బిజినెస్

మళ్లీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస రెండు వారాల నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
సెన్సెక్స్ 475, నిఫ్టీ 151 పాయింట్లు వృద్ధి
ముంబయి, డిసెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం వరుస రెండు వారాల నష్టాల నుంచి కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ దాదాపు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్‌తో పోల్చితే బలపడిన రూపాయి మారకం విలువ, పారిశ్రామికోత్పత్తి సూచీ పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనంతోపాటు అమెరికా ఫెడ్‌రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ప్రభావం మదుపరులపై లేకపోవడం మార్కెట్లను లాభాల్లో కదలాడించాయి. ఈ క్రమంలోనే సోమవారం నుంచి గురువారం వరకు పరుగులు పెట్టాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటు 18 శాతం దిగువనే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం, కాంగ్రెస్ డిమాండ్‌కు అనుగుణంగానే 1 శాతం అదనపు పన్నును ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అయితే శుక్రవారం మాత్రం నష్టాలు వాటిల్లాయి. పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అర్ధ వార్షిక ఆర్థిక విశే్లషణలో దేశ జిడిపి వృద్ధిరేటు అంచనా 7-7.5 శాతానికి తగ్గింది. ఇంతకుముందు ఇది 8.1-8.5 శాతంగా ఉంది. కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జిడిపి వృద్ధిరేటును తగ్గించాల్సి వచ్చిందని కేంద్రం పేర్కొంది. దీంతో మార్కెట్‌లో మదుపరుల పెట్టుబడుల జోరు ఒక్కసారిగా ఆగిపోయింది. అమ్మకాల ఒత్తిడిలో మునిగిపోయారు. ఫలితంగా శుక్రవారం సెనె్సక్స్ 284 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయాయి. అయితే అంతకుముందు నాలుగు రోజుల లాభాలతో గడచిన వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్ 474.79 పాయింట్లు లాభపడి 25,519.22 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 151.50 పాయింట్లు పెరిగి 7,761.95 వద్ద స్థిరపడింది. అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 1,084 పాయింట్లు, నిఫ్టీ 331 పాయింట్లు క్షీణించాయి. ఇకపోతే గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) సైతం దేశీయ మార్కెట్లలోకి 242.94 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. నిజానికి గత నెల నవంబర్‌తోపాటు, ఈ నెల ఆరంభం నుంచి ఎఫ్‌పిఐలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. అయితే గత వారం మళ్లీ పెట్టుబడుల దిశగా నడిచారు. ఇక బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 2.84 శాతం, మిడ్-క్యాప్ 3.25 శాతం చొప్పున పెరిగాయి. విద్యుత్, మెటల్, రియల్టీ, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, టెక్నాలజీ, ఆటో, ఐటి, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 4.24 శాతం నుంచి 0.94 శాతం పెరిగింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,007.51 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 77,988.20 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 14,350.77 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 72,952.91 కోట్ల రూపాయలుగా ఉంది.