప్రణాళికాసంఘం అమలులోవున్న కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. అయినా 2015 నుంచి 14వ ప్రణాళికాసంఘం అమలులోకి వస్తే, 2013లోనే ఏపీ హోదా ఇస్తామంటూ అప్పటి కేంద్రప్రభుత్వం ప్రణాళికాసంఘానికి సిఫార్సు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోయారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. 2016లో చేసిన ప్రకటననే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిరిగి వారం క్రితం చేశారన్నారు. అదే ప్రకటనకు అప్పుడు ఢిల్లీ వెళ్ళి శాలువలు కప్పిన చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర మంత్రుల రాజీనామాలంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నటనకు ఆస్కార్ అవార్డు వచ్చి ఉండాల్సిందంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజకీయనేతకు ఉండాల్సిన కనీస అర్హతలైన విశ్వసనీయత, నిజాయితీలు లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ఈ రాష్ట్రంలో రాజకీయాలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. అవిశ్వాసం అంటే మద్దతివ్వరు. రాజీనామాలంటే ముందుకు రారు. ప్రశ్నించాలంటే కాలం గడుపుతారు. ఇలాగైతే ఎప్పటికి హోదా సాధిస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ 6న రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ చర్యతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కదలిక వచ్చిన తరువాత కూడా, కేంద్రం హోదా ఎందుకు ఇవ్వదో అప్పుడే చూద్దామన్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి మంత్రుల ఉపసంహరణ అనగానే చంద్రబాబులో పోరాట స్ఫూర్తి వచ్చిందోమో అనుకున్నా. కానీ ఇంతలోనే ఎన్డీఎతో భాగస్వామ్యం మాత్రం కొనసాగుతుందని చెప్పి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే నిన్నమొన్న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు తలసరి ఆదాయం ఎక్కువగా
ఉంటుందా అని ప్రశ్నించిన జగన్, దేశంలోని వృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే 5-6శాతం వృద్ధి రేటు అని చెబుతుంటే చంద్రబాబు మాత్రం 12శాతం వృద్ధి నివేదికలు తయారుచేయటం ఎవరిని మోసం చేయటానికని నిలదీశారు. విశాఖలో 3రోజులు సదస్సు పెట్టి రూ.20లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఆర్భాటంగా ప్రకటించి, వెనువెంటనే 40లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ అబద్ధాలు చెబితే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో రైతాంగానికి గిట్టుబాటు ధరలేక నానా కష్టాలు పడుతుంటే, ఇలాంటి తప్పుడు నివేదికలను కేంద్రానికి పంపితే హోదా ఎలా ఇస్తారని జగన్ ప్రశ్నించారు.
వ్యవసాయ అనుబంధ రంగాలు కుదేలు
వ్యవసాయ అనుంబంధ రంగాలన్నీ చంద్రబాబుపాలనలో కుదేలయ్యాయని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన కాలంలో తమ కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలే శరణ్యమనే స్థితి చంద్రబాబుపాలనలో వచ్చిందని రైతాంగం ఆవేదన చెందుతున్నారన్నారు. డీజిల్ లీటరు ధర రూ.29 ఉన్నప్పుడు రూ.6 సబ్సిడీ తమకు వచ్చేదని, కానీ లీటరు ధర రూ.69 ఉన్నప్పుడు కూడా అదే ఆరు రూపాయల సబ్సిడీ ఇస్తున్నారని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులు తన దృష్టికి తెచ్చారన్నారు. వైఎస్ పాలనలో లాభాలు ఆర్జించిన ఆక్వారైతులు నేడు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారన్నారు.
కిలో బంగారం, బెంజికారు ఇస్తామన్నా ఆశ్చర్యం లేదు
అబద్ధాలు, బూటకపు మాటలతో విశ్వసనీయత అనేమాటకు అర్థం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, కంప్యూటర్‌తో అంతా నడిపిస్తానని, అసలు కంప్యూటర్‌ను తానే కనిపెట్టానని ఆయన చెప్పటం హస్యాస్పదంగా ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చని పెద్దమనిషి, వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి కిలోబంగారం, బెంజికారు ఇస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఓటుకు రూ.3000 ఇవ్వటానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని, ఇచ్చినా ఆ డబ్బు ప్రజలదే కనుక తీసుకోవాలని పిలుపునిచ్చిన జగన్, ఓటు వేసేటప్పుడు మాత్రం మనస్సాక్షిగా వేయాలని కోరారు.
ఆరోగ్యశ్రీని విస్తృతం చేస్తా
పేదలు అప్పులపాలై మరింత పేదలుగా మారటానికి కారణమైన అనారోగ్య సమస్యలు, వైద్య చికిత్సలపై రెండింతల పోరాటాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ జగన్ ప్రకటించారు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు ఉండి అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ నిబంధనలను పూర్తిగా మార్చివేస్తానన్నారు. నూతన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని పేదలు మెరుగైన వైద్యం కోసం దేశంలో ఎక్కడికెళ్లైనా సేవలు పొందేలా చేస్తామన్నారు. అదేవిధంగా ఆపరేషన్లు చేయించుకున్నవారికి విశ్రాంతికాలంలో భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దీర్ఘకాలిక జబ్బుల బారినపడి జీవితాలు నాశనమవుతున్న వారికి నెలకు రూ.10వేలు పింఛను మంజూరు చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. చెడిపోయన రాజకీయాలను విశ్వసనీయత ద్వారా తిరిగి బాగు చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజలంతా పెద్దమనసుతో సహకరించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

చిత్రం..బాపట్ల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్