రాష్ట్రీయం

బీజేపీపై టీడీపీ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 15 : పొరుగు రాష్టమ్రైన కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో మే 12వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నాటకలో ప్రధాన ప్రత్యర్థులుగా అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. వీరికి తోడు మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ కూడా అధికారం దక్కించుకోవడానికి కృషి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నాటకలో ఉన్న తెలుగు ప్రజలెవరూ బీజేపీకి ఓటు వేయవద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్నాటకలోని బళ్లారి, రాయచూర్ జిల్లాలతో పాటు బెంగళూరు నగరంలో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. ప్రధానంగా బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో ఇక్కడి నుంచి వలస వెళ్లి పంటలు సాగు చేస్తున్న కోస్తాంధ్ర ప్రాంత రైతులు అధికంగా ఉన్నారు. ఇక బెంగళూరులో ఉద్యోగాలు, వ్యాపారం కోసం వెళ్లిన ప్రజలు నివసిస్తున్నారు. బెంగళూరులోని రెండు, మూడు, బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో 8 నుంచి 10 శాసనసభా స్థానాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. కర్నాటకలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దక్షిణాదిలో బలంగా ఉన్న కర్నాటకలో మరోమారు అధికారం చేజిక్కించుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడగలమన్న సంకేతాలు ఇవ్వాలన్న ఆకాంక్ష కమలనాథుల్లో
ఉంది. దీంతో ఇక్కడి ఎన్నికల్లో బీజేపీని విజయం వరించకుండా చేస్తే ఆ పార్టీ భవిష్యత్తులో దక్షిణాదిపై ఆశలు వదులుకునే పరిస్థితి వస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇటీవలి కాలంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న ప్రచారమూ ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. దాంతో ఆయన సోదరుడు జనసేనపార్టీ అధినేత ఆలోచనలో పడ్డారని ఆయన ఎవరికీ మద్దతుగా ప్రచారం చేయబోరని తెలుస్తోంది. ఇక వైసీపీ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీకి ఓటేయమని బహిరంగంగా ప్రకటించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే బాగుంటుందని పార్టీ వ్యూహకర్తలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రచారానికి టీడీపీ నేతలు కర్నాటక వెళ్తే ఎవరికి ఓటేయాలో కూడా చెప్పాల్సి ఉంటుందని, అదే పార్టీ తరఫున చంద్రబాబు బహిరంగ లేఖ రాస్తూ కర్నాటకలోని తెలుగు ప్రజలు బీజేపీకి ఓటేయకుండా ఇతరులకు ఓటేయాలని కోరితే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు గతంలో జేడీఎస్ అధినేత దేవేగౌడతో చంద్రబాబుకు ఉన్న పరిచయం కారణంగా ఆయన కోరితే ప్రచారానికి ఆ పార్టీ తరఫున వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న వారం రోజుల్లో కర్నాటకలో ప్రచారమా లేదంటే బహిరంగ లేఖ రాయడమా అన్నది తేలనుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.