నెల్లూరు

మెరుపు - నెల్లూరు : స్ఫూర్తి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం... ఓ మోస్తరు గ్రామంలోని పాత రైల్వే స్టేషన్ అది.... వూరికి కాస్త దూరంగా విసిరేసినట్టుటుంది. అది జంక్షన్ కాకున్నా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఆగుతాయక్కడ. అయినా జన సంచారం ఎక్కువగా వుండదు. సూర్యుడు అలసి సొలసి పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. సంజె వెలుగుల్లో ఆకాశమంతా మోదుగపూలు తివాచి పరిచినట్లుగా వుంది. కాసేపటికి సూర్యుడు పూర్తిగా కనుమరుగై పోయాడు. చీకట్లు దట్టంగా నల్లరంగు జల్లుకుంటూ కమ్ముకుంటూ వస్తున్నాయి. చలిగాలులు మొహానికి తగిలి శరీరాన్ని వణికిస్తున్నాయి.
అప్పుడు వున్నట్టుండి అవసరమైన పని మీద విజయవాడ వెళ్ళాల్సివచ్చింది. బస్సులో వెళితే రెండు, మూడు గంటల కన్నా ఎక్కువే పడుతుంది. అందుకని ట్రైన్‌లో వెళ్ళడానికి నేను నిశ్చయించుకొన్నాను. 7.30 ట్రైన్‌ను అందుకోవాలని త్వరత్వరగా స్టేషన్‌కు వెళ్ళాను. స్టేషన్ మాస్టరు నన్ను చూసి ‘‘ఏం గంగాధరం గారు ఏమిటి ఆకస్మిక ప్రయాణం’’ అనగా ‘‘విజయవాడ వెళ్ళాలండి’’ అనగానే ‘‘ట్రైన్ 30 నిమిషాలు ఆలస్యం’’ అని చెప్పాడు స్టేషన్ మాస్టరు. ఈలోగా ఫోన్ రావటంతో లోపలకి వెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్. ఎవరూ లేని రైల్వే స్టేషన్ సముద్రపు ఒడ్డున ఒంటరి లైట్ హౌస్‌లా వుంది.
ఏం పాలుపోక ప్లాట్‌ఫామ్‌పై నున్న బెంచిపై కూలబడ్డాను. కాసేపటికి విసుగనిపించి స్టేషను పరిసరాలు గమనిస్తూ నించున్నాను. స్టేషన్నుండి బయటకు పోయే దారివద్ద బెంచి పక్కన ఓ ముసలమ్మ కూర్చుని వుంది. చిన్న గంపలో కజ్జికాయలు, జంతికలు వంటి చిరుతిండ్లు అమ్ముతోంది. ట్రైన్ వచ్చే దాకా అవ్వతో మాట్లాడవచ్చని బ్యాగు తీసుకొని అటువైపు వెళ్ళసాగాను.
అంతలో ఎక్కడినుండి ఊడిపడ్డాడోగాని ‘్ధర్మం చెయ్యండి సార్’ అన్నాడు. చూడటానికి ఆరోగ్యంగానే వున్నాడు. నలభై యేళ్ళుంటాయోమో వాడికి. నేను వాడ్ని ఎగాదిగా పరీక్షగా చూసి ఏమి మాట్లాడకుండా ముందుకు పోతున్నా. వాడు మళ్ళీ అడిగాడు. అయినా ‘‘కష్టపడి పని చేసుకొనే శక్తివుంది. ఇలా నీచంగా అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదా’’ అని అడిగా. వాడు ఏమి పట్టించుకోకుండా వౌనంగా వున్నాడు. ఓ పట్టాన నన్ను వదిలేట్టుగా లేడు. వాడి నస భరించలేక జేబులు తడిమితే చిల్లర లేదు. ఇహ లాభం లేదనుకొని పది రూపాయలు ఇచ్చి పంపా.
వెళ్ళి అవ్వ పక్కనున్న బెంచిపై కూర్చుంటున్నా అపుడు అవ్వ అంటుంది. ‘‘వీళ్ళింతే నాయనా! పనిబాట లేని సోంబేరి ఎదవలు. కష్టం జేసుకొనే ఓపికుండి కూడా అడుక్కుతినడం ఛీ.. యాక్..్థ. రోషం లేని ఎదవలు.. ఆ ఎదవలకి సిగ్గులేదు. బుద్ధిరాదు’’ అంటూ మొహం తిప్పుకొంది. అపుడు అవ్వను దగ్గరిగా పరిశీలించా, మడతలు పడ్డ ఒళ్ళు, పాత చీర, పైన రంగు వెలసిన పాత స్వెట్టర్ వేసుకొంది. తలపై నుంచి చెవులు కప్పుతూ చిన్న స్కార్ఫ్ కట్టుకోనుంది. అవ్వ కళ్ళల్లో తేజస్సు తగ్గిపోయినా ఏదో స్థిరమైన భావాన్ని ప్రకటిస్తున్నట్టుంది.
అవ్వతో మాటలు కలుపుతూ... ‘‘అవ్వా మీదేవూరు? అంటే మాదీవూరే నాయనా నేను మా ముసలాయన వుంటాం. ఆయనేమో మంచాలు, ప్లాస్టిక్ కుర్చీలు అల్లుతూ వుంటాడు. నెలకు రెండు అల్లుకుంటే చాలు నాయనా మా పొట్టలు గడచిపోతాయి, ఎట్టాగు రేషన్ బియ్యం, వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తాది గదా’’.
ఎంతమంది పిల్లలు అవ్వా అన్నాను. ‘‘ఓ కొడుకు, కూతురు నాయనా, వాళ్ళకు పెళ్ళిళైపోయినాయి. ఎనిమిదేళ్ళ క్రితం నా కూతురు ఎవుడ్తోనో వెళ్ళిపోయింది. అప్పట్నించి దాన్ని జూళ్ళ. యాడుంటాదో? వుండాదో లేదో, వస్తాదో రాదో కూడా తెలియడంలే. అయినా అన్నీ వదిలేసుకున్నాంలే’’.
మరైతే కొడుకున్నాడుగదా అన్నా.. ‘‘హు అంటూ దీర్ఘంగా నిట్టూర్చి, వుండేవాడు. పైకే పోయాడు అంటూ ఆకాశంవైపు నిర్వేదంగా జూసింది. వాడు బంగారు కొండట్టిగుణం గదా. బంగారం పనిజేసేవోడు. పెళ్ళై వాడికి నాలుగేళ్ళ కొడుకు. కోడలు గూడా నాణ్ణెగెత్త. అందరం బాగానే గదా వుణ్ణింది. రెండు చేతుల్తో సంపాదించేవాడు నాయనా అదేదో ఆటల్లో పందెంలు బెట్తారంటగదా, వాటికి మరిగి అప్పులు పాలైపోయినాడు. అప్పులోళ్ళు ఇంటిమీదబడేసరికి, ఏం జేయాలో తెలవక సైనేడ్ బిళ్ళ తిని సచ్చిపోనాడు’’ అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకొంటుంది. అయినా ‘‘మనం అనుకున్నది అనుకున్నట్టుగాని జరిగితే మనిషికి దేవుడంటే మతి వుండదని పైకి తీసుకొనిబోయినాడు. ఓ సంవత్సరంపాటు కోడలు, మనవడు కూడా మాతోనే వున్నారు. ఆ తర్వాతేమో కోడలు పుట్టింటికిబోయి వేరే పెళ్ళి జేసుకొంది. పోనీలే మంచిదేగదా చిన్నపిల్ల. మా అతిగతి జూసేవాళ్ళు ఎవరూ లేరు. అయినా సరే మేం బతుకుతుండాం’’
అవ్వా ‘‘తాత సంపాదన మీ ఇద్దరికి సరిపోతుంది గదా! అయితే నువ్వు ఇంకా కష్టపడటమెందుకు’’ అని ప్రశ్నించా. ‘‘నా ఒంట్లో ఓపికున్నన్ని దినాలు కష్టపడతా. నాలుగు రూపాయలు సంపాదిస్తా. కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు చేతులు లేనోళ్ళు, కష్టాల్లో వున్నోళ్ళకి నా చేతి మీదుగా రూపాయిస్తే ఎంత సంతోషం నాయినా. అయినా పుణ్ణెం సంపాదించుకోకపోతే వచ్చే జన్మలో దరి (తోడు) లేని పుట్టుక పుడుతామంటా’’. ఆ మాటంటుంటే ఆత్మవిశ్వాసం అవ్వ రూపంలో ఆకారం దాల్చినట్టుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగి విశ్వరూపంలో కృష్ణపరమాత్మ బోధిస్తున్నట్టుంది. చిన్న చిన్న కష్టాలకు కుంగిపోయే వాళ్ళు అవ్వను జూసి ఎంతో నేర్చుకోవాలనిపించింది. సోమరి పోతులంతా అవ్వను చూసి సిగ్గుతో చస్తారనిపించింది.
ఈలోగా రైలు వస్తుందని సూచనగా గంట కొట్టారు. ‘‘నేనెళ్ళొస్తానవ్వా’’ అంటూ బయల్దేరాను. ‘‘జాగ్రత్తగా బోయిరా నాయినా అన్నది అవ్వ బోసి నోటితో’’. ఈలోగా రైలు వచ్చింది. ఎక్కి డోర్ దగ్గర నిలబడ్డా. రైలు కదలబోతూ వుంటే అవ్వ కూడా గంప ఎత్తుకుని బయల్దేరబోతుంది. నేను అవ్వకేసి చేతులూపుతుంటే రైలు వేగంగా ముందుకు కదులుతోంది.

- కె. రవిశేఖర్, నాయుడుపేట
చరవాణి : 9849388182

దేవుడు మామయ్య

చిన్న కథ

‘దేవుడు మామయ్య వచ్చాడు రండర్రా’ కేకపెట్టింది భ్రమరాంబ.
పిట్టగోడ దగ్గర పక్కింటామెతో కబుర్లు చెపుతున్న పెద్దకోడలు సుమతి ‘మా అత్తగారి తమ్ముడు వచ్చాడు. సొంత తమ్ముడు కాదు, పిన్నికొడుకు. చాలా మంచివారు’ చెప్పింది.
‘ఆయన పేరు దేవుడా?’ అడిగింది ఆశ్చర్యంగా పక్కింటామె.
‘కాదు! నిజంగా ఆయన పేరేమిటో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచీ ఈయన ఆరు నెలలకోసారి రావడం చూస్తున్నాను. మా అత్తగారి చేత, మాచేత తనకు ఇష్టమైనవన్నీ చేయించుకు తింటుంటారు. వెళ్లేటప్పుడు పిల్లల చేతుల్లో ఒక కొత్త రూపాయి నోటు పెడుతుంటాడు. కోటీశ్వరుడు. మరి అందుకే ఆయనకి అందరం కలిసి ‘పీనాసి మామయ్య’ అని పేరు పెట్టేశాం. అందరం చాటుగా తిట్టుకునేవాళ్లం’ చెప్పింది సుమతి.
‘కొనే్నళ్ల తరువాత మేము అద్దెకుండే ఈ ఇంటిని కొనేసి మా పేర రాయించాడు. అందరం ఆశ్చర్యపోయాం. ఆయన్ని తిట్టుకున్నందుకు పశ్చాత్తాపపడి కాళ్లమీద పడిపోయి క్షమాపణ కూడా చెప్పుకున్నారు మావారు, మా మరిది. అప్పట్లో 10 లక్షల రూపాయలకు కొన్న ఈ ఇల్లు ఖరీదు ఇప్పుడు కోటిన్నర. సొంత ఇల్లు వుంది కనుకనే ఇంటి అద్దె అంటూ ప్రతినెలా డబ్బు పొదుపు చేసి ఆడపిల్ల పెళ్లి చేశాం. ఈ నగరంలో సొంత ఇల్లంటే మాటలా? మా అబ్బాయికి భాష్యం స్కూల్లో జీతం పదివేలే అయినా ఈ ఇల్లు చూసే పిల్లనిచ్చామని మా వియ్యపురాలు మొన్న నవ్వుతూ అనేసింది కూడా.
అందుకే పిల్లలూ, పెద్దలూ అందరికీ ఆయన ‘దేవుడు మామయ్య’. మా పిల్లలు కూడా తాతయ్య అని ఒక్కరూ పిలవరు. ‘అందరికీ మామయ్యే’ అంది నవ్వుతూ.
‘మాక్కూడా ఇలాంటి మామయ్య ఒకరుంటే ఎంత బాగుండు. ప్రతినెలా 8వేలు అద్దె కట్టాల్సి వస్తున్నపుడు చాలా బాధపడతాం. కానీ ఈరోజుల్లో సొంత ఇల్లు కొనడమనేది ఒక కలే’ అంటూ నిట్టూర్చింది పక్కింటావిడ.
‘మీ ఆస్తి మేమే. మీ సుఖాలు త్యాగం చేసి మమ్మల్ని పెద్ద చదువులు చదివించారు. నాన్నగారు రిటైరవగానే మా దగ్గరకి వచ్చేయండి’ అని అబ్బాయన్నాడు. ‘ఓపిక వున్నంతవరకూ ఎవరి దగ్గరకీ వచ్చేది లేదు. మీ అమ్మ వంట కూడా చేయలేని రోజు వస్తామ’ని అన్నారాయన చెప్పింది.
హాల్లో దేవుడు మామయ్య చుట్టూ చేరి కబుర్లు చెపుతున్న ఆ కుటుంబ సభ్యులు అందరినీ చూస్తూ.. ‘కృష్ణవంశీ సినిమా చూస్తున్నట్లు వుంది’ అంది నవ్వుతూ.
‘నిజమే! వస్తాను. పెద్దకోడలేదీ? అని అడిగేస్తారు ఆయన’ అంటూ హడావుడిగా వెళుతున్న సుమతిని ముచ్చటగా చూసింది పక్కింటామె.
- పి వసంత

స్పందన

నిజంగా రేపటి మనుషులు ఇలాగే ఉంటారేమో..
రేపటి మనుషులు కథ చదివిన తర్వాత రాబోయే తరంలో మనుషులు ఎలా ఉంటారనే విషయం అవగతమవుతుంది. ఆడేరు చెంచయ్య గారురాసినట్లు మానవుడు సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధి సాధించి చిప్‌లతో మానవుని మేధస్సును శాసించే స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సాంకేతిక విప్లవం విజృంభిస్తుంది.మన కళ్ల ముందు ఎంతో మార్పు కనిపిస్తింది కూడా. కథను అల్లిన తీరు కూడా బాగుంది.
- రమ్యశ్రీ, బారకాసు, నెల్లూరు
- వేల్పుల గంగాధర్, నరసింహారావుపేట, గూడూరు

శివరాత్రి కవితలన్నీ బాగున్నాయి
మెరుపులో మహాశివరాత్రి సందర్భంగా ప్రచురించిన కవితలన్నీ నిజంగా ఆ లయకారునికి అక్షరమాలికగా నిలిచాయి. ముఖ్యంగా అన్నీ మాకోసమే శివా అన్న కవితలో వేదగిరి రామకృష్ణ గారు రాసిన ప్రతి వాక్యం అద్భుతం. ఈ సృష్టిలో విలువైనవన్నీ మాకిచ్చి నీవు నిరాకరుడవైనావు స్వామి అని ఎంతో గొప్ప సత్యాన్ని ఆవిష్కరించిన తీరు నిజంగా సూపర్. అలాగే లక్కరాజు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు గారి కవితలు కూడా చాలా బాగా కుదిరాయి. రచయితలకు ధన్యవాదములు. ఏది నిజం కవిత జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది.
- కాశీనాధుని భాస్కరశర్మ, కావలి
- అమృత, కందుకూరు

ఏమిచ్చినా పూల రుణం తీరదు!
పాతూరి అన్నపూర్ణ గారు రాసిన తీరని ఋణం కవిత ఎంత గొప్పగా సాగింది. సాహిత్యంలో ఆమెకు ఎంత పట్టు ఉందనడానికి నిదర్శనంగా కవిత మొదటి లైన్లలోని ‘‘్భవనైక సౌందర్యంతో విశ్వమోహన పరిమళాలు వెదజల్లే సుందర సుకుమార పుష్పాలు’’...అబ్బా ఎంత గొప్ప వర్ణణ హేట్సాప్ అన్నపూర్ణ గారు. నిజంగా మానవ జీవితంలో చివరి వరకు మనతో పాటు పయనించేవి పుష్పాలు. చివరికి మరుభూమికి సైతం మనతో పాటు వచ్చేవి పువ్వులు. ఏమిచ్చి ఈ పూల రుణం తీర్చుకోవాలి. ఏమిచ్చినా తీరని రుణం పువ్వులది.
- చిరువెళ్ల కృష్ణమోహన్,
ఎస్.కె.ఆర్. డిగ్రీ కళాశాల, గూడూరు.

మనోగీతికలు

ఓ తరుణీ..!
తరుణీ విహరించకు ఇక ఊహల్లో
నిలుపుకో నీ ఉనికిని చరిత్ర పుటల్లో

ప్రకృతి వన్నారొకరు
వికృతి వన్నారొకరు
ఉద్ధృతి వన్నారొకరు
జాగృతమవ్వాలిపుడు

యుగాదివన్నారొకరు
సగానివన్నారొకరు
గగనపు అంచులచేరి
జగమైనిండాలిపుడు

ప్రపంచమన్నారొకరు
సమాజమన్నారొకరు
కుటుంబ వ్యవస్థ నీవే
పటిష్ట పరచాలిపుడు

అస్థిరమన్నారొకరు
అద్భుతమన్నారొకరు
ఆశయసాధన కోసం
అంకితమవ్వాలిపుడు

బానిసవన్నారొకరు
బాధ్యతవన్నారొకరు
భవితకు మార్గం చూపే
గురుతర భారం నీదే

పాలితవన్నారొకరు
పీడితవన్నారొకరు
పీడిత వ్యవస్థపై నీ
స్పందన కావాలిపుడు
ప్రేరణవన్నారొకరు
సాధనవన్నారొకరు
సమాజ పురోగతికి నీవే
స్ఫూర్తిగా నిలవాలిపుడు

మార్పుకి మూలం నీవై
ఆర్తిని తీర్చాలిపుడు

- వి.లక్ష్మీభవాని, పొదలకూరురోడ్డు, నెల్లూరు, సెల్: 9959635215

పయనం
నీ జీవన పయనంలో
చేయూతనిచ్చిన వారినీ,
చేరదీసిన వారినీ,
ఆదుకున్న వారినీ,
ఆదరించిన వారినీ,
మరువకూడదురా
మనిషిగా మెసలరా...!
ఆకలి బాపిన వారినీ,
దప్పిక తీర్చిన వారినీ,
సేదతీర్చిన వారినీ,
తలచుకోరా కలకలాం..
ధన్యుడవురా చిరాకలం!

మంచిచెడులు తెలుసుకో
కష్టసుఖాలు పంచుకో,
అందరు ఒకటే అనుకో,
తరతమాలు వదులుకో,
అప్పుడు నీకు నీవే సాటి,
అవుతావు ఆ దేవునికి
నీవే పోటి

- బాలు
చరవాణి : 9866140700

గతం
గతం గతః అన్నారు పెద్దలు
గతం గతిస్తే ప్రస్తుతానికి ప్రాతిపదికేది?
గతం స్వగతంగా ఉండాలి
ప్రస్తుతానికి పునాది కావాలి
భవిష్యత్తుకు బీజంగా మారాలి
మాను ఒకటైనా కొమ్మలు అనేకం
కొమ్మ ఒకటైనా రెమ్మలు అనేకం
రెమ్మలు చాటు మొగ్గలు
సిగ్గుతో పొంగిన బుగ్గలతో
శృంగారానికి సిద్ధమవుతాయి
అంగాంగాలు పొంగిపోయి
కడుపు ఒక కాయకాస్తే
అది గతానికి సంకేతమవుతుంది
భవిష్యత్తుకు బాట వేస్తుంది
గతమెప్పుడు విగతం కాదు
వర్తమానానికి పిల్లవేరుగా
తరతరాలకు తల్లివేరుగా
తరగని పురాతన సంపదకు
దాచిపెట్టిన బంగారు గనిగా
భావితరాలకు చూపుడువేలుగా
బీజప్రాయంగా ఓజో నిలయంగా
అనాదికి పునాదిగా ఒదిగిపోవాలి
గతమెంతో ఘనమని
వర్తమానానికి ఉరివెయ్యకూడదు
భవిష్యత్తును బహిష్కరించొద్దు
ఇవి దేనికది స్వతంత్య్రమైనా
ఇవన్ని అఖండంలోని ఖండాలు
ఒకే గొలుసులోని కొక్కేలు.

- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి, సెల్ : 9490227114

అక్షర యుద్ధం
క్షరం కాని అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని
అనుక్షణం అని సాగిస్తూనే వున్నాను
దృశ్యాన్ని - దౌష్ట్యాన్ని - దీనాన్ని
దగుల్బాజీతనాన్ని - దరిద్రాన్ని
అక్షర క్రమాలలోకి మార్చి అరుస్తూనే వున్నాను
నాలాగ ఎందరో
అక్షర యుద్ధం చేస్తూనే వున్నారు
శిలా హృదయాలను కరగించాలని
స్వార్థపు మెయిలు బారులు తొలగించాలని
అక్షర తూణీరాలను సంధిస్తూనే వున్నాను
వత్సరమంతా వసంతాలే నిండాలని
తడి ఎరుగని కంటిపాపల లోకాన్ని చూడాలని
తొలి వేకువలా బ్రతుకులన్నీ వెలగాలని
ఆకాశం పలకల మీద
ఆశల రంగవల్లులు దిద్దుకుంటూ
సాగిపోతూనే వున్నారు
అమ్ములపొదిలో అక్షరమాల నింపుకొని
అక్షరయుద్ధం చేస్తూనే వున్నారు

- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
చరవాణి : 9052048706

అన్నదాత
అన్నదాతలై అనాథలైతే?
అనాథ ప్రపంచాన్ని ఆదుకునేదెవరు?
కర్షకుడే కరువైతే?
కరువు నుంచి కాపాడెదెవరు?
పనిలేక, తిండి లేక, నీరు లేక
వ్యవసాయమే పెనుశాపమై వేధిస్తుంటే?
వ్యవస్థకు సాయం చేసే
‘వ్యవసాయమే’ కనుమరుగైతే?
వ్యవస్థను కాపాడెదెవరు?
బ్రతుకులే బండబారితే?
భవిష్యత్తులో భావితరాన్ని ఆదుకునేదెవరు?
ఈ పెనుప్రమాదాన్ని ఆపెదెవరు?
ఇక ఆలస్యమెందుకు?
నువ్వే ఒక కర్షకుడివై
ఈ పెను కాలుష్యాన్ని తరిమేయ్!
చెట్లను పెంచి, నీటిని నిల్వ ఉంచి,
పంటను పండించి దేశాన్ని
సస్యశ్యామలం చెయ్యి ఓ భారతీయుడా!

- కేతినేని కొండలరావు, 8వతరగతి, కనిగిరి
చరవాణి : 7386754511

కవితలు

వాడంతే!
గొప్పగా చదువుకున్నా
మానవత్వాన్ని మరచి
స్వార్థంతో మనసు చెడిపోతే
వాడు పరమ మూర్ఖుడు
అయినా ఈ సమాజంలో
వాడో విక్రమార్కుడు!

నానా కష్టాలు పడి
అమ్మాయి చదివి
ఉద్యోగస్తురాలైనా తృప్తి లేక
కనకం కాసులు కావాలని
గొంతెమ్మ కోరికలు కోరు
సృష్టిలో ఆడ మగ సమానమని
కోరికలు ఇద్దరికీ అవసరమని
తెలియని మూర్ఖుడు
అయినా అతనో విక్రమార్కుడు!

పెళ్లయినా పిదప
కొరివి పెట్టేందుకే కొడుకు కావాలని
పెళ్ల్లప్పుడు ఉన్నదంతా
ఊడ్చుకుపోతుందనే భావనతో
అమ్మాయిని కన్నందుకు
తన్ని తగలేస్తాడు
ఏ అమాయకులు కంటారనో
కూతుర్ని కనటంలో
ఆమె తప్పు లేదని తెలియని మూర్ఖుడు
అయినా ఈ సమాజంలో విక్రమార్కుడు!

మసకతోనే మంచం దిగి
పేపరు తిరగేసి నమిలేసి
అందరినీ విమర్శిస్తాడు
ప్రభుత్వాన్నయితే మరీ
తూర్పార పడతాడు
తీర తన ప్రతాపం
చూపించే తరుణం రాగానే
సీసాలకు, పైసాలకు లొంగిపోయి
ఆత్మవంచన చేసుకుని
కేటుగాణ్ణి సీటెక్కిస్తాడు
ఎంత కాలమైనా
వీడు మారడంతే
జ్ఞానమొస్తుందేమో
కుంగా తంతే!

- జంజం కోదండరామయ్య
8985938861

పయనం
నీ జీవన పయనంలో
చేయూతనిచ్చిన వారినీ,
చేరదీసిన వారినీ,
ఆదుకున్న వారినీ,
ఆదరించిన వారినీ,
మరువకూడదురా
మనిషిగా మెసలరా...!

ఆకలి బాపిన వారినీ,
దప్పిక తీర్చిన వారినీ,
సేదతీర్చిన వారినీ,
తలచుకోరా కలకాలం..
ధన్యుడవురా చిరకలం!

మంచిచెడులు తెలుసుకో
కష్టసుఖాలు పంచుకో,
అందరు ఒకటే అనుకో,
తరతమాలు వదులుకో,
అప్పుడు నీకు నీవే సాటి,
అవుతావు ఆ దేవునికి నీవే పోటి

- బాలు
చరవాణి : 9866140700

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882
email: merupunlr@andhrabhoomi.net