సబ్ ఫీచర్

మాతృభాష పరిరక్షణకు మహాసంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరణ్య కశిపుడు వైకుంఠానికి చేరిన పిదప అతని కుమారుడైన ప్రహ్లాదుడు రాజయ్యాడు. ఎన్నో సద్గుణాలు కలిగిన ప్రహ్లాదునికి ఇంద్ర పదవిని పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రాక్షస సంతతి వాడు కావడంతో ప్రహ్లాదుడు ఏ సమయంలోనైనా తనపై దండెత్తి పదవిని చేజిక్కించుకోగలడనే అనుమానంతో ఇంద్రుడు ఒక పన్నాగం పన్నాడు.
ఎవరేమి అడిగినా కాదనక దానమిచ్చే ప్రహ్లాదుని వద్దకు మారువేషంలో ఇంద్రుడు వెళ్లి అతని శీలాన్ని తనకు దానమీయమని అడిగాడట. ప్రహ్లాదుడు కాదనకుండా ఇదిగో తీసుకో అంటూ శీలాన్ని మారువేషంలో వున్న ఇంద్రునికి దానం చేశాడట.
శీలం తనను విడిచి వెళ్లిన మరుక్షణమే మరొక తేజం తనలోనుండి వెళ్లిపోవడం గమనించిన ప్రహ్లాదుడు- ‘ఎవరు నువ్వు? ఎందుకు వెళ్లిపోతున్నావు?’ అని అడిగాడట. ‘నేను ధనలక్ష్మిని.. శీలం లేని వాని వద్ద నేనుండజాలను.. అందుకే నిన్ను విడిచిపోతున్నా’నన్నది. మరికొద్ది సేపట్లో ధాన్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి మొదలైన ‘శ్రీ’లంతా ప్రహ్లాదుని విడిచిపోయారట. ఇది పౌరాణిక గాధ. శీలమే మనిషి మనుగడకు ఆధారమైనదని తెలుపుతున్నదీ గాథ. శీలమే లేకపోతే- మరెన్ని వైభవాలున్నా అవి తరిగిపోయేవేనని తెలుపుతున్నదీ గాధ.
***
అతి పురాతన సంస్కృతి, నాగరికతలతో విలసిల్లినది మన భారతీయ చారిత్య్రక వైభవం. ఇంకా ఇక్కడ వికసించిన కళలు మంత్ర, శ్లోక, పద్య గద్య రూపాలతో తొణికిసలాడి, ఛందో వైవిధ్యములతో అష్ట, శత, ద్విశత సహస్ర, మహా సహస్రావధానాలు ఇత్యాది సాహితీ ప్రక్రియల ద్వారా ఆనాటి ఆదికావ్యము నుండి ఈనాటి రసవత్తరములైన కావ్య రచనల ద్వారా ప్రకటీకృతమైన జీవన విధానం మనదైనది. దేవతలే స్వర్గతుల్యమైన జీవితాలను గడపాలంటే భారత జాతిలో పుట్టాలని ఉవ్విళ్ళూరేట్లు మనం రూపొందించుకున్న వ్యవస్థలన్నిటికీ మూల భూతమైనది మన భాషా సంపద అంటే ఆశ్చర్యం లేదు. భాష లే కుంటే ఆ జాతి వైభవం ప్రకటీకృతమవదుగా! వ్యక్తికి శీలము వలె జాతికి భాషయన్నది జీవగర్ర.
ప్రాకృతములైనా, పైశాచిక భాషలైనా వాటి అచ్చమయి న మనుగడను ఒకప్పుడు చాటుకుంటూ, సంస్కృతముచే పరిపుష్టమయి అనేక సంవత్సరాలు విలసిల్లి ఈ జాతి విలువలను చాటడంలో సంస్కృతానికి తోడై తామే మరింత సంపన్నములయ్యాయి. భారతీయ వైభవానికి దర్పణాలుగా నిలిచాయి మన భాషలు. ఈ విషయాన్ని గుర్తించారు యూరప్ నుంచి వచ్చిన సామ్రాజ్యవాద పాలకులు.
దేవేంద్రుడు ప్రహ్లాదుని నుండి శీలాన్ని తస్కరించినట్టు మన జాతిని దోచుకుని అధఃపతనావస్థకు తొక్కివేసి, వారి పాలనను కొనసాగించే తలంపుతో యూరప్ సామ్రాజ్యవాదులు ప్రత్యేకించి వారిలో మిక్కిలి చతురులు, కుత్సితులు, బలిష్టులైన బ్రిటిష్‌వారు మన సంస్కృత భాషను ‘మృతభాష’ అని పేరిడి, యూరప్‌లో లేటిన్‌ను అన్ని జాతుల వారు కలిసి మరుగున పెట్టినట్టే మన సంస్కృతం ఎడల మన శ్రద్ధ్భాక్తులను తుడిచివేయ అన్ని ప్రయత్నాలు చేసారు. వారి ఆంగ్లాన్ని మన నెత్తిన రుద్దే ప్రయత్నం లో భారతీయ భాషలన్నిటినీ రెండవస్థానంలోకి నెట్టివేసి, ఆంగ్లం నేర్చేవారికి ఉద్యోగాలు ఎర చూపుతూ వారి ఆధిపత్యాన్ని దిటవు చేసుకున్నారు. అందుకే మన జాతి పునర్నిర్మాణానికి మన భాషలను పునరుజ్జీవింప చేసుకోవడం అత్యంత ప్రధానమైనదని గుర్తించాలి.
పరాయి పాలనలో వున్నప్పుడు మనం స్వాతంత్రోద్యమానికే ప్రాధాన్యత ఇచ్చి మిగతా అన్ని ఉద్యమాలను పక్కన పెట్టాము- ఆంధ్రోద్యమం సహా. మన సంగ్రామం కూడా సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా లాహోర్‌లో రావీ నది ఒడ్డున 1929లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో అందరూ ఆమోదించిన తీర్మానం సంపూర్ణ స్వాతంత్య్రం కోసమే. స్వతంత్ర భారత్‌లో మన భాషల వికాసానికి ఏ అవరోధం ఉండకూడదనేగా అర్థం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా బానిస భావాలను విడనాడని నేటి మన నాయకులు ఆంగ్లేయులు అలనాడు పూర్తిచేయని పనిని తాము వారికి చేసిపెట్టే దాస్య చింతనతో నేడు అపర ఇంద్రులుగా అవతరించి మన జాతిలోని అన్ని వ్యవస్థలకు ఆలవాలమైన భారతీయ భాషలను తుడిచిపెట్టేయాలని కంకణం కట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలోనైతేనేమి? తెలంగాణలోనైతేనేమి? ముఖ్యమంత్రులు, విద్యాశాఖామాత్యులు, నోరు మెదపని మంత్రి మండలి సభ్యులు అందరూ ఈ సిగ్గులేని భానిసత్వపు ఊడిగంలో భాగస్వాములే.
వీరి కబంధ హస్తాల నుండి మన జాతిని రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. మన మాతృభాషను పరిరక్షించి వికసింప చేయాలనే దృఢ సంకల్పంతో పాలకులకు మార్గం చూపే మహోద్యమానికి నడుం బిగించాలి. ఈ లక్ష్యాన్ని సాధించినపుడే మనం తెలుగుతల్లికి వేసిన మల్లెపూదండ వాడకుండా నిలుస్తుంది. మన కన్నతల్లికిచ్చిన మంగళారతులు కొండెక్కక నిలిచి ఆమెకు నీరాజనాలవుతాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలెన్ని జరిపించుకుంటూ వెళ్లినా, వేదికలెక్కి మన భాషకై ఉద్రిక్త ప్రసంగాలెన్ని చేసినా, హృదయాన్ని కదిలించే ఎన్నో వ్యాసాలు పత్రికల ద్వారా గుప్పించినా ఏళ్లు గడుస్తాయే కానీ ఏమీ జరగదు.

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం