రాష్ట్రీయం

చక్రం తిప్పనున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: విళంబి నామ సంవత్సరంలో జాతీయ స్థాయిలో తెలంగాణ హవా ఉంటుందని, చక్రం తిప్పుతుందని డాక్టర్ బాచుపల్లి సంతోష్‌కుమార్ శర్మ తెలిపారు. ఉగాది వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లోని ప్రగతిభవన్ జనహితలో సంతోష్‌కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. శ్రీరామచంద్రమూర్తి అవతరించిన సంవత్సరం కావడం వల్ల పరిపాలన సజావుగా ఉంటుందన్నారు. రాష్ట్రం దిగ్విజయంగా ముందుకు వెళుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఒకే రాశిని కలిగివున్నాయన్నారు. ఈ రాశివారికి పరిస్థితి బాగా ఉండటం వల్ల ‘బంగారు తెలంగాణ’ సులువుగా సాధించేందుకు వీలుంటుందన్నారు. ముఖ్యమంత్రి వేగాన్ని అందుకోకపోతే ఐదుగురు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చునన్నారు.
వర్షాలకు ఇబ్బంది లేదని, భూములన్నీ సస్యశ్యామలంగా ఉంటాయని, అక్టోబర్ -డిసెంబర్ నెలల్లో భారీ వర్షాల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉందని బాచుపల్లి పేర్కొన్నారు. పశునష్టానికి అవకాశం ఉందని, అందువల్ల పశువులను రక్షించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎరుపు రంగుపంటలకు (కందులు తదితరాలు), ఎర్రరంగు నేలలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందన్నారు. మహిళలు కీలకపాత్ర పోషిస్తారన్నారు. శాంతిభద్రతలు బాగుంటాయని, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. వివాహాలు చేసుకునే వారు అన్ని కోణాల్లో ఆలోచించి, మనసులు కలిస్తేనే వివాహం చేసుకోవాలని, లేకపోతే కుటుంబ తగాదాలు పెరిగి విడాకుల సంఖ్య పెరుగుతుందన్నారు.
ఆర్టీసీ, రవాణా రంగాలు లాభాల బాటలో పయనిస్తాయని, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలలో చిన్న చిన్న అపశృతులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ఈ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. పర్యాటకం, విద్య, మీడియా, సినిమా రంగాల పరిస్థితి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి, తెలంగాణకు, భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపచేస్తారన్నారు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని బాచుపల్లి తెలిపారు. దేవాదాయ శాఖ పరిపాలనలో చికాకులు ఏర్పడతాయని, అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒక మఠాధిపతి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

చిత్రం..తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్‌లో పంచాంగ పఠనం చేస్తున్న సంతోష్‌కుమార్