ఉత్తరాయణం

కులనేతల విగ్రహాలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలతో ఇప్పటికే రోడ్లన్నీ నిండిపోతుండగా ఈ మధ్య స్థానిక నేతలు, కులనాయకుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. జయంతులు, వర్ధంతుల రోజుల్లోనే కాదు ఎప్పుడు పడితే అప్పుడు స్థానిక నేతల విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ వారి అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. కులసంఘాలు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటూ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కూడళ్లలో, రోడ్ల మధ్యలో విగ్రహాలను ప్రతిష్ఠించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఒకరిని చూసి మరొకరు విగ్రహాలను పెడుతున్నారు. కొంతమంది జాతి నేతలను కొన్ని కులాల వారు తమ సొంతం చేసుకుంటూ గల్లీ గల్లీలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. చాలాచోట్ల పాడుబడిన విగ్రహాలను చూస్తుంటే ఆ నేతల ఆత్మలు క్షోభించక తప్పదని అనిపిస్తుంది.
- నయనాల సూర్యప్రకాశరావు, కాకినాడ
‘ఉపాధి హామీ’కి గండికొట్టొద్దు
గ్రామీణ ప్రజలకు పనిదినాలు కల్పించేందుకు యుపిఏ ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా’న్ని మోదీ సర్కారు నీరుగార్చడం దిగ్భ్రాంతి కరం. ఈ పథకంలో చేపట్టే పనుల సంఖ్య తగ్గించుకోవాలని, గ్రాంట్లలో 20శాతం కోత విధించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వడం తగదు. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకానికి 25శాతం నిధుల కోత విధించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అందిన నిధులను జాగ్రత్తగా వాడుకోవాలన్న సూచనలు చూస్తుంటే- ఈ ప్రతిష్టాత్మక పథకానికి త్వరలోనే మంగళం పాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథకం అమలులో లోపాలున్నాయని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి తగినన్ని నిధులు విడుదల చేయాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
శిథిలావస్థలో వడ్డాది ఆలయం
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వడ్డాది వెంకటేశ్వరస్వామి ఆలయం సమస్యలు పాలకులకు పట్టడం లేదు. ఆలయానికి చేరేందుకు సరైన దారి లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కొండ చరియలు తరచుగా జారిపడడంతో భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారు. నీడ కోసం వేసిన రేకుల షెడ్డు కూలడానికి సిద్ధంగా వుంది. వందల సంవత్సరాల ఘన చరిత్రగల ఈ దేవాలయానికి 50 ఎకరాల భూములపైన, భక్తుల నుంచి ఆదాయం వస్తున్నా నిధుల కొరత ఉందని అధికారులు చెప్పడం విస్మయకరం. సిమెంట్ రోడ్డు, కల్యాణ మండపం, భక్తులకు విశ్రాంతి గదులు నిర్మిస్తామని దశాబ్దం క్రింద ప్రభుత్వం చేసిన వాగ్దానం నేటికీ అమలుకు నోచుకోలేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
పరిశోధనలకు నిధులు
నులి పురుగుల జన్యు (డిఎన్‌ఎ) రహస్యాలను కనుగొంటే- ప్రమాదంలో అవయవాలను కోల్పోయే వారికి తిరిగి శరీర భాగాలు వచ్చే వీలుందని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. వీటిపై విస్తృత పరిశోధనలు జరపవలసి వుంది. ఎలుకల్లో జన్యు మర్మాలను తెలుసుకొంటే పళ్ళను ఏ వయసులో కోల్పోయినా తిరిగి వచ్చే వీలుందని విదేశీ శాస్తవ్రేత్తలు అంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడులోని రక్తకణాలను శాస్ర్తియ పద్ధతిలో చిగుళ్ళలోకి పంపిస్తూ క్లోనింగ్ జరిపితే తిరిగి పళ్ళు వచ్చే అవకాశం వుందా? ఇలాంటి విషయాలపై వైద్య పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించేలా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలి.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
ఎన్నికల్లో జరిగేది అదే..
ఎన్నికల్లో కులం, మతం పేరిట రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వోట్లు అడగడం నేరమని, ఇందుకు విరుద్ధంగా గెలిచే వారు పదవులను కోల్పోతారని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో మేలుచేస్తుంది. ఈ తీర్పు ఎంతో గొప్పగా ఉన్నా, కోర్టు ఆదేశాలు అమలు జరిగే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. మనదేశంలో కులాలు, మతాలు అనాదిగా పాతుకుపోయాయి. రాజకీయ పార్టీలు కులాల, మతాల ప్రాతిపదికగానే టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. కులమతాల పేర్లు బయటకు చెప్పకపోయినా వాటి ఆధారంగానే ఎన్నికల ప్రచారం జరుగుతుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ ప్రతి ఎన్నికలోనూ కులం, మతం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆ ప్రాతిపదికపైనే పార్టీలు, అభ్యర్థులు వోట్లను అడుగుతారు. ప్రజల ఆలోచనావిధానంలో మార్పు రావాలే తప్ప కోర్టు తీర్పులతో పరిస్థితులు మారవన్నది నిజం.
- పవన్‌పుత్ర, రామారావుపేట (తూ.గో)