ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ నేతల భాష అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: బాధ్యత గల పదవుల్లో ఉండి సంస్కారవంతంగా మెలగాల్సిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు వాడుతున్న భాష సంస్కార హీనమని, అభ్యంతకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ కళ్లు నెత్తికెక్కి, ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని, మీరు దిగజారి పది మాటలు మాట్లాడితే మా వాళ్లు వంద మాట్లాడటానికి తమ దగ్గర సమాచారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ మాఫియా, సైకిళ్లు, కొబ్బరిచిప్పలు దొంగతనం చేసిన దొంగలందరికీ పదవులు ఇచ్చి చంద్రబాబు తన పక్కన పెట్టుకున్నారని, వీరి నుంచి సంస్కారవంతమైన భాషను ఆశించడం ఆత్యాసే అవుతుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థాపించి, చంద్రబాబు అండదండలతో పైకొచ్చిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను కబళించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు కుట్రపన్నారని ఆరోపించారు. 32 లక్షల మంది బాధితులు 6,400 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తే వారిని బజారున పడవేశారని ధ్వజమెత్తారు. రాజధాని వచ్చిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకు తమకు విక్రయించాలని సంబంధిత యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన మీదట వారు వినకపోవడంతో చివరకు ఆస్తులను జప్తు చేయించే స్థితికి టీడీపీ నేతలు వచ్చారని అన్నారు. విజయవాడలో 30 కోట్ల రూపాయల ఖరీదు చేసే అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయాన్ని కేవలం రూ.11 కోట్లకు వేలంలో కొనుగోలు చేయించారని, 3 వేల కోట్ల రూపాయల విలువ చేసే హాయ్‌ల్యాండ్‌ను కేవలం 267 కోట్లకు లెక్కగట్టడం దీనికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ప్రధాన ఆస్తులను అటాచ్‌మెంట్ జాబితాలో చూపించకుండా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి జనవరి 17, 2015న ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ 570 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని చెప్పి చివరకు 6 లక్షల రూపాయలనే అటాచ్‌మెంట్‌లో చూపడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. 2016లో అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్‌మెంట్ జరిగిన తర్వాత ఆస్తుల నిర్వహణ ఎవరు చూస్తున్నారు, వాటిపై వచ్చే ఆదాయం ఎవరికి వెళుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆర్థికమంత్రిపై ఉందన్నారు. ఇది 10 వేల కోట్ల రూపాయల కుంభకోణమని, మొత్తం వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా సీబీఐ విచారణను కోరుతూ బుధవారం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నట్లు కన్నా తెలిపారు. విపత్తులను సైతం రాజకీయంగా వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. ముఖ్యమంత్రి శవాలమీద పెంకులు ఏరుకున్నట్లుగా ప్రతిదాన్నీ రాజకీయంగా చూస్తూ బాధ్యతల నుంచి తప్పుకుందామంటే కుదిరే పనికాదన్నారు. తిత్లీ తుఫాన్ నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందిస్తే ఉదారంగా ఆదుకుంటామని ఓ పక్క కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ ప్రకటిస్తే, మరోపక్క దేశం నేతలు కేంద్రాన్ని తిట్టి బదనాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తుఫాన్ సంభవించిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, మాణిక్యాలరావులను శ్రీకాకుళం పంపామని గుర్తుచేశారు. హుదూద్ తుఫాన్ కంటే అధికంగా రైతులు తిత్లీతో నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. విలేఖర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, కోశాధికారి సన్యాసిరాజు, కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.