తెలంగాణ

చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూలై 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నిజాంచక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా పూర్వ వైభవం తీసుకువస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల హామీపై నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మరో పోరు మొదలయ్యింది. ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ యువనేత, తెలంగాణ సామాజిక పోరాట సమితి (టీఎస్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ పోరాటానికి సిద్ధమయ్యారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికుల నినాదాలు, ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ వర్గాల మద్ధతుతో శనివారం బోధన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు చెరకు రైతులు, సుగర్స్ కార్మికులు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో చెరకు రైతులు ఇక్కడికి తరలివచ్చి ఆమరణ దీక్ష చేపట్టిన ఉప్పు సంతోష్‌కు సంఘీభావం తెలిపారు. మొదటి రోజు ఆయనకు మద్దతుగా టీఎస్‌పీఎస్ పట్టణ కమిటీ నాయకులు సూర్యప్రకాష్‌రెడ్డి, బీర్కూర్ బుజ్జి, గంధం రాజేశ్, రిటైర్డ్ టీచర్ కొండయ్య, గౌస్‌పాషాలు కూర్చున్నారు. వీరికి నిజాం సుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, సిపిఐఎంఎల్ న్యూ డెమొక్రసీ సబ్‌డివిజన్ కార్యదర్శి మల్లేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్ అప్పా, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి గౌతంకుమార్, ఆర్‌ఎస్‌పీ నాయకుడు యార్లగడ్డ సాయిబాబా, ఐఎఫ్‌టియు నాయకులు వరదయ్య, కార్మిక సంఘాల నాయకులు కుమారస్వామి, సత్యనారాయణ, రవిశంకర్‌గౌడ్‌లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్ అధినేత ఉప్పు సంతోష్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ విషయంలో సర్కారు అనుసరిస్తున్న తీరు వల్లనే తాను ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టానని వివరించారు. టీఆర్‌ఎస్ అధికారంలోనికి వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ ఫ్యాక్టరీ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని, ఫ్యాక్టరీకి పూర్వవైభవం దేవుడెరుగు కానీ ఉన్న కర్మాగారం మూతపడిందని విమర్శించారు. దాంతో రెండున్నర సంవత్సరాలుగా కార్మికులు వేతనాలు లేక బజారున పడ్డారని, వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంసుగర్స్ మూతపడటం వలన చెరకు రైతులు సైతం అయోమయ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోందన్నారు. చెరకు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా సర్కారు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోక పోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల ఆస్తిగా చెప్పుకోవచ్చని దీనిని సాధించుకునే వరకు తన పోరాటం ఆగదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు, కార్మికుల పక్షాన తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నానని తక్షణమే ప్రభు త్వం ఈ చక్కెర కర్మాగారాన్ని స్వాధీ నం చేసుకుని పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఫ్యాక్టరీ ఉద్యమానికి కులసంఘాల సంపూర్ణ మద్దతు
బోధన్ నిజాంచక్కెర కర్మాగారం కోసం టీఎస్‌పీఎస్ అధినేత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు స్థానికంగా ఉన్నటువంటి కులసంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. మొదటి రోజు దీక్షా శిబిరం వద్దకు వివిధ కుల సంఘాల నాయకులు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రజక సంఘం, మున్నూరు కాపు, పద్మశాలి, గంగపుత్ర, మోచి, గోసంగి సంఘాల సభ్యులు మద్ధతును ప్రకటించారు.