సబ్ ఫీచర్

‘గోమతి’ ప్రక్షాళనకు కంకణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా బాధ్యతలు పెరిగినపుడు లేదా ఉన్నత హోదా లభించినపుడు ఎవరిలోనైనా మానసిక పరివర్తన కలుగుతుంది. నిన్నమొన్నటి వరకూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే భాజపా ఎంపిగా యోగి ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి వరించిన తరువాత ఆయనలో ఇపుడు చాలా మార్పు కనిపిస్తోంది. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నిరూపించడానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ప్రయత్నిస్తుండడం గమనార్హం. అభివృద్ధిపరంగా, సామాజికంగా వెనుకబడిన ఉత్తరప్రదేశ్‌ను ‘ఉత్తమప్రదేశ్’గా తీర్చిదిద్దడానికి ఆయన నడుం బిగించారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కొత్త పథకాలు ప్రారంభించి తద్వారా ప్రచారం పొందడం కన్నా, గత ప్రభుత్వ హయాంలో చేపట్టి నత్తనడక సాగిస్తున్న పథకాలను పరుగు పెట్టించడానికి ప్రయత్నించడం గమనార్హం. సొంత ప్రచారానికి ప్రభుత్వ పథకాలు అన్న చందాన వ్యవహరిస్తున్న చాలామంది ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పలు అభివృద్ధి పనులు పట్టించుకునే నాథుడు లేక అక్కడ ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఇన్నాళ్లూ అక్కడి పాలకులు పట్టించుకోని పథకాల్లో ‘గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ ఒకటి. గంగ ఉపనదులలో గోమతి నది ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పక్కనుంచి ప్రవహిస్తుంది. దశాబ్దాల కాలంగా లక్నో పరిసర ప్రాంతాలకు చెందిన డ్రైనేజీ, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు గోమతి నదిలో కలుస్తున్నాయి. దీంతో నదీ జలాలు కలుషితం అయ్యాయి.
గంగా జలాల ప్రక్షాళనా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును మంజూరు చేసింది. 1500 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టు పనులను నాటి అఖిలేష్ ప్రభుత్వం ప్రారంభించింది. 1430 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అయ్యాయి కానీ పథకం మాత్రం పూర్తికాలేదు. డ్రైనేజీ, వ్యర్థపదార్థాలను శుద్ధిచేసిన తరువాత నదిలోకి వదలడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇటీవల ఈ పథకం పనులను ఆకస్మిక తనిఖీ చేసి అధికారుల తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవంగా అయితే వచ్చే మే నాటికి ఈ పథకం పూర్తికావాలి. త్వరితగతిన గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పథకం పూర్తయితే నమామి గంగా పథకం పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, గంగానది ఎక్కువ కలుషితం అవుతున్నది ఉత్తరప్రదేశ్‌లోనే కనుక. పరిశ్రమల వ్యర్థాలు, డ్రైనేజీ నీరు నేరుగా గంగానదిలో కలువకుండా నిరోధించగలిగితే నమామి గంగా పథకం చాలావరకు విజయవంతం అయినట్లే. గంగాజలాలను శుద్ధిచేయడం కోసం అవసరమైన నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యోగి ఆదిత్యనాధ్ హయాంలోనే నమామి గంగా పథకం పూర్తి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మాటలు చెప్పడం కన్నా పని చేసి చూపించడం మేలు అన్న రీతిలో వ్యవహరిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ దేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.
-పి.మస్తాన్‌రావు