సబ్ ఫీచర్

నే‘తలరాత’లు మార్చే ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎన్నికల నామ సంవత్సరం’గా అందరూ అభివర్ణిస్తున్న ఈ కొత్త ఏడాదిలో దేశవ్యాప్తంగా అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలతో పాటు రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవులకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే నగారా మోగింది. ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ ఏడాది మధ్యలో రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. దేశ ప్రథమ పౌరుడిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఏడు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఇటు బిజెపికి, అటు కాంగ్రెస్‌కు ఇతర విపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీకి జనాదరణ తగ్గిందని విపక్షాలు, నల్లధనంపై పోరుతో నరేంద్రుడి ప్రతిష్ట మరింత పెరిగిందని బిజెపి, దాని మిత్రపక్షాలు అంచనా వేస్తున్నాయి. అయితే, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందన్నతి వెల్లడవుతుంది.
కాంగ్రెస్ హయాంలో రాష్టప్రతి పదవిని అలంకరించిన ప్రణబ్ ముఖర్జీ అయిదేళ్ల పదవీకాలం ముగుస్తున్నందున కొత్త రాష్టప్రతి ఎవరన్న విషయమై ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. ఇప్పటివరకూ బిజెపి తన సొంత అభ్యర్థిని రాష్టప్రతి పదవికి ఎంపిక చేసుకోలేక పోయింది. ఈసారైనా తమ పార్టీ అభ్యర్థిని దేశాధ్యక్షుడిగా గెలిపించుకోవాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల ఫలించాలంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించాల్సి ఉంది. ఈ కారణంగానే మోదీ యుపిలో సుడిగాలి పర్యటనలు జరుపుతూ బిజెపి విజయం కోసం కృషి చేస్తున్నారు. 403 స్థానాలున్న యుపి అసెంబ్లీని కైవసం చేసుకుంటే రాష్టప్రతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అని బిజెపి నాయకత్వం అంచనా వేస్తోంది. యుపిలో తాజా రాజకీయ పరిస్థితులు ‘కమల దళాని’కి సానుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే పలు సర్వేల్లో తేలింది. యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ముసలం బయలుదేరింది. ఈ పరిణామాలు తమకు మేలు చేస్తాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. రాజకీయాల్లో వారసత్వ పోరు సర్వసాధారణమే అయినా, యుపిలో మాత్రం తండ్రీకొడుకుల మధ్య ఆధిపత్య పోరాటం బహిర్గతం కావడం విశేషం. ఈ పరిస్థితులు తమకు అనుకూలంగా మారవచ్చని మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆశపడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో చీలిక సంభవిస్తే అఖిలేష్ వర్గంతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. కానీ, అఖిలేష్‌తో పొత్తు కుదిరితే షీలా ఆశలపై నీళ్లు చల్లినట్టే. యుపిలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి రాజుకుంటోంది. మరోవైపు యుపి ఎన్నికలు బిఎస్‌పి అధినేత్రి మాయావతికి జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారైనా అధికార పీఠం దక్కించుకునేందుకు ఆమె ‘దళిత్- ముస్లిం’ ఫార్ములాకు తెరతీశారు. ముస్లింల అభిమానాన్ని చూరగొంటే సిఎం పదవి తనదేనని మాయావతి తనదైన అంచనాల్లో మునిగితేలుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు బయలుదేరడంతో వాతావరణం తనకు అనుకూలంగా మారిందని మాయావతి భావిస్తున్నారు. అగ్రవర్ణాలు, ముస్లింలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఇచ్చేందుకు ఆమె మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బిజెపి మాత్రం సిఎం అభ్యర్థిని ప్రకటించకుండా మోదీ ఆకర్షణపైనే ఆశలు పెట్టుకుంది. పెద్దనోట్ల రద్దు ప్రభావం తమ పార్టీపై ఉండదని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి. నల్లధనం వెలికితీసేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మోదీ చేసిన ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఎన్నో కష్టనష్టాలను భరించినప్పటికీ ప్రజలు మోదీ వైపే మొగ్గు చూపుతున్నారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా, ఈసారైనా సత్తా చూపాలని బిజెపి నేతలు సర్వశక్తులనూ ఒడ్డుడున్నారు. బిఎస్‌పి, పిడిఎఫ్, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌కు చెందిన హరీష్ రావత్ ఉత్తరాఖండ్ సిఎంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తిరుగుబాటు నేపథ్యంలో గత ఏడాది హరీష్ రావత్‌ను సిఎం పదవి నుంచి తప్పించి ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించారు. సిఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి చేసిన యత్నాలకు న్యాయస్థానం గండికొట్టింది. కోర్టు తీర్పు ఫలితంగా రావత్ మళ్లీ సిఎం పదవిని చేపట్టారు. తమ పార్టీలోని బహు నాయకత్వం బిజెపికి శాపంగా మారింది. అయినప్పటికీ మోదీ ఆకర్షణతో మెజారిటీ స్థానాలను సాధిస్తామని ‘కమలనాథులు’ ధీమాగా ఉన్నారు. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం బిజెపి, మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీల నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. బిజెపికి చెందిన లక్ష్మీకాంత్ పర్సేకర్ సిఎంగా పాలన సాగిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పలుకుబడిపైనే బిజెపి ఆధారపడి ఉంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ నుంచి బిజెపి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
గత దశాబ్ద కాలంగా బిజెపి- శిరోమణి అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలున్నాయి. ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ వయోభారం కారణంగా ఆయన తనయుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి బిజెపికి పోటీ ఎదురవుతోంది. రైతుల ఆత్మహత్యల కారణంగా ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజావ్యతిరేకత తమకు కలసివస్తుందని పిసిసి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆశలు పెట్టుకున్నారు. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన బక్రామ్ ఇడోమి సింగ్ సిఎంగా ఉన్నారు. సొంత పార్టీలోనే ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అసోంలో అఖండ విజయం సాధించిన బిజెపి ఇపుడు మణిపూర్‌లోనూ అవే ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.
యుపి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే సొంత అభ్యర్థిని రాష్టప్రతిగా ఎంపిక చేసుకునే అవకాశం బిజెపికి లభిస్తుంది. లేనిపక్షంలో రాష్టప్రతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టవలసి వస్తుంది. బిజెపికి చెందిన ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లు రాష్టప్రతి పదవిని ఆశిస్తున్నారు. అయితే, మోదీ నిర్ణయం మేరకే అభ్యర్థిని ఎంపిక చేసే పరిస్థితి ఉంది. ఏడాది చివరిలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రధాన పార్టీలకు కీలకమే. మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన వీరభద్ర సింగ్ సిఎంగా ఉన్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై రావడంతో ఇక్కడ బిజెపికి పరిస్థితి అనుకూలంగా ఉందంటున్నారు. ప్రధాని మోదీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఏడాది జరిగే ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. యుపి ఎన్నికలే రాబోయే రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం కానున్నాయి.

పి.్భర్గవరామ్