అక్షర

జీవితసత్యాల కలబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా కథలు 2014 (కథల సంకలనం)
సంకలనకర్త: సి.హెచ్.శివరామప్రసాద్,
వెల:రు.150/-
ప్రతులకు- నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ చౌరస్తాదగ్గర, హైదరాబాద్

నేటి తెలుగు కథ సమకాలీనమైన వస్తువుతో ప్రత్యేకతను చాటుకుంటోంది. జీవన వాస్తవికతకి పెద్దపీట వేస్తోంది తప్ప కాలక్షేప కథగా, సినిమా కథగా ఉండటం లేదు. ఇందుకు ఉదాహరణే ‘‘మా కథలు 2014’’. ఇంటర్నెట్ యుగంలో కూడా మనిషి కథకే ప్రాధాన్యమని ఈ సంకలనం వెల్లడిస్తుంది. కథా రచయిత సిహెచ్.శివరామప్రసాద్ సంకలనం చేసిన ‘‘మా కథలు 2014’’లో నలభై అయిదు కథలున్నాయి. ఇంతకుముందు మా కథలు- 1912, 1913 కథాసంకలనాలు కూడా వీరే ప్రచురించారు. ఒక్క సంవత్సరంలో వివిధ పత్రికలలో ఎన్నో కథలు వస్తూ వుంటాయి. వాటిల్లో మెరికల్లాంటి కథలు ఎంపిక చేసి పాఠకులకి అందించడం సామాన్యమైన విషయం కాదు.
ఈ కథాసంకలనంలోని కథలన్నీ మంచి కథలే. మంచి కథ అంటే చదివింపజేసేది, ఆలోచింపజేసేది, ఉత్తేజపరిచేది. ఇందులోని మొట్టమొదటి కథ ‘‘అమ్మకో అబద్ధం’’. ఈ కథా రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి కవయిత్రి కూడా. శుక్రనీతి ప్రకారం అబద్ధం కూడా జీవితంలో ఒక్కొక్కసారి మంచిదే. దీనిని వివరించే కథ ఇది. అమ్మ ఆనందంకోసం, సంతృప్తికోసం, జీవితంకోసం అబద్ధమాడటం తప్పుకాదంటూ రాయబడిన ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. అంతేకాదు-నగరాలలో ‘అపార్ట్‌మెంట్’ల సంస్కృతిని కూడా తెలియజేసిన కథని సహజత్వంతో నడిపించారు గౌరీలక్ష్మి.
కొందరు రాయాలని వున్నా కొన్ని కథలు రాయలేరు. ‘‘బాగుండదు’’ అనుకుంటారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకచోట ‘‘జీవిత రహస్యాలను పరిచయం చేసేది కథ’’అన్నాడు. ఎ.జి.కృష్ణమూర్తి ఇటువంటి రహస్యాన్ని వెల్లడించే కథ- ‘‘ఎఫైర్’’రాశారు. వస్తువు చాలామందికి తెలిసిందే, అనుభవంలో ఉన్నదే. దీనిని ‘‘ప్రజంట్’’చేసిన పద్ధతివల్ల స్పందింపజేస్తుంది. సాంసారిక సమస్యలతో సతమతమయ్యే, ఆత్మన్యూనతాభావంతో దిగులుచెందే ఒకడి కథ ఇది. మరొక స్ర్తితో సహజీవనం గడపాలనుకొంటాడు. మిత్రుడు వద్దన్నా వినడు. చివరికి పతనమవుతాడు. భారతీయ దాంపత్య ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని ఉపదేశించే కథ ఇది.
దాట్ల దేవదానంరాజు చెయ్యి తిరిగిన కథారచయిత. లోక పరిశీలన గల కథకుడు. యానాం (పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోది)లో ఉంటూ ప్రాంతీయ కథలు రాస్తూ ఉంటారు. ఇందులోగల ‘‘కల్యాణపురం’’ కథ కూడా అటువంటిదే. యానాంలో ఒకనాటి సామాజిక వైవాహిక పరిస్థితిని వెల్లడించే కథ ఇది. ఆంగ్లేయుల కాలంలో బాల్య వివాహాలు నిషిద్ధం. యానాం ఫ్రెంచివారి పరిపాలనలో ఉండటంవల్ల ఆ చట్టం ఇక్కడ వర్తించదు. అందుకని గోదావరి జిల్లాలవారు యానాం వచ్చి వెంకటేశ్వరస్వామి గుడిలో బాల్యవివాహాలు చేసేవారట. అప్పట్లో ఆ ప్రాంతానికి కల్యాణపురం అని పేరు. ఇప్పటికీ ఆ గుడి వుంది. ‘‘కల్యాణ వెంకటేశ్వరుడు’’అని అక్కడివారు అంటూ వుంటారు. ఇది ప్రాంతీయ కథల్లో అపూర్వమైన కథ.
జిల్లా కలెక్టర్‌కి ఒక సర్పంచ్ ఇంట్లో టేబుల్ మీద భోజనం చెయ్యాలనిపిస్తుంది. ఇది వింతగా లేదూ? ఈ ఇతివృత్తంతో, ఉత్కంఠగా - ఈ కథాసంకలనకర్త శివరామప్రసాద్ రాసిన కథ ‘‘కోరిక’’. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక వుంటుంది. అందులో విచిత్రమైనవీ వుంటాయి. ఆత్మక్షోభను తీర్చుకొనే కోరికలుగలవీ వుంటాయి. ఒకనాడు తనను తక్కువ కులం వాడినని ఈసడించినవాడు ప్రతిభతో కలెక్టర్‌గా చెయ్యాలన్న కోరికను తీర్చుకొన్నాడు. ఇది జీవితంలోని మరో కోణాన్ని తెలిపే కథ.
గంథం యాజ్ఞవల్కశర్మ ప్రసిద్ధమైన గొప్ప కథారచయిత. ఇప్పటికి దాదాపు 200 కథలు రాశారు. ఈయన రాసిన ‘‘జీవన వేదం’’ కథ ఈ సంకలనానికి పేరు తీసుకొస్తుంది. జీవితంలో నిలకడ ఉండాలనీ, ‘‘డబ్బు ఒక జబ్బు’’అనీ ఈ కథలో మనకి బోధిస్తారు. ఈ కథలో భారతీయ వైవాహిక బంధం విశిష్టమైనదని తెలిపారు. కనె్నగంటి అనసూయ ఇటీవల బాగా రాయడమేకాదు- మంచి కథల్ని, వినూత్న కోణంనుంచి రాస్తున్నారు. ‘‘నువ్వు అమ్మవే గదమ్మా’’అనే ఈమె కథ మనల్ని ఆర్ద్రం చేస్తుంది. ఎనె్నన్నో మంచి కథలు రాసిన ‘‘ఎలక్ట్రాన్’’ (పి.వి.రమణారావు) ‘‘చిన్న ఉద్యోగాలు లేదా క్రింది ఉద్యోగులు కూడా వ్యవస్థ ప్రగతికి కారకులు’’గా గుర్తించాలంటూ కొత్త కోణాన్ని ప్రదర్శించారు. ‘‘పదుగురాడు మాట’’ కథలో. సమ్మెట ఉమాదేవి కథ ‘‘తడి’’ నీటి అవసరాన్ని, నీరు లేని దుస్థితిని తెలియజేస్తుంది. నీటి వ్యాపారంపై ధ్వజమెత్తిన కథ ఇది. సలీం ‘‘గొప్ప నవలా రచయితే కాదు, కథారచయిత కూడా. విభిన్న వస్తువుతో రాయగల సత్తాఉన్న రచయిత అనటానికి ‘‘నీటి బుడగలు’’ కథ ఒక సాక్ష్యం. ఎవీరామిరెడ్డి, రామాచంద్రవౌళి, అంబల్ల జనార్దన్, చంద్రశేఖర్ అజాద్, విహారి, మంత్రవాది మహేశ్వర్ మొదలైనవారి కథలు చదివితే జీవిత సత్యాలు తెలుస్తాయి. ‘‘మా కథలు 2014’’చదవడం అంటే మనల్నిమనం చదువుకోవడమే. ఒక మంచి కథాసంకలనం అని నిశ్సంసయంగా చెప్పాలి.

-ద్వా.నా.శాస్ర్తీ