సబ్ ఫీచర్

పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక సుస్థిరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అవినీతి, నల్లధనం నియంత్రించడానికే మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. అనేక రంగాల్లో అవినీతి పెచ్చుమీరడంతో నల్లధనం గుట్టలకొద్దీ పేరుకుపోయింది. మరోవైపు నకిలీ కరెన్సీని నివారించేందుకు మోదీ నిర్ణయం దోహద పడుతుంది. పెద్దనోట్లను రద్దు చేయడం మంచిదే అయినా తగిన ముందస్తు ప్రణాళికలు లేనందున దేశవ్యాప్తంగా ప్రజలు ఇపుడు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం రెండువేల రూపాయల నోటును విడుదల చేయడం విమర్శల పాలైంది. రెండువేల రూపాయల నోట్లతో బడాబాబులు మరింతగా నగదు పోగుచేసుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నల్లధనం దాచుకోవడం మరింత సులభం కాదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రెండువేల రూపాయల నోటును ఎందుకు విడుదల చేశారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేనందున ప్రజల్లో అపోహలు పెరిగే అవకాశం ఉంది. నిజానికి చిన్ననోట్ల వల్ల ద్రవ్యమార్పిడి పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్య వినిమయం కూడా అధికం అవుతుంది. పెద్దనోట్ల వల్ల ద్రవ్య వినిమయం తగ్గుతుంది. ద్రవ్యత ఘనీభవిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సౌలభ్యత తగ్గుతుంది. పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల దేశంలో ఆర్థిక సుస్థిరత సాధ్యమవుతుంది.
దేశంలో నకిలీ కరెన్సీ, నల్లధనం కారణంగా ఆర్థిక దుర్లక్షణాలు ఏర్పడి డబ్బు విలువ బాగా తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. వస్తువులు, సేవలు, ఆస్తుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో క్లిష్టత ఏర్పడడంతో ప్రక్షాళన అవసరమని ఆర్థిక నిపుణులు గతంలోనే సూచించారు. పెద్దనోట్లను రద్దు చేస్తే నల్లధనాన్ని నివారించడం సాధ్యమవుతుందని వారు చెబుతూవచ్చారు. ఈ సూచనలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆకస్మికంగా ప్రకటించింది. నిజానికి ప్రభుత్వం ప్రకటించింది ‘రద్దు చేయడం’ కాదు. పెద్దనోట్లను చెలామణి నుంచి ఉపసంహరించి, వాటి స్థానంలో 500, 1000, 2000 నోట్లను తెస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అన్న సందేహాలు లేకపోలేదు. నల్లధనం వెనకేసేవారు ఇపుడు పాతనోట్లకు బదులు కొత్తనోట్లను దాచుకుంటారన్న వాదనలూ ఉన్నాయి. పాతనోట్లను రద్దు చేయడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగి చాలావరకూ నల్లధనం వెలికివచ్చిందనే చెప్పాలి. అయితే, ప్రభుత్వం ఆశించిన మేరకు నల్లధనం బయటపడుతుందా? లేదా? అన్న విషయమై ఇంకా కొన్నాళ్లు వేచి చూడాలి.
దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీలో 80 శాతానికి మించి పెద్దనోట్లే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పెద్దనోట్ల రద్దుతో చెలామణిలో ఉన్న కరెన్సీ బాగా తగ్గడంతో నగదుకు కొరత ఏర్పడింది. 125 కోట్ల మంది ప్రజలు తమ వద్ద ఉన్న 80 శాతం నోట్లను కొత్తనోట్లతో మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలంటే ముందస్తు కసరత్తు చాలా అవసరం. ‘రద్దు’ నిర్ణయాన్ని ప్రకటించే సమయానికి- చెలామణికి అవసరమైన కరెన్సీని ప్రింటు చేసి బ్యాంకులకు అందుబాటులో ఉంచాల్సింది. ఇలా చేసి ఉంటే నోట్ల మార్పిడి ప్రక్రియ గందరగోళం లేకుండా తేలిగ్గా జరిగి ఉండేది. ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పి ఉండేవి. వందనోట్లకు బదులు 2వేల రూపాయల నోట్లను భారీగా ముద్రించి పంపారు. దీంతో బ్యాంకుల్లో, ఎటిఎంల్లో ఎక్కడ చూసినా రెండువేల రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. వంద, యాభై నోట్లను విడుదల చేయనందున ప్రజలకు చిల్లర కష్టాలు అనివార్యమయ్యాయి. చేతిలో 2వేల రూపాయల నోటు ఉన్నా జనం ఏదీ కొనలేని దుస్థితి కొనసాగుతోంది.
పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్ల విషయంలోనూ సరైన ఆదేశాలు లేనందున అస్పష్టత కొనసాగుతోంది. పాతనోట్లను రెండున్నర లక్షల రూపాయల వరకూ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నర లక్షల లోపుచేసే డిపాజిట్లకు ఐటి అధికారులకు ఎలాంటి వివరణ ఇవ్వనక్కర్లేదన్న ప్రచారం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నవారు తక్కువ. అకౌంట్లు ఉన్నవారు సైతం తమ ఇళ్లలోనే అధిక మొత్తంలో నగదు ఉంచుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న బ్యాంకుకు వెళ్లి డబ్బు తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే నగదు ఉంచుకుంటూ తమ అవసరాలకు వాడుకోవడం పల్లెసీమల్లో పరిపాటే. ఎవరైనా రెండున్నర లక్షలు డిపాజిట్ చేస్తే- ఇంత డబ్బు ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపే అవకాశం లేకపోలేదు. ఇలాంటి వేధింపులు పడలేకే చాలామంది గ్రామీణులు తమ ఇళ్లలోనే కరెన్సీని దాచుకుంటారు. మరోవైపు పేదవర్గాలకు చెందిన ‘జన్‌ధన్’ ఖాతాల్లో భారీగా డిపాజిట్లు పెరిగితే ఆరా తీస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి గందరగోళంలో గ్రామీణులు సతమతమవుతున్నారు.
ఇక, బడాబాబులు నల్లధనాన్ని కేవలం కరెన్సీ రూపంలోనే దాచరు. అక్రమ సంపాదనతో భారీగా బంగారం, స్థిర చరాస్తులు కొంటారు. అప్పటికీ ఇంకా పెద్దనోట్లు ఏమైనా మిగిలిపోతే ఆ నష్టం వారికి లెక్కకాదు. రద్దయిన నోట్లను మార్చుకోకపోతే నష్టపోయేది పేద, మధ్యతరగతి వారే. డబ్బు విలువ బాగా తగ్గడంతో ఇపుడు మధ్య తరగతి వారి వద్ద పది, ఇరవై లక్షలు ఉండడం విశేషం కాదు. అయితే, ఈ మొత్తాన్ని వీరు డిపాజిట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఈనెల 30వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు ముగిశాక ఎంతమేరకు నల్లధనం బయటపడిందన్న విషయం తేలుతుంది. ఇపుడు నగదు కొరతతో పేద, మధ్యతరగతి వారు నానాపాట్లు పడుతుండగా, కొత్త కరెన్సీ కట్టలతో కొందరు ఘరానా వ్యక్తులు ఐటి శాఖకు పట్టుబడుతున్నారు. సామాన్యుడికి ఒక్క 2వేల నోటు లభించడం దుర్లభమవుతుండగా, బడాబాబులకు లక్షలు, కోట్లలో 2వేల నోట్లు ఎలా అందుతున్నాయి? అక్రమ పద్ధతుల్లో పాతనోట్ల మార్పిడి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. నల్లధనాన్ని నిర్మూలించాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలంతా ఆమోదిస్తున్నారు. అయితే, పెద్దనోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడిన పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దాలని కూడా జనం కోరుకుంటున్నారు. నగదు కొరతను తీర్చితేనే తాము కష్టాల నుంచి గట్టెక్కుతామని పేద, మధ్యతరగతి వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయకుండా, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేలా పాలకపక్షానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి. 125 కోట్ల మంది భవిష్యత్‌తో ముడిపడినందున ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు విపక్షాలు సంయమనం పాటించి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాలి.

- మనె్న సత్యనారాయణ