రాష్ట్రీయం

ఎన్నికల హామీలు ఏమయ్యాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, హామీలు నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో మరిపెడ మండల కేంద్రానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాంచంద్రునాయక్ అధ్యక్షతన బహిరంగ సభను నిర్వహించారు. డోర్నకల్ నియోజవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి పెద్దసంఖ్యలో ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 13సార్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన ఘనత ఈ నియోజకవర్గ ప్రజలది అన్నారు. సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన రెడ్యానాయక్‌ను సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, ఎంపిపిగా, ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీది అన్నారు. ఆయనకే కాకుండా రెడ్యా కూతురు కవితకు కూడా ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిందన్నారు. ఇన్ని
రకాల అవకాశాలు కల్పించి అందలం ఎక్కిస్తే నమ్ముకున్న ప్రజలను నయవంచన చేసి కేవలం తన ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక వ్యాపారం చేసుకోవడానికే పార్టీ ఫిరాయించిన నీచ చరిత్ర రెడ్యానాయక్‌దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి డాక్టర్ రాంచంద్రునాయక్ కాంగ్రెస్ అభ్యర్ధిగా, బలరాంనాయక్ మానుకోట పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీలో ఉంటారని వారికి ఘనవిజయాన్ని కట్టబెట్టడం ద్వారా కష్టకాలంలో కాంగ్రెస్‌పార్టీని మోసం చేసిన రెడ్యానాయక్‌కు, ఆయన కుటుంబానికి ఈ నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని అన్నారు. గిరిజనులకు రావాల్సిన అవకాశాలు అందకుండా చేస్తున్న పాపం ఈ తెలంగాణ ప్రభుత్వానిదే అని విమర్శించారు. ఆత్మాభిమానంతో జీవించమని గిరిజనులకు వ్యవసాయ భూములను కాంగ్రెస్‌పార్టీ అందజేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోడురైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను, డబుల్‌బెడ్‌రూంలు ఇస్తానని మధ్య తరగతి ప్రజలను, మూడెకరాల వ్యవసాయ భూమి అందిస్తానని, హరిజన, గిరిజన వర్గాలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నిసార్లు కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడంలేదన్నారు. కేసీఆర్ చేసిన నాలుగు విడుతల రుణమాఫీ మూలంగా రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ దాదాపు 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఒక్క డీఎస్సీ కూడా వేయని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీచేస్తామని, ఉద్యోగాలు దక్కని నిరుద్యోగ యువతకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తామని మహిళా సంఘాలను పటిష్టపరుస్తామని, రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మాట ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కల్పిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చేది మా ప్రభుత్వం వడ్డీతో సహా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పార్టీ అగ్రనాయకులు వి.హన్మంతరావు, మల్లు రవి, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దొంతు మాధవరెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, భరత్‌చందర్‌రెడ్డి, ఉమామురళీనాయక్, సుచిత్రాబాలునాయక్, డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మరిపెడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి