ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీని వణికిస్తున్న అంటువ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: విశాఖ ఏజెన్సీలోని గిరిజనులను అంటు వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. గతంలో విష జ్వరాలతో పెద్ద సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మలేరియాతో పదుల సంఖ్యలో గిరిజనులు మరణించారు. మలేరియా, విష జ్వరాలు తగ్గుముఖం పట్టాయనుకుంటే, డెంగ్యూ వ్యాధి ఈ ఏడాది ఏజెన్సీలో రిపోర్ట్ అయింది. సాధారణంగా ఈ సీజన్‌లో మలేరియా వ్యాధి ఏజెన్సీని వణికిస్తుంటుంది. ఈ ఏడాది చాలామంది గిరిజనులకు మలేరియాకు తోడు టైఫాయిడ్ కూడా సోకడంతో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి మంచాన పడిన పరిస్థితి ఏర్పడింది. డెంగ్యూ వ్యాధిలో ఈ ఏడాది రాష్ట్రంలో విశాఖ నెంబర్ వన్ స్థానంలో ఉంది. గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. అలాగే, విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో గడచిన 15-20 రోజుల్లో 60 కేసులు నమోదైనట్టు వైద్యులు తెలియచేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారు పీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. అక్కడ డెంగ్యూ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న కేసులను విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. డెంగ్యూ కేసులు రోజు రోజుకూ పెరగడంతో ఐటీడీఏ అధికారులు డెంగ్యూ అనుమానిత రోగులను విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. డెంగ్యూ వ్యాధితో గత 15 రోజుల్లో అరకులో ఇద్దరు, పాడేరులో ముగ్గురు, మిగిలిన ప్రాంతాల్లో మరో ముగ్గురు మరణించారు. అయితే, ఇవి డెంగ్యూ మరణాలు కావని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
ఏజెన్సీలో జ్వరాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతీ పీహెచ్‌సీలోను ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు. పీహెచ్‌సీల్లో 24 గంటలూ వైద్యం అందేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్ తెలియచేశారు. అలాగే, ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులతోపాటు, మైదాన ప్రాంతాల నుంచి కూడా అదనపు సిబ్బందిని అక్కడికి పంపించారు. సాధికార మిత్ర సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి, డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నట్టు ఆయన తెలియచేశారు. అంతేకాకుండా, లార్వా వృద్ధి చెందేందుకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియచేశారు.