సబ్ ఫీచర్

పాల పళ్లు ఊడకపోతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డాక్టర్ రమేష్ శ్రీరంగం

సెల్ నెం: 92995 59615

-ఢా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

ప్రతి వ్యక్తికి రెండు రకాల పళ్లు వస్తాయి. పుట్టిన ఆరు నెలలకి వచ్చే పళ్లని పాల పళ్లు అంటారు. ఆరు లేక ఏడు సంవత్సరాల వయసులో వచ్చే పళ్లని శాశ్వత పళ్లు అంటారు. పాల పళ్లు ఓ నిర్ధారిత సమయంలో అవంతట అవే పడిపోయి అలా ఏర్పడిన ఖాళీ స్థలంలోకి శాశ్వత పళ్లు వస్తాయి. ఇదంతా ఓ పద్ధతిగా జరుగుతుంది. ఈ పద్ధతి అప్పుడప్పుడు కొన్ని కారణాలవల్ల క్రమం తప్పేందుకు ఆస్కారం ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
పాల పళ్లు
పుట్టిన ఆరు నెలలకి వచ్చే పళ్లు ఇవి. ముందు కింద, పైదవడ పళ్లు రావడం మొదలవుతాయి. ఆ తరువాత కింద మరియు పై ముందర పళ్లు వస్తాయి. పాలు తాగే వయసులో వస్తాయి కాబట్టి వీటిని పాల పళ్లు అంటారు. వీటి మొత్తం సంఖ్య 20 (పైన పది కింద పది). ఇవి నోట్లో తాత్కాలికంగా ఉంటాయి (13/14 సంవత్సరాల వరకు).
శాశ్వత పళ్లు
ఆరు సంవత్సరాల ప్రాయంలో వచ్చే పళ్లు, మనం సరిగా కాపాడుకుంటే మన తుది శ్వాస వరకు మన నోట్లోనే ఉంటాయి. కాబట్టి వీటిని శాశ్వత పళ్లు అంటారు. పాల పళ్లలానే ఇవి కూడా ముందు కింది మరియు పైదవడ పళ్లు వస్తాయి. ఆ తర్వాత కింది మరియు పై ముందు పళ్లు వస్తాయి. ఈ శాశ్వత పళ్ల పూర్తి సంఖ్య 32. పైన పదహారు కింద పదహారు.
శాశ్వత పళ్లు వచ్చే పద్ధతి
పాల పళ్లు నోట్లోకి రాగానే వాటి కింద ఎముక భాగంలో శాశ్వత పళ్ల నిర్మాణం మొదలవుతుంది. ఒకసారి శాశ్వత పన్ను నిర్మాణం పూర్తవగానే అది నోట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ శాశ్వత పన్ను వచ్చే స్థానంలో వున్న పాల పన్ను యొక్క కింది రూట్ భాగం అరిగి ఆ పన్ను ఊగడం మొదలవుతుంది. రూట్ భాగం మొత్తం అరిగిపోగానే ఆ పాల పన్ను పడిపోతుంది. అలా ఏర్పడిన ఖాళీ స్థలంలోకి శాశ్వత పన్ను వచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో వచ్చే సమస్య
అతి ముఖ్యమైనవి మూడు సమస్యలు
పాల పన్ను పడదు, శాశ్వత పన్ను రాదు.
పాల పన్ను పడదు శాశ్వత పన్ను నాలికవైపో, బుగ్గవైపో, అంగుడి వైపో వస్తుంది.
పాల పన్ను పడిపోయినా శాశ్వత పన్ను రాదు.
పాల పన్ను పడదు.. శాశ్వత పన్ను రాదు
ఈమధ్యకాలంలో ఇది సాధారణంగా కనిపిస్తోన్న, వినిపిస్తోన్న సమస్య. నిర్థారిత సమయం తరువాత కూడా పాల పన్ను పడే లక్షణాలు కనిపించవు. అలా కనిపించని పిల్లల తల్లులు చాలా కంగారు పడతారు. వారందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ‘ఇది కంగారు పడాల్సిన విషయం కాదు’. నేటి సమాజంలో చాలామంది పిల్లలకు పాల పళ్లు మరియు శాశ్వత పళ్లు ఆలస్యంగా వస్తున్నాయి. మీరు కంగారు పడకుండా అయిదు లేక ఆరు నెలలు (నిర్థారిత సమయం తరువాత) వేచి చూడండి. అప్పటికి పాల పన్ను పడకపోయినా, శాశ్వత పన్ను వంకరగా వచ్చినా దంత వైద్యుడిని కలవడం మంచిది. పాల పన్ను పడకుండా శాశ్వత పన్ను రాకుండా ఉన్నవారిలో ఓ.పి.జీ అనే ఓ ఎక్స్‌రే తీసి అసలు పాల పళ్ల కింది దవడ ఎముక భాగంలో శాశ్వత పళ్లు ఉన్నాయో లేదో అని ముందు నిర్థారించుకోవాలి. శాశ్వత పళ్లు ఉన్నవారిలో ఇంకో రెండు నెలలు ఆగి చూసే ప్రయత్నం చేయచ్చు. అప్పటికి పాల పన్ను పడకపోతే దానిని తీసివేయాల్సి వుంటుంది. పాల పన్ను తీసిన వెంటనే ఆ స్థలంలోకి శాశ్వత పన్ను వచ్చేందుకు చాలా అవకాశం వుంటుంది.
పాల పన్ను ఊడకుండా శాశ్వత పన్ను
నాలిక వైపో, బుగ్గవైపో, అంగుడివైపో రావడం
ఇలాంటి సమస్య ఎదురవగానే వెంటనే దంత వైద్యుణ్ణి కలవడం ఉత్తమం. దంత వైద్యుడు ఆ పాల పన్నుని వెంటనే తీసేస్తారు. చాలా సందర్భాలలో పాల పన్ను తీసిన కొన్ని వారాలకి శాశ్వత పన్ను ఆ స్థలంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. 6 నుంచి 8 వారాల తరువాత కూడా అలా రాని పక్షంలో అప్పుడు తీగలతో శాశ్వత పన్నుని సరైన స్థలంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం.
శాశ్వత పన్ను రానివారిలో
పాల పన్ను పడి ఎంతకాలం అయిందో చూసుకోవాలి. పడిన రెండు నెలలకి కూడా శాశ్వత పన్ను రానివారిలో ఓ.పి.జీ అనే ఎక్స్‌రే తీసి అసలు శాశ్వత పన్ను ఉందో లేదో నిర్థారించుకోవాలి. ఉన్నా బయటకు రాని పన్నుని ఏదైనా అడ్డగిస్తున్నదో లేదో నిర్థారించుకోవాలి. శాశ్వత పన్ను బయటికి రాకుండా దాని మీద ఉన్న ఎముక అడ్డగిస్తుంటే ఆ ఎముకని కోసి తీసేసి, 6 నుంచి 8 వారాలు చూడాలి. (సాధారణంగా ఎముక దానంతట అదే అరిగిపోవాలి. కాని కొందరిలో అలా అరగని పక్షంలో కోసి తీసేసే ప్రయత్నం చేస్తాం)
అలా చేసినా బయటికి రాని శాశ్వత పన్ను లేక పక్క పళ్ల అడ్డువల్ల రాలేకపోతున్న శాశ్వత పన్నుని తీగల ద్వారా తిన్నగా చేసి సరైన స్థలంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం.
శాశ్వత పళ్లు లేకుండా ఉండడం చాలా అరుదు.. అలా లేని వారిలో పాల పన్ను నోట్లో ఉండడంవల్ల ఏ ఇబ్బంది లేనివారిలో ఆ పన్నుని అలాగే ఉంచేస్తాం. ఇబ్బంది వున్నవారిలో అది తీసి కృత్రిమ పన్ను పెట్టే ప్రయత్నం చేస్తాం.
ఓసారి ఓ తల్లి తన ఎనిమిదేళ్ల కొడుకుని పట్టుకొని వచ్చింది. ఆ పిల్లవాడి కింది ముందు పాల పళ్లు ఇంకా పడలేదని, అక్కడ ఇంకా శాశ్వత పళ్లు రాలేదని వాపోయింది. ఆ పాల పళ్లు కొంచెం ఊగుతున్నాయి. ‘ఓ మూడు వారాలు చూద్దాం, అప్పటికి పడిపోకపోతే ఇంజెక్షన్ ఇచ్చి తీసేస్తా’ అని చెప్పా. మరుసటి రోజునుంచి తెల్లవారగానే క్లినిక్ ఫోన్‌కి కాల్ చేసి ‘డాక్టర్‌గారూ, ఇంకా పడలే, మీరే తీసేయండి’ అని ఆవిడ అనేది. వారం అయింది. ప్రతి ఉదయం ఇదే తంతు. ఇక భరించలేక ఓ రెండు రోజుల తర్వాత రండి తీసేస్తా అని చెప్పా. రెండు రోజుల తర్వాత తల్లీ కొడుకు క్లీనిక్‌కి వచ్చారు. కొడుకు తన చేతిని జేబులోకి పెట్టి ఊడొచ్చిన ముందు పన్నుని బయటికి తీసి చూపించేడు. తల్లి ముఖంలో సంతోషం. వాళ్లమ్మ మంచి నీళ్లు తాగడానికి బయటికి వెళ్లినపుడు ఆ పిల్లవాడితో ఇలా అన్నా- ‘‘లక్కీ బాబూ! ఇంజెక్షన్ అక్కర్లేకుండానే పన్ను వచ్చేసింది’’. దానికి ఆ పిల్లవాడు ‘‘ఎక్కడ లక్కీ అంకుల్, మా అమ్మ ఇంజెక్షన్ ఇచ్చి తీసేయండి అని రోజూ మీతో అంటుంటే, మీరెక్కడ నిజంగానే ఇంజెక్షన్ ఇచ్చి తీసేస్తారో అని భయపడి, ఆ పన్నుని రోజూ నేనే ఊపి ఊపి పీకేసా’’ అని తలవంచుకొని చెప్పాడు. తల్లి భయం తల్లిది, పిల్లాడి భయం పిల్లాడిది. నేటి పిల్లలు పిడుగులే.. మరి కాదంటారా?

-డాక్టర్ రమేష్ శ్రీరంగం