కథ

ఇదేం రకం? (సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది పచ్చని పంట పొలాలతో కొబ్బరి తోటలతో పక్కనే నిండుగా పారే గోదావరితో సస్యశ్యామలంగా వుండే కోనసీమలోని ఓ గ్రామం.
తాతలనాటి ఇల్లు, వాకిళ్లు, పాడీ పంట అన్నీ వున్న కుటుంబం అవధానిగారిది. ఆయన తాతగారు రామావధానిగారు. ఆయన అవధానాలు చేసే ఆ ‘అవధాని’ బిరుదు సంపాదించుకున్నారు. ఆయన కొడుకు నారాయణ తండ్రిలా అవధానాలు చేసే సామర్థ్యం లేకపోయినా తండ్రి వెనక పృచ్ఛకుడిగా వుంటూ వుండేవాడు.
ఈ అవధానిగారికి నారాయణ తన తండ్రి పేరు పెట్టాడు గాని, తాతంత కాకపోయినా తండ్రంత పాండిత్యం కూడా అబ్బలేదు. తండ్రి నారాయణగారు కాలం చేయడంతో ఇక ఇంటి పెద్దరికం అవధానికే వచ్చింది.
తాత తండ్రుల పాండిత్యాలు లేకపోయినా వారు ఆచరించే దేవతార్చన, సంధ్యావందనం వంటి అనుచానంగా వస్తూన్న కార్యక్రమాలు మాత్రం క్రమం తప్పకుండా ఆచరిస్తాడు. దానికే భార్యని హడావిడి చేస్తాడు. ఆయనకి ప్రతీ పనిలోనూ ఆవిడ పక్కన వుండాల్సిందే!
* * *
‘ఏమేవ్! నాకు నీళ్లు తొలిపావా?’ ఓ పొలికేక! (అంటే వేడినీళ్లు, చన్నీళ్లు కలిపి పోసుకునే పాళంలో కలపడం)
‘ఆ! నూతి దగ్గర పెట్టాను చూడండి. పక్కనే చన్నీళ్ల బాల్చీ, సబ్బు బిళ్ల, దండెం మీద తువ్వాలు అన్నీ సిద్ధం చేశాను. మీదే ఆలస్యం’ అంది ఆయన భార్య సౌదామిని.
‘అక్కడే మఘోరిస్తున్నావ్. ఇలా వచ్చి నాకు వీపు రుద్ది వెళ్లు’ అంటూ మరో కేక వేశారాయన.
‘ఇదిగోనండీ! వస్తున్నాను. మీకు దేవతార్చనకి అన్నీ అమర్చాలి కదా! ఆ పన్లో వున్నాను’ అంటూనే మొల్లో దోపుకున్న ఓ తుండుగుడ్డకి చేతులు తుడుచుకుంటూ వచ్చిందావిడ హడావిడిగా!
‘ఏమిటా రుద్దడం? పుండు మీద రాసినట్లు. కాస్త గట్టిగా రుద్దలేవూ?’ అన్నాడు అవధాని వీపు రుద్దుతున్న భార్యతో.
‘గట్టిగా రుద్దితే మొన్న మీరు నెప్పెంట్టిందన్నారని మెల్లిగా రుద్దానండీ!’ అంది మెల్లిగా సౌదామిని.
‘ఏడవలేకపోయావు. అతీవృష్టీ, అనావృష్టీ అయితే ఎలా? ఆ రోజు మసిగినె్నలు పీచు, ఇసక పెట్టి తోమేసినట్లు బరికేస్తుంటే కాస్త మెల్లిగా రుద్దమన్నానని మరీ ఇంత మెల్లిగానా? బాగుంది వరస!’ అంటూ విసుక్కున్నాడు. కాస్త బలాన్నుపయోగించిందావిడ.
‘ఆ!ఆ! చాలు చాలు. నీ కోపమంతా నా వీపు మీద చూపించకు’ అన్నాడు.
‘బాగుందండీ! వేలికి వేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి అన్నట్లుంటే ఎలా?’ అందావిడ.
‘అవునే! నేను నీకు అలాగే కనబడుతున్నాను. చవగ్గా దొరికాను కదూ! కట్నాలు, కానుకలు లేకుండా! అందుకని అలాగే ఉంటుందిలే!’ అన్నాడు అవధాని.
‘ఆ! ‘నీ ఎడంచెయ్యి తియ్యి, నా పుఱ్ఱ చెయ్యి పెడతాను’ అన్నట్లు కట్నం లేకపోతేనేం? ఆవారా, ఈవారా గుంజారుగా మీ వాళ్లు మా వాళ్ల దగ్గర్నించీనూ!’ అంటూ కాస్త బలంగా రుద్ది వేడినీళ్లు మొగుడి మీద దిమ్మెరపోసింది.
‘ఈ వేడి చాలా? ఇంకాస్త వేడిగా పొయ్యమంటారా?’ అడిగింది సౌదామిని.
‘అబ్బ! చాలే బాబూ! ఒళ్లు తట్లు తేలేట్టుంది. నీ పతిభక్తి పాడుగానూ! ఇంకా వేడి పోస్తావా? నన్ను బొందితో కైలాసానికి పంపేద్దామనే!’ అంటూ చిందులేశాడు.
ఈ అవధానిగారి స్నాన ప్రక్రియని రోజూ నూతి దగ్గర బాగోతాన్ని వాళ్ల గదిలోంచీ లేస్తూనే కొడుకు, కోడలు, మనవలు చూస్తూ నవ్వుకుంటూ వాళ్ల దినచర్యకి ఉపక్రమిస్తారు.
* * *
ఇక అవధానిగారు దేవతార్చనకి కూర్చుంటే ఆవిడ పక్కనే వుండి ఆయన అడిగేసరికి చేతికి అక్షింతలు, పువ్వులు, గంధం అన్నీ అందించాలి. ఆచమనానికి ఆవిడ చేతిలో నీళ్లు పొయ్యాలి, ఏది చెయ్యకపోయినా రణగొణ ధ్వనే! భర్త సంగతి తెలిసిన సౌదామిని ఆయనకి అనుకూలంగా నడుచుకుంటుంది.
కొడుకు నారాయణ, కోడలు లక్ష్మి మనవరాలు అంతా ఆయన యెడల భయభక్తులతో మెలగుతారు.
సంధ్యావందనం, దేవతార్చన, ధ్యానం అన్నీ ఆయన ముగించేలోపు సౌదామిని అందరికీ వంట ముగిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి మహానైవేద్యం పెడతారు.
ఆయన మెల్లిగా లేచి సావడిలోకి వచ్చి పడక కుర్చీలో కూర్చుంటారు. సౌదామిని సర్దుళ్ల పన్లు, కొడుకు, మనవలు భోజనాలు మొదలైనవన్నీ కోడలికి అప్పజెప్పి ఆవిడ రెండు గ్లాసుల్లో ఆవుపాలు పంచదార వేసి కలిపి ఒక గ్లాసు భర్తకి అందించి తనో గ్లాసు పాలు తాగుతుంది. ఆ కుటుంబంలో ఈ తరం వరకూ కాఫీలు తాగే అలవాటు లేదు. వీరి తరవాతి తరం ప్రారంభించారు.
తరవాత అవధానిగారు రామాయణ, భారత, భాగవతాల్లాంటి ఏదో ఒక పురాణ పఠనం ఓ గంట సాగిస్తారు. సౌదామిని భర్త పక్కన క్రింద చాప మీద కూర్చుని మరునాటికి వత్తులు చేసుకుంటూనో, బియ్యంలో బెడ్డలేరుతూనో భర్త చదివే పురాణం వింటూ వుంటుంది. సందేహాలొస్తే అడుగుతుంది. గొప్ప పాండిత్యం లేకపోయినా అర్థం చెప్పగలడు ఆయన.
ఇంతలో కొడుకు నారాయణ, పిల్లలు ఆఫీసుకి స్కూలుకి ‘వెళ్లొస్తాం!’ అంటూ ఈ దంపతులకి చెప్తారు.
‘మంచిదర్రా! క్షేమంగా వెళ్లి, క్షేమంగా లాభంగా రండి’ అంటారా దంపతులు.
ఇంతలో పొలం నించీ రైతులు, పాలేరు, తెలిసిన వాళ్లు ఎవరో ఒకరు వస్తూంటారు. వాళ్లకి సలహాలిస్తూ, సంప్రదింపులు చేస్తూ అలా సమయం గడిచిపోతుంది. అప్పటికి ఉదయం పదిన్నర, పదకొండు అవుతుంది.
సావిట్లోంచీ అవధాని ఓ కేక పెడతారు. ‘ఒసేవ్! నా కడుపు నకనకలాడిపోతోంది. త్వరగా అన్నం వడ్డించు’ అంటూ.
‘రండి. మీదే ఆలస్యం’ అంటుంది సౌదామిని. ఆయనకి ఏమేమి ఇష్టమో, ఏ కూర ఎలా వండితే ఇష్టమో అలాగే చేస్తుందావిడ.
కొడుక్కీ, కోడలుకి, మనవలకి నచ్చని వంటలేమైనా వుంటే వాళ్లకి కావలసినట్లు చేసుకోమంటుంది. ఆవిడ మాత్రం భర్త కోసం చేసినవే ఆయనకి దగ్గరుండి వడ్డించి ఆయన తిని వెళ్లాక అదే విస్తట్లో తనూ వడ్డించుకుంటుంది. ఎదురుగా కోడలు కూర్చుంటుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్లకొకళ్లు మార్లు వడ్డించుకుంటూ తింటారు. భోజనాలయ్యాక...
‘మీరు వెళ్లండత్తయ్యా! ఈ సద్దుళ్లు, కడగడాలు నేను చూసుకుంటాను’ అంటుంది కోడలు లక్ష్మి.
‘ఇటువంటి కోడలు దొరకడం నేను చేసుకున్న సుకృతం’ అనుకుంటుంది సౌదామిని.
‘ఇటువంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం’ అనుకుంటుంది లక్ష్మి.
* * *
ఆ ఇంట సంక్రాంతి పండగ వచ్చిందంటే సందడే సందడి. ఆ ప్రాంతాల పండగంటే సంక్రాంతి పండగే! ‘సంకెళ్లలో వున్న వాళ్లని కూడా విడుదల చేసే పండగ’ అని అక్కడ నానుడి.
ప్రతీ సంవత్సరం ఆ ప్రాంతాల వారు కూతుళ్లు, అల్లుళ్లు, మనవలని ఆ పండగకి తప్పక పుట్టిళ్లకి పిలుస్తారు. అదే అలవాటు. వీరి కుటుంబంలోనూ! ముందుగానే వారికి పిలుపు వెళ్తుంది. నాడు ఉత్తరాల ద్వారా! నేడు ఫోన్ల ద్వారా! ఇ-మెయిల్ ద్వారా పిలుపులు, జవాబులు ఉంటాయి.
వీరి కోడలు లక్ష్మికి తల్లి లేదు. అన్న, వదినెలు వున్నా వదినె పుట్టింటికి వెళ్లాలనుకుంటుందని తన అన్న రమ్మని పిలిచినా ‘ఇంకో పండక్కి వస్తాలే! అన్నయ్యా’ అంటూ సర్ది చెప్తుంది. ఆమెకి ఇక్కడ ఆడపడుచు, అత్తమామలతో పండగ జరుపుకోవడమే ఇష్టం.
అవధానిగారు, భార్య - కొడుక్కీ, అల్లుడికీ సమంగా కోడలికి, కూతురికీ సమంగా మనవలందరికీ సమంగా డబ్బులిచ్చి ‘పండక్కి మీకు కావలసిన నచ్చిన బట్టలు చూసి కొనుక్కుని కట్టుకోండర్రా!’ అంటూ చెప్తారు. పైన పడితే ఇస్తానని కూడా చెప్తారు. అయినా ఆయన సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన పిల్లలు, పరాయి వాళ్లైనా అల్లుడు, కోడలు కూడా వారిచ్చిన మొత్తంలోనే తమకి కావలసినవి, నచ్చినవి కొనుక్కుని తెచ్చి చూపించి పండగ నాడు ఆనందంగా కట్టుకుంటారు.
అంతేకాదు. కొడుకు, కోడలు; కూతురు, అల్లుడు కూడా వారి స్వంత డబ్బుతో ఈ పెద్ద దంపతులకి బట్టలు కొని తెచ్చి పండగనాడు వారికి ఇచ్చి కాళ్లకి నమస్కరించి వారి ఆశీస్సులు పొందుతారు.
సంక్రాంతికి పండగ వాతావరణం ఆ యింట కన్నుల పండువుగా ఉంటుంది. పిండి వంటల ఘుమఘుమలు, ముగ్గులతో నిండిన వాకిళ్లు, పచ్చటి పసుపు గడపలు; మామిడాకులు, బంతిపూల తోరణాలతో.. ఇల్లు కళకళలాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది.
ఇంట్లో ఆడవాళ్లకి బొమ్మల కొలువు, సందె గొబ్బిళ్లు, పేరంటాల హడావిడులు. మగవారికి టీవీలు, వాట్సప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు, ఫోన్లు ఎవరికి వారే హడావిడి. సాయంకాలం ఆరున్నర, ఏడుకి హడావిళ్లన్నీ సద్దుమణుగుతాయి. అవధానిగారు, సౌదామిని రాత్రి పొద్దుపోతే అరగదని ఆ సమయానికే రాత్రి ఫలహారాలు ముగించి హాల్లో తీరిగ్గా కూర్చుంటారు. మనవలు వారి చుట్టూ చేరతారు.
‘కథలు చెప్పవా? తాతా! మామ్మా!’ అంటూ రామాయణ భారత భాగవతాల్లోని పురాణ గాథలు, నీతిచంద్రికల్లోని కథలు భార్యాభర్తలిద్దరూ వంతులు వేసుకుని చెప్తారు మనవలకి.
వారికి పుస్తకాల్లో చదివినా మామ్మ తాతలు చెప్తుంటే వినడం ఇష్టం. వారికొచ్చిన ఎన్నో సందేహాలు పెద్దవాళ్లని అడిగి తెలుసుకుంటూంటారు. చెప్పే పెద్దవారికీ వినే పిల్లలతోపాటు అటూ ఇటూ వస్తూ పోతూ వింటూన్న వాళ్ల తల్లిదండ్రులకీ సంతృప్తితోపాటు ఆనందం కూడా.
* * *
ఓ పది కేలండర్లు వెనకపడ్డాయి. ఈలోపుగా అవధానిగారి కూతురు, అల్లుడు వారి అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. మరొక నెలలోపే నారాయణ, లక్ష్మీ వీరమ్మాయికి వీరింట పెళ్లి ఉన్నంతలో వైభవంగానే జరిగించారు. రెండు పెళ్లిళ్లూ కూడా ఈ అవధాని దంపతులు దగ్గరుండి జరిపించారు. ముఖ్యంగా సౌదామిని అటు కూతురికీ ఇటు కోడలుకీ అంతా తానే అయి అన్ని పన్లూ చూసుకుంది. ఆవిడ హడావిడిలో వుండగా తన పనులు చూడటం లేదని అవధానిగారు మధ్యమధ్యలో అరుస్తూనే వుండేవారు. ఒక్కోసారి అరిస్తే బాగోదని ధుమధుమలు!
‘ఒసేవ్! ఊళ్లో పెళ్లయితే కుక్కలకి హడావిడి అన్నట్లు నువ్వెందుకే? హైరానా పడతావు. మన పిల్లల పెళ్లి పన్లు మనం చూసుకోలేదూ? అలాగే వాళ్ల పిల్లల పన్లు వాళ్లు చూసుకుంటారు. నువ్వు వచ్చి నాకు బట్టలు అవీ తీసియ్యి. నన్ను పట్టించుకోవడమే మానేశావు’ అంటూ.
‘అబ్బబ్బ! ఉండండీ! లక్ష్మి ఒక్కత్తె పాపం! చిన్నపిల్ల. ఎన్నని చూస్తుంది? నేను చూడకపోతే ఎలా? మీ బట్టలు అలమారాలో వున్నాయి కదా! తీసుకోలేరా? ఈ ఒక్కరోజుకీ! ఆ మాత్రం సర్దుకోలేరూ? మనమేమైనా ఊరి వాళ్లకి చేస్తున్నామా? మన పిల్లలకేగా!’ అంటూనే మధ్యలో వచ్చి భర్తకి కావలసినవి అందిచ్చి వెళ్తోంది సౌదామిని.
మొత్తం మీద మనవరాలి పెళ్లి సవ్యంగా జరిగింది. ‘అమ్మాయితోపాటు మీరిద్దరూ వెళ్లి అక్కడ జరగవలసిన తంతులు చూసి రండి’ అంటూ కొడుకుని, కోడల్ని కొత్త దంపతులు, పెళ్లివారితో పాటు పంపింది సౌదామిని.
ఇంటికొచ్చిన చుట్టాలు ఎవరి దారిన వారెళ్లారు. కూతురు, అల్లుడు కూడా పిల్లలకి, వాళ్లకి ఆఫీసులు సెలవు లేదంటూ వెళ్లిపోయారు. పనిమనిషి, వంట మనుషుల సాయంతో సౌదామిని సర్దుళ్లు, కడుగుళ్లు పూర్తి చేసింది. ఇన్నాళ్లు శ్రమకి ఒక్కసారిగా విశ్రాంతి దొరికేసరికీ సౌదామినికి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చింది. మధ్యాహ్నం భర్తకి భోజనం పెట్టేసి తనూ తినేసి అందర్నీ పంపి తలుపులు మూసుకుని భర్తతో చెప్పింది.
‘నాకు బాగా అలసటగా ఉంది. ఇన్నాళ్లూ సరిగ్గా నిద్ర లేదు కదా! పడుకుని ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేస్తాను. మధ్యలో నన్ను లేపకండి. మీకు మధ్యాహ్నానికి కాఫీ ఫ్లాస్కులో పోసి, చిరుతిళ్లు డబ్బాలతో సహా టేబుల్ మీద పెట్టాను. కాఫీ గ్లాసులో పోసుకు తాగండి ఇవాళ్టికి. అన్నీ పక్కనే వున్నాయి. రాత్రికి టిఫిన్ ఇడ్లీలు హాట్‌పేక్‌లో వున్నాయి. టేబుల్ మీదే ప్లేట్లు, నంజుకుందుకి చెట్నీలు, సాంబారు అన్నీ వున్నాయి. మీకు కావలసినవి వేసుకు తిని మాత్రలు వేసుకోండి. దయచేసి ఈ ఒక్క రోజుకీ ఎలాగో సర్దుకోండి’ అన్న భార్యతో ‘ఏమిటీ? రాత్రికి కూడా లేవవా?’ అన్నాడు అవధాని. ‘చెప్పలేను’
అంటూ వెళ్లి పడుకుండిపోయింది సౌదామిని.
* * *
ఏభై ఏళ్ల తమ దాంపత్య జీవితంలో ఏనాడూ భార్య అతడికి ఇంత నీరసంగా కనబడలేదు. పిల్లల్ని కడుపుతో ఉన్నప్పుడూ, నెప్పులు పడేటప్పుడూ, పిల్లల్ని కన్నాక కూడా భార్య ముఖంలో వెలుగుని, ఉత్సాహానే్న చూశాడతడు. అంత బాధని ఎలా ఓర్చుకుంటోందని, ఉత్సాహంగా ఎలా వుండగలుగుతోందని తను ఆశ్చర్యపోయినా తన పురుషాహంకారం ఆ మాట పైకి అననీయలేదు. పైగా ఆడవాళ్లకి అది సహజమేగా! అన్నట్లు చూశాడే గాని, ఆమెలోని గొప్పతనాన్ని మెచ్చుకోలేకపోయాడు. అయినా వెఱ్ఱిది. ఎప్పుడూ తనకి సేవ చేయాలనే చూసింది. ఎప్పుడూ తన చేత చేయించుకోలేదు. ఇప్పుడింత నీరసంగా వుండి కూడా తనకి కాఫీ టిఫిన్లు అందివ్వలేక పోతున్నానని బతిమాలుతూ చెప్పింది. ఎంత అలసిపోయింది? ఇలా ఆలోచిస్తూ తనూ నడుం వాల్చాడు.
అలిసిపోయి ఉన్నందువల్ల ఆమెకి పడుకోగానే నిద్ర పట్టింది. ఆయనకి నిద్ర పట్టలేదు. భార్యని చూస్తూ గతాలు గుర్తు చేసుకుంటూ పడుకుని కాఫీ సమయానికి లేచి గ్లాసులో కాఫీ పోసుకు తాగాడు. ప్లేటులో మిక్చర్, స్వీటు వేసుకు తింటున్నాడే గాని భార్య గురించే ఆలోచనలు వస్తూన్నాయి.
ఆనాడు తన తల్లి అధికారంతో అత్తరికం చూపినా సహించింది. అలాంటి ఆమెని ఏనాడూ తను మెచ్చుకోలేదు. ‘మెచ్చుకుంటే ఆడవాళ్లు నెత్తికెక్కుతార్రా!’ అనే తాతయ్య మాటల్ని నమ్మి అలాగే ప్రవర్తించాడు తను.
టీవీ పెట్టి చూస్తున్నా ఆలోచనలు భార్యతో తన గత జీవిత అనుభవాలే కళ్ల ముందు మెదలుతున్నాయి. సౌదామిని రాత్రి ఏడైనా లేవలేదు. కడుపులో ఆకలి వేస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి పేపర్ ప్లేట్‌లో రెండు ఇడ్లీలు, చెట్నీ వేసుకుని నోట్లోకి ఎక్కకపోయినా ఎలాగో తిన్నాడు. మాత్రలు వేసుకున్నాడు. భార్య దగ్గరుండి వడ్డిస్తే అరడజను ఇడ్లీలు లాగించేవాడు. ఇక టీవీ చూడబుద్ధి కాలేదు. లైట్లన్నీ ఆర్పేసి బెడ్‌లైటు వేసి తనూ భార్య పక్కనే పడుకుని ఆమె నెరిసిన ముంగురులు సవరిస్తూ వుండిపోయాడు. ఎప్పటికోగాని నిద్రపట్టలేదు.
‘ఒసేవ్! నువ్వు లేకుండా నేనెలా వుంటానే? ఒక్కపూట నువ్వు పడుకుంటేనే నిలవలేక పోతున్నాను. నన్ను వదిలి వెళ్లిపోతావా? పురుళ్లకి కూడా నన్ను వదిలి పుట్టింటికి వెళ్లనిదానివి ఇప్పుడెలా వదిలి వెళ్లావు? హాట్‌పాక్‌లో పెట్టిన ఇడ్లీలు ఎన్నాళ్లు తినమంటావు? ఏభై ఏళ్లు నాతో కాపరం చేసిన నీకు నా సంగతి తెలిసి ఎలా వెళ్లిపోయావు?’ అంటూ ఆమెని కుదిపేస్తూ అరుస్తున్నాడు అవధాని.
ఆవిడ భయపడి లేచింది. ‘ఏమైందండీ? ఎందుకలా అరుస్తున్నారు? టిఫిన్ తిని మాత్ర వేసుకున్నారా?’
‘ఆ! వేసుకున్నా!’ గాభరాగా అంటూ ‘నువ్వెక్కడికీ వెళ్లలేదు కదా!’
‘లేదండీ! మిమ్మల్ని వదిలి ఎక్కడికెళ్తాను? ఎందుకలా అరిచారు?’
‘అరిచానా? ఏం లేదు. నీ భ్రమ’ అంటూ పడుకున్నాడు.
సౌదామిని లేచేసరికి అవధానిగారు నూతి దగ్గర నీళ్లు పోసుకుంటున్నారు. పనిమనిషి వచ్చి నీళ్ల పొయ్యి అంటించినట్లుంది. ఆయనే నీళ్లు తొలుపుకుని పోసేసుకుంటున్నారనుకుంటూ ‘నేను వచ్చి చేస్తాగా?’ అంది.
‘ఏమిటి? ఆ మాత్రం చేసుకోలేనా? మరీ నన్ను చవట కింద జమకట్టకు. ఏదో పెద్ద నువ్వు చేస్తేనే గడుస్తున్నట్లు పోజు!’ తను అలిసిపోయి వుందని శ్రమ పెట్టలేక ఆయన చేసుకుంటున్నాడని ఆవిడకి తెలుసు. ఆ మాట ఆయన పైకి అనడనీ ఆవిడకి తెలుసు. ఇదే రకం ప్రేమ?

ఆర్.ఎస్.హైమావతి.. 94449 45942