రాష్ట్రీయం

రాష్ట్రం.. బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోందని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ సోమవారం ప్రసంగించారు. సామాన్య ప్రజల జీవితాల్లో సానుకూలమైన, గణనీయమైన ప్రభావాన్ని తీసుకువచ్చిందని, రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల కార్యకలాపాలు, సాగునీటి రంగం, విద్యుత్, పరిశ్రమలు, చేనేత, ఐటీ, మిషన్ భగీరథ, రోడ్లు, పట్టణాభివృద్ధి, హరితహారం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ ప్రోత్సాహకాలు, ఆసరా ఫించన్లు, పర్యాటకాభివృద్ధి, తెలుగు ప్రపంచ సభల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కాగా గవర్నర్ అర్ధగంట పాటు మాట్లాడారు. గవర్నర్‌తో పాటు సభావేదికపై శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు ఆశీనులయ్యారు. అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. సమ్మిళితంపై సుస్థినరమైన దృష్టితో శీఘ్రమైన ఆర్ధిక వృద్ధి అనేది తమ ప్రభుత్వ ప్రాథమిక సిద్ధాంతమని అన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అనేక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. అభివృద్ధి లోటు పూడ్చుకుంటూ మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని గవర్నర్ అన్నారు. భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చామన్నారు. తెలంగాణ
జీఎస్‌డీపీ 8.6 శాతం సగటు వార్షిక పెరుగుదలకు చేరుకుందని, ఇది 7.5 శాతపు జాతీయ సగటుకంటే అధికమన్నారు. 2016-17లో తెలంగాణ తలసరి ఆదాయం 1.54 లక్షలుగా అంచనా వేశామన్నారు. తీవ్ర దుస్థితిలో ఉన్న వ్యవసాయ రంగం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి సమగ్రమైన విధానాన్ని ఆవిష్కరించామని, తక్షణ సాయంగా ప్రభుత్వం 35.3 లక్షలమంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ లక్ష రూపాయల వరకూ రుణ మాఫీ చేసిందని చెప్పారు. క్షేత్ర యాంత్రీకరణ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయడాన్ని కట్టుదిట్టం చేయడం, సూక్ష్మ సేద్యం, గ్రీన్ హౌస్, పాలి హౌస్‌లు వంటి వ్యవసాయ ఉత్పాదకతలలో పెరుగుదల నిమిత్తం చేపట్టిన కీలక చర్యలు రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు.
తెలంగాణలో జనవరి 1 నుంచి దాదాపు 23 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల సరఫరా పథకం ప్రగతిదాయకంగా ఉందన్నారు. చేప పిల్లల పంపిణీ, చేపల మార్కెట్ యార్డుల నిర్మాణం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం క్రియాశీల చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్ధ్యాన్ని 18.30 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని, భూ రికార్డులను తాజా పరిచే కార్యక్రమం రికార్డు సమయంలోగానే పూర్తి చేశాయని తెలిపారు. 23 భారీ సాగునీటి ప్రాజెక్టులు, 13 మధ్య తరహా నీటి ప్రాజెక్టులను చేపట్టిందని, ఇంత వరకూ 16.42 లక్షల ఎకరాల కొత్త సాగునీటి సామర్ధ్యాన్ని కల్పించి, 8.79 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. విద్యుత్ రంగంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా ఒక రికార్డు అని చెప్పారు. తెలంగాణ 3283 ఎండబ్ల్యుల అత్యధిక స్థాపిత సౌర సామర్ధ్యం ఉన్న రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. టిఎస్‌ఐపాస్ కింద 6206 పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటయ్యాయని, వరంగల్ వద్ద ఒక సమగ్ర మెగా జౌళి పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని వివరించారు. ఐటీ రంగంలో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతుల మొత్తం విలువ 85,470 కోట్లుగా ఉందని, మిషన్ భగీరథ కింద 5500 గ్రామీణ జనావాసాలకు, 13 పట్టణ స్థానిక సంస్థలకు భారీ పరిమాణంలో నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. జిల్లా ప్రధాన కార్యస్థానాలకు అనుసంధానం చేస్తూ 1970 కిలోమీటర్లు పొడవైన రోడ్డును, 4665 కిలోమీటర్లు పొడవైన ప్రధాన జిల్లా రోడ్లను విస్తరించి డబుల్ రోడ్లుగా మార్చామని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఉందని, తెలంగాణలో 2017-18లో దాదాపు 34 కోట్ల మొక్కలునాటి, అందులో 30 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ చేశామని వివరించారు. రాష్ట్రంలో నవజాత శిశువుల, మాతృత్వ మరణాలను తగ్గించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టామని, కేసీఆర్ కిట్లను అందించామన్నారు. 102 వైద్య సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 517 నైవాసిక పాఠశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. బలహీన అణగారిన వర్గాల సముద్ధరణకు, గౌరవాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని, మైనార్టీల స్థితి గతులను పెంచేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో 41.78 లక్షల మందికి ఆసరా ఫించన్లు అందిస్తున్నామని, రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశామని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో వివరించారు.
చిత్రాలు..అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్
*ప్రసంగ పాఠాన్ని ఆసక్తిగా చూస్తున్న సీఎం కేసీఆర్