తెలంగాణ

కేంద్రం ఇచ్చింది.. రాష్ట్రం దాచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. 2015 ఖరీఫ్ పంటకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు త్వరలో ఇస్తాం’ అంటూ తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గత ఆరునెలల నుంచీ పదే పదే చెబుతున్నా, రైతులకు మాత్రం నిధులు అందడం లేదు. 2015 ఖరీఫ్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితివల్ల తెలంగాణలోని 464 మండలాలకుగాను 231 మండలాలను కరవుపీడిత ప్రాంతాలుగా రాష్ట్రం ప్రకటించింది. కరవుపీడిత ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తారు. రైతులకు నేరుగా అందే సాయమిదే. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం 702 కోట్లు 2016 జనవరిలో ఇచ్చినప్పటికీ, ఈ నిధులు రైతులకు ఇప్పటి వరకూ అందించలేదు. రైతులకు సుమారు 1500 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు లెక్కలు వేశాయి. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఖజానాలో జమ చేసుకున్న ప్రభుత్వం, రైతులను నిర్లక్ష్యం చేస్తోంది. ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకు అందించలేదన్న ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ నుండి వ్యవసాయ శాఖకు నిధులు రావాలని, తర్వాత వీటిని రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెబుతున్నారు.
వర్షాధారంగా వేసే వరి, జొన్న, సజ్జ, తైదలు (రాగులు), వేరుసెనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఆముదం, కుసుమ, కందులు, ఉలవలు, పెసలు, సెనగ, పత్తి, చెరకు పంటలకు నష్టం జరిగితే హెక్టారుకు 6.8వేల రూపాయలు (మొక్కజొన్నకు మాత్రం 8,333 రూపాయలు) ఇస్తామని ప్రభుత్వం 2015 జూన్ 15న జీఓ జారీ చేసింది. ఇవే పంటలను సాగునీటిపారుదల కింద వేసి ఉండి, కరవువల్ల ఎండిపోతే హెక్టారుకు 13,500 (మొక్కజొన్నకు మాత్రం 8,333) ఇస్తామని ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తోడుగా రాష్ట్రం కూడా మరికొంత మొత్తం జమచేసి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తారని అంతా భావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులు ఇప్పటివరకు రైతులకు అందించలేదు. రైతుల బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రుణమాఫీ నిధులను కొంత మొత్తం రైతుల అకౌంట్లలో వేశారు. అంటే రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రభుత్వం కేవలం నిధులను బ్యాంకులకు అందిస్తే, వారంలోగా రైతుల అకౌంట్లలో ఇన్‌పుట్ సబ్సిడీ జమైపోతుంది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే ఒక్కో రైతుకు 10 వేల నుంచి 20 వేల వరకు లభిస్తాయని బ్యాంకర్లు చెబుతున్నారు. తాత్సారం ఎందుకు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోతోంది.
తెలంగాణలో సాధారణ పంట విస్తీర్ణం 41.43 లక్షల హెక్టార్లుకాగా 2015 ఖరీఫ్‌లో 35.78 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. 2015 వర్షాభావ పరిస్థితివల్ల 22 లక్షల మంది రైతులకు సంబంధించిన 13.75 లక్షల హెక్టార్లలో పంటలకు అపారనష్టం జరిగింది. ఎనిమిది వేల కోట్ల రూపాయల పంటల ఉత్పత్తులు ఎండిపోయాయని అంచనావేశారు. 2015 జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 25 శాతం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 18 లక్షల బోర్‌బావులు ఉండగా, వీటిలో 70 శాతం బావులు ఎండిపోయాయి. కరవు పరిస్థితి వల్ల మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల నుండి రాష్ట్ర రాజధానికి, ముంబాయి, భీవాండి, పూనే, అహ్మదాబాద్ తదితర నగరాలకు 14 లక్షల మంది రైతులు, రైతుకూలీలు వలసపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2015-16లో తెలంగాణకు చెందిన 350 మంది రైతులు అప్పులు తదితర కారణాల మూలంగా ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు పరిస్థితి పరిశీలించేందుకు కేంద్రం నుండి సీనియర్ ఐఏఎస్ అధికారి ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం 2015 డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ వచ్చింది. ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక నివేదిక ఇస్తూ, కేంద్రం నుండి 3065 కోట్ల రూపాయలు లభించేలా చూడాలని కోరారు. కేంద్రం 702 కోట్ల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీకోసం, మరో 89 కోట్లు తాగునీరు, పశుగ్రాసం తదితర అవసరాల కోసం ఇచ్చింది.
2014-15లో రాష్ట్రంలో 72 లక్షల టన్నుల ఆహార పంటలు ఉత్పత్తికాగా, 2015-16లో కరవుపరిస్థితి వల్ల కేవలం 48.63 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. రైతులు భారీ నష్టానికి గురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఎందుకు తాత్సారం చేస్తుందన్న విషయం స్పష్టం కావడం లేదు.