ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడకు సమీపంలో 200 ఎకరాల్లో మోడల్ ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. వౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, కార్మికులకు గృహ వసతి ఒకేచోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం భూమిని కేటాయించనుంది. గన్నవరం దగ్గరలోని వీరపనేనిగూడెంలో భూమిని గుర్తించింది. బుధవారం తన కార్యాలయంలో ఎంఎస్‌ఎంఇ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని, పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు ముందుకొస్తే సకల సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. భూములను కేటాయించడమే కాకుండా రహదారులు నిర్మిస్తామని, అవసరమైనంత విద్యుత్ సరఫరా చేస్తామని, నీటి కొరత లేకుండా చూస్తామని ప్రతినిధులకు ముఖ్యమంత్రి మాటిచ్చారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు అవసరమైన వౌలిక వసతుల కల్పన, అనుమతుల మంజూరుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, సెయిల్ స్టాక్ యార్డులను విజయవాడలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త ఆలోచనలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఎస్‌ఎంఈలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లీజు ప్రాతిపదిన కాకుండా తక్కువ ధరకు తమకు భూములు విక్రయించాలని ఎంఎస్‌ఎంఇ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. భూమి అందుబాటు ధరలో ఉంటే మరిన్ని యూనిట్లు నెలకొల్పి, వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. గన్నవరం నుంచి వీరపనేనిగూడెం మధ్య ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఫ్లైఓవర్ నిర్మించాలన్న విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రోడ్ల విస్తరణ చేపడతామని చెప్పారు. సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో, ఎగుమతులు ఏ మేరకు ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల లే అవుట్ల నుంచి పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రభుత్వం కల్పించే వౌలిక సదుపాయాలతో ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్‌ను దేశంలోనే ఒక అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవాలని సిఎం ఎంఎస్‌ఎంఈలకు సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సిఎం కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

విశాఖ శారదా పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 17: విశాఖ శ్రీశారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన బుధవారం శారదా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం, పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చతుర్వేద సంహిత యాగం, స్కంధయాగం, గ్రహ శాంతి కోసం నవగ్రహ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఢిల్లీలో ఎపి రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, తదితరులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు పీఠంలోని సకల దేవతామూర్తులకు హోమశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిద్ధా దంపతులు సుబ్రహ్మణ్యస్వామికి షఠ్‌చక్రార్చన చేశారు. ప్రపంచ శాంతి, గ్రహాల అనుకూలతకు స్వామి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఎంపి ముత్తంశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. లోకశాంతి కోసం యాగాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి గంటా అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులచే ప్రారంభించిన శాస్త్ర, శ్రౌత మహాసభలను శిద్ధా ప్రారంభించారు. సాయంత్రం సుబ్రహ్మణ్యస్వామికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తప్పిటగుళ్లు, కోలాటంతో ఊరేగింపు నిర్వహించారు.