రాష్ట్రీయం

డైలమాలో బీజేపీ నేతలు డైలమాలో బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 20: రాష్ట్రంలో గడచిన వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ప్రత్యేక హోదాను సాధించే దిశగా జరుగుతున్న పోరాటంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని, ప్రజలను తమవైపునకు మలచుకోడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య మైత్రీ బంధం తెగిపోయి, కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోడానికి ప్రధాని మోదీయే కారణమన్న విషయాన్ని టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లింది. తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని, దీనికి బీజేపీయే కారణమన్న వాదనను ప్రజలు నమ్మేలా చేయడంలో టీడీపీ దాదాపు సఫలమైంది. దీంతో రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ ప్రజల్లో మరింత చులకనైపోయింది. వైసీపీ, జనసేన పార్టీలు కూడా బీజేపీపై కత్తికట్టినా, ఆ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు తమకు అంత నష్టాన్ని కలిగించలేదు కానీ, టీడీపీ దాడిని తిప్పికొట్టడంలో విఫలమవడంతో, తమ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోందని బీజేపీ నాయకులు అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడానికి అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా తయారు చేయాలనుకుంటున్న సమయంలో అన్ని పార్టీలూ కలిసి కమలనాథులపై దాడికి దిగడంతో ఆపార్టీ నేతలకు నవనాడులూ కుంగిపోతున్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వలన బీజేపీ పట్ల సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయన్న నాయకులు ధీమాతో ఉన్నారు. అయితే, ఒక్కసారిగా పార్టీలన్నీ ఒకేసారి ఇలా పగబడతాయని వారు ఊహించలేకపోయారు.
2014 ఎన్నికల కన్నా, 2019 ఎన్నికల్లో మరికొన్ని స్థానాలను అదనంగా దక్కించుకోవచ్చని, అది సాధ్యం కాకపోయినా, కనీసం ఓట్ల శాతాన్నైనా పెంచుకోవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్న నేపథ్యంలో, హోదా పేరుతో అన్ని పార్టీలు చేస్తున్న విమర్శలతో ఆ పార్టీలోని నేతలు ఆ ఆశలను కూడా వదులుకోవలసి వస్తోంది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపాలైన తరువాత చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయిన ఆ పార్టీలోని సీనియర్లలో కొంతమంది కమల దళంలో చేరారు. వీరిలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు వంటి వారు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు బీజేపీ నుంచి బరిలోకి దిగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న తరుణంలో వీరు డైలమాలో పడిపోయారు. వీరి వెనుక ఉన్న క్యాడర్ కూడా ఆలోచనలో పడింది. ఈ సీనియర్లు బీజేపీలోనే కొనసాగాల్సి వస్తే, ఎన్నికల వరకూ క్యాడర్‌ను అతి కష్టంమీద కాపాడుకోవలసి ఉంటుంది. ఈలోగా బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి ఏపీలో పార్టీని ఆదుపోతే, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిపై బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితులను బీజేపీ అధిష్ఠానం గమనిస్తోంది. పార్లమెంట్ సమావేశాల తరువాత ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి, ప్రజల మన్ననలు చూరగొంటుందని చెపుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను తామే ఇస్తామని, మరో 15 రోజుల్లో ఏపీ ప్రజలు ఆశ్ఛర్యపోయే పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు.