రాష్ట్రీయం

ఆపండి అబద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఎంత కేటాయించారో వాస్తవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ‘ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు’ అనే అంశంతో పాటు బీజేపీ చీఫ్ అమిత్‌షా రాసిన లేఖపై చంద్రబాబు శనివారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. లేఖను తప్పుల తడక, కట్టుకథగా అభివర్ణించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఆందోళనలో ఉందన్నారు. రాష్ట్రానికి ఇంతిచ్చాం.. అంతిచ్చామని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.. యూసీలు ఇవ్వనందునే నిధులు మంజూరు చేయటంలేదని మరోసారి చెప్తున్నారు. పొంతనలేని ప్రకటనలతో రాజకీయ దురుద్దేశ్యంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మీరిచ్చిన లెక్కలేంటో తేల్చే ధైర్యం ఉంటే బహిరంగ వేదికపై చర్చిద్దామని సవాల్ విసిరారు. విభజన చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం కేంద్రం పన్ను రాయితీలు కల్పించాల్సి ఉందని, భారీ పరిశ్రమలు అప్పటికే హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావటంతో అవశేష ఆంధ్రలో వెనుకబాటుతనం గుర్తించి నాటి కేంద్ర ప్రభుత్వం హోదా, రాయితీలను ప్రకటించిందని గుర్తుచేశారు. హోదాతో 90 శాతం గ్రాంట్లు రాష్ట్రానికి అందుతాయని ఈఏపి కింద వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. అదే పరిస్థితుల్లో పరిశ్రమలకు
అన్నివిధాల రాయితీలు ఉంటాయన్నారు. హోదా పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. హోదా అంశం తమ పరిధిలోది కాదని ఆర్ధిక సంఘం చైర్మన్‌సహా, ప్రతినిధులు వివరిస్తుంటే కేంద్రం కుంటిసాకులు చెప్తోందని మండిపడ్డారు. ఓ వైపు ఏపీకి నష్టం కలిగిస్తూ మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు జీఎస్టీలో మినహాయింపు ఇవ్వటం దుర్మార్గమన్నారు. ఆ రాష్ట్రాలకు 90 శాతం నిధులు మంజూరుచేసి ఏపీకి మాత్రం ఈఏపి అంటూ అమిత్ షా లేఖలో వక్రీకరించారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో హామీ ఇచ్చినప్పుడు ఎందుకివ్వరని ప్రశ్నించారు. జీఎస్టీలో ఏ రాష్ట్రానికీ మినహాయింపులేదని చెప్తూ మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు ప్రకటించారో తేల్చాలని డిమాండ్ చేశారు. అన్నీ ఇచ్చేశాం, సక్రమంగా వినియోగించు కోలేదని అసమర్ధుల కింద లెక్కకడుతున్న కేంద్రం అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈఏపి ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు నాబార్డు ద్వారా ఎస్పీవీ ఇస్తామని ప్రకటించటం అమానుషమన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు మూడువేల కోట్ల నిధులతో పాటు సెంట్రల్ కాపిటల్ ఇనె్వస్టుమెంట్ కింద 30 శాతం, వర్కింగ్ కాపిటల్ కింద మరో 3 శాతం, సెంట్రల్ కాంప్రెహెన్సివ్ మెజర్స్ కింద నూరుశాతం, జీఎస్టీ, ఐటీ రీయంబర్స్‌మెంట్ రవాణాలో 20 శాతం రాయితీలు కల్పించారని, విభజనతో నష్టపోయిన ఏపీపట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 3లక్షల కోట్లతో పరిశ్రమలు వస్తే కేంద్రానికి 4వేల 500 కోట్ల పన్నులు చెల్లించాలని, కష్టం మనది.. వసూలు కేంద్రానిదా? అని ప్రశ్నించారు. అమిత్‌షా రాసిన లేఖ ఐదుకోట్ల తెలుగుప్రజల మనోభావాలకు సంబంధించిందనేది గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని కించపరుస్తూ రెచ్చకొడుతూ ఇలాంటి లేఖలు రాయటం జాతీయ పార్టీకి తగదన్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కేంద్రాన్ని నిలదీసే సాహసం చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. వీళ్లా.. రాష్ట్రాన్ని కాపాడేదని నిలదీశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పోలవరం నిర్మాణం, జాతీయ విద్యాసంస్థలకు నిధుల మంజూరు తదితర అంశాల్లో పొంతనలేని లెక్కలు చెప్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మోసం చేస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఏవిధంగా వారిని సంతృప్తిపరుస్తారో తేల్చండన్నారు. హోదా ఎగ్గొట్టేందుకు ఎస్పీవీ అంటున్నారు..అది మాకు అక్కర్లేదు. నిధులు మళ్లించే అలవాటు మాకులేదు. అన్నింటికీ యూసీలు సమర్పించాం. రెవిన్యూ లోటుకు ఇవ్వాల్సిన అవసరంలేదు. మమ్మల్ని బదనాం చేయటం మంచిపద్దతి కాదని హితవు పలికారు. మీరిచ్చే 16వేల కోట్ల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేదిలేదన్నారు. సోలార్ ప్రాజెక్టులకు 24వేల కోట్లు ఇచ్చామనటం పచ్చి అబద్ధమన్నారు. పీఎంవో ఏ రకంగా పనిచేస్తోందో దీనివల్ల తెలుస్తోందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను ఫణంగాపెట్టి ఢిల్లీ నాయకత్వాన్ని సమర్థించే రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ గతే పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వదిలిపెట్టే సమస్యేలేదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి హోదా, విభజన హామీలు, పరిశ్రమల రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం శాసనసభలో ప్రవేశపెట్టిన డిమాండ్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు. ప్రధానమంత్రి ఫొటో పెట్టనందునే నిధులు రావటంలేదనే వ్యాఖ్యలు సరికావన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ ఫొటోలు పెట్టారో లేదో తేల్చాలన్నారు.