తెలంగాణ

బీజేపీలో ఉప్పొంగిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణలో అమిత్‌షా ఎన్నికల శంఖారావంతో రాజకీయం రగులుకుంది. ముందస్తు ఎన్నికలకు ఉత్సాహంగా ఉరకలెత్తుతున్న టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ శ్రేణుల్లో అమిత్ షా పర్యటనతో ఉత్సాహం ఉప్పొంగింది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కేవలం రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభకే పరిమితం కాకుండా రెండు మూడు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా కార్యకర్తల్లోనూ పూర్తి సంతృప్తిని కలిగించడంతో పాటు అమిత్ షా శ్రమదానం కార్యక్రమాన్ని అనుసంథానం చేసి సామాజిక చైతన్యానికీ వీలుకల్పించింది. దేశ వ్యాప్తంగా మొదలైన ‘ స్వచ్ఛతా హి సేవ’ జాతీయ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకావడంతో పాటు శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించి, లాల్ దర్వాజాలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. హిందూ ఓటర్లను ఆకర్షించడంతో పాటు పాత బస్తీ అడ్డాలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు మీడియా సమావేశంలో ఎంఐఎంపై అమిత్‌షా విరుచుకుపడ్డారు. గతంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత్‌షాపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈసారి మాటలతో కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ చేసిన కృషిని, కేంద్ర ప్రభుత్వం అనుమతించిన జాతీయ విద్యాసంస్థల వివరాలతో పాటు ఏ పథకానికి ఎంత మొత్తాన్ని విడుదల చేసిందీ వివరించారు. 13వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి 16,597 కోట్లు మాత్రమే రాగా, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులతో 1,15,605 కోట్లు ఇచ్చామని, ఇంత వరకూ కేంద్రం రాష్ట్రానికి 2.30 లక్షల కోట్లు ఇచ్చిందని షా వివరించారు. అక్కడితో ఊరుకోని షా ఇటు కేసీఆర్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే మరో పక్క చంద్రబాబును, కాంగ్రెస్ పార్టీనీ టార్గెట్ చేశారు. తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని రజాకర్ల చేతుల్లో పెడతారా అంటూ కాంగ్రెస్‌కు అధికారం అందజేయవద్దనే సందేశాన్ని ఇచ్చారు. చంద్రబాబునాయుడు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ హామీలను నిలదీశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని పేర్కొన్న షా, 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా కేసీఆర్‌కు పట్టదని ఆరోపించారు. అమిత్ షా పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్ , జీ కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్‌రావులు మాట్లాడుతూ అమిత్‌షా సభ పర్యటన ద్వారా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టయిందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల కూటమిని ప్రజలు నమ్మబోరని, నరేంద్రమోదీనే తమకు బ్రహ్మాస్తమ్రని చెప్పారు. సర్వేలు నమ్మేవిధంగా లేవని, తెలంగాణలో పాగా వేస్తామనే నమ్మకం తమకు కుదిరిందని నేతలు పేర్కొన్నారు. ప్రజాచైతన్య యాత్ర ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత ఎంత ఉందో తమకు తెలిసిందని, చంద్రబాబు కోర్టు నోటీసులకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. మొత్తంగా అమిత్‌షా పర్యటనతో కార్యకర్తల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యాయని, టీఆర్‌ఎస్‌తో ఎలాంటి దోస్తీ లేదని అమిత్ చెప్పడంతో కార్యకర్తలు మరింత నమ్మకంగా పనిచేసేందుకు వీలైందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అమిత్‌షాకు ఘన స్వాగతం
రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న అమిత్‌షాకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, పి మురళీధరరావు, దత్తాత్రేయ, రామచందర్‌రావు, థింక్ ట్యాంక్ చైర్మన్ దినేష్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు అమిత్‌షాకు స్వాగతం పలికారు.

శ్రమదానం
హైదరాబాద్ చేరుకున్న వెంటనే అమిత్‌షా నేరుగా ఎన్టీఆర్ స్టేడియం వద్దకు వచ్చి స్వచ్ఛతా హి సేవ జాతీయ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లు సైతం ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు శ్రమదానం చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ నాటికి పూర్తి లక్ష్యాలను సాధించే క్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. గాంధీ కలలను సాకారం చేయడమే ఈ ఉద్యమ లక్ష్యమని అమిత్ షా వ్యాఖ్యానించారు.
జర్నలిస్టుల మృతిపై వినతిపత్రం
రాష్ట్రంలో సరైన సౌకర్యాలు లేక, వైద్యం అందక 220 మందికిపైగా పాత్రికేయులు మరణించారని పేర్కొంటూ వారి జాబితాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు దేవులపల్లి అమర్ అమిత్ షాకు అందజేశారు. నాలుగేళ్లలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారని చెప్పారు. వారి కుటుంబాలను బీజేపీ ఆదుకోవాలని కోరారు.