ఆంధ్రప్రదేశ్‌

వెంకన్న భక్తులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించేది లేదని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం చంద్రబాబునాయుడు ఆదేశంతో టీటీడీ యాజమాన్యం పునరాలోచనలో పడింది. భక్తుల నుంచి అభిప్రాయాల సేకరణ చేసి ఈనెల 24న జరుగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్‌యాదవ్, ఈఓ ఏకే సింఘాల్ మంగళవారం తిరుమలలో సమావేశమై విలేఖరుల ముందు తెలిపారు. వాస్తవానికి మహాసంప్రోక్షణ జరిగే ఆరు రోజుల పాటు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ప్రకటన చేశారు. అటు తరువాత ఈనెల 14న టీటీడీ పాలక మండలి తిరుమలలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి 6 రోజులపాటు ఏ ఒక్కరినీ కూడా శ్రీవారి ఆలయంలోకి అనుమతించబోమని, ఘాట్‌రోడ్డులో వాహనాలను కూడా అనుమతించబోమని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అధికారులు, పాలక మండలి చేసిన ప్రకటనలకు పూర్తిగా భిన్నంగా ఉండటం, భక్తుల ప్రకోపానికి ఒక కారణంగా మారింది. గత నాలుగు రోజులుగా శ్రీవారి దర్శనం రద్దుపై రాష్టవ్య్రాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత మంది భక్తులకు మహాసంప్రోక్షణ సమయంలో దర్శన సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈఓ ఏకే సింఘాల్ మంగళవారం తిరుమలలో సమావేశమయ్యారు. అనంతరం మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. రోజుకు ఎంత మందిని అనుమతించాలనే అంశంపై సమాలోచన చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చెన్నైలో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారని చెప్పిన క్రమంలో అధికారులు ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. రమణ దీక్షితులు చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ భక్తులను దర్శనానికి నిలిపివేసిన దాఖలాలు గానీ, సీసీ కెమేరాలు కట్టివేసిన దాఖలాలు కానీ లేవని స్పష్టం చేశారు. ఇలాంటి విమర్శలు ఉంటాయని తెలిసే టీటీడీ యాజమాన్యం కూడా స్పందించిందని ప్రచారం సాగుతోంది. శ్రీవారి ఆలయంలో 12 సంవత్సరాలకోసారి అష్టదిగ్బంధన, బాలాలయ మహాసంప్రోక్షణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అటు తరువాత 2018లో ఆలయ మహాసంప్రోక్షణ నిర్వహించాల్సి ఉంటున్నదన్నది ముందుగానే తెలిసిన విషయం. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ప్రతి యేడాది టీటీడీ ముద్రించే క్యాలెండర్‌లోగానీ, పంచాంగంలోకానీ ప్రస్తావిస్తూ అప్పుడే తగిన నిర్ణయం చేసి ఉంటే బావుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రచారాలపై టీటీడీ యాజమాన్యం కూడా దీటుగా సమాధానం చెప్పలేకపోవడం మరో తప్పిదం అన్నది భక్తుల అభిప్రాయం. మహాసంప్రోక్షణ కార్యక్రమం ఖరారు చేసిన 11వ తేదీ రెండో శనివారం, 12న ఆదివారం సెలవుదినాలు కావడంతో పాటు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తడం తథ్యం. మహాసంప్రోక్షణకు సుమారు నెలరోజులు గడువున్న సమయంలో మహా సంప్రోక్షణ సందర్భంగా దర్శనానికి సంబంధించి తలెత్తే ఇబ్బందులను టీటీడీ విస్తృతంగా ప్రచారంచేపట్టి నిర్ణయం తీసుకుంటే ఇన్ని విమర్శలు, వివాదాలకు తావుండేది కాదు. అందులోనూ అధికారులు రోజూ 25,000 నుంచి 30,000 వరకు అనుమతిస్తామని, బోర్డు ఒక్కరిని కూడా ఆరు రోజుల పాటు అనుమతించబోమని భిన్న ప్రకటనలు చేయడం వివాదాలకు, విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో తిరుమల ఆలయంపైన, అధికారుల తీరుపైన తలెత్తుతున్న వివాదాల విమర్శలు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేస్తున్నాయి.

సీఎం నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం : స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖపట్నం: తిరుమల తిరుపతి దేవస్థానంలో అష్టబంధనం, ఇతర పూజల కోసం ఆలయాన్ని తొమ్మి రోజులపాటు మూసివేసి, వెంకటేశ్వరుని దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తూ టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రుషీకేశ్‌లో చాతుర్మాస దీక్ష చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పీఠాధిపతులు, ఆగమ సలహామండలి అంగీకారం మేరకు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని స్వామి అన్నారు. కానీ టీటీడీ చైర్మన్, ఈవో, ఇద్దరు అర్చకులు కలిసి మహా సంప్రోక్షణపై తీసుకున్న నిర్ణయం అందరికీ అనుమానం రేకెత్తించే విధంగా ఉందని అన్నారు. ఆలయాన్ని తొమ్మిది రోజులు మూసేసి, భక్తులకు శ్రీనివాసుని దర్శనం లేకుండా చేయాలనుకోవడం సరికాదని తను చెప్పానని స్వరూపానందేంద్ర అన్నారు. ఆలయ సంప్రదాయాలపై పాలక మండలి నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదని కూడా చెప్పానని స్వరూపానందేంద్ర అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి తిరుమల ఆలయ మూసివేత నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దేవాలయాల పాలకమండళ్లు ఏదో కార్యక్రమాన్ని ప్రారంభించి, దాన్ని వివాదంగా మార్చడం, భక్తులను భయభ్రాంతులను చేయడం మంచిది కాదని అన్నారు.