సబ్ ఫీచర్

‘పరీక్ష’లకు ప్రక్షాళన ఎపుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావ్యవస్థ లక్ష్యం- పిల్లలకు జ్ఞానం కలిగించడంతోపాటు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అని అందరూ అంగీకరిస్తారు. చాలాకాలంగా చదువులకు ‘పబ్లిక్ పరీక్షలు’ కొలబద్దలుగా మారాయి. రానురానూ ఇవి ఒక ప్రహసనంలా మారిపోయాయి. పరీక్షల నిర్వహణలో లీకేజీలు, మాల్‌ప్రాక్టీసులు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజి గురించి ఏపి శాసనసభలో అంత రగడ అవసరమా? లీకేజీ అంటే ఏమిటి? పరీక్షకు కనీసం ఒక రోజు ముందుగా ప్రశ్నపత్రం బహిర్గతం కావడాన్ని లీకేజీ అంటారు. మీడియాలో వచ్చిన వార్తల మేరకు- ప్రశ్నపత్రం పరీక్ష హాలునుండి ఆధునిక సదుపాయాల వల్ల (స్మార్ట్ఫోన్ వల్ల) బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. కనుక ఇది లీకేజీ కాదు. మాల్‌ప్రాక్టీసు అని భావించాలి. ఏదిఏమైనా ఈ విషయం పరిశీలించాక సంబంధిత అధికారులు దోషులను నిర్థారిస్తారు. మాల్ ప్రాక్టీసుకు పాల్పడినవారు చట్ట ప్రకారం శిక్షింపబడతారు. దోషులను రక్షిస్తే అధికార పార్టీకి ఓట్లు రావు. శిక్షిస్తే ప్రతిపక్షానికి ఓట్లురావు. ఈ సందర్భంగా ‘తప్పుచేస్తే తాట తీస్తా’ అని ముఖ్యమంత్రి సెలవిచ్చారు. తాట తీయటం అంటే ఏమిటి? చర్మం ఒలిచివేయడం. ఇది జరిగే పనికాదు. నిజంగా అలా జరిగితే లీకేజీలు, మాల్‌ప్రాక్టీసులు కంటికి కనిపించవు.
పూర్వం ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు నిజంగా పబ్లిక్ పరీక్షల మాదిరిగానే జరిగేవి. సంబంధిత ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయారుచేసి పరీక్షలు జరిపి అర్హతలు నిర్ణయించేవారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పబ్లిక్ పరీక్ష మూడుసార్లు ఫెయిల్ అయితే ఇక పరీక్షలు వ్రాయనిచ్చేవారు కాదు. పాఠశాల స్థాయిలో జరిగే పరీక్షలకు కూడా జంబ్లింగ్ విధానం ఉండేది. ఇక్కడ జంబ్లింగ్ అంటే ఒక తరగతి విద్యార్థి పక్క మరొక తరగతి విద్యార్థి కూర్చుని పరీక్ష వ్రాయడం. కనుకనే నాటి విద్యా ప్రమాణాలు బాగుండేవి.
సుప్రసిద్ధ సినీ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఆదర్శ ఉపాధ్యాయుడైన భమిడిపాటి కామేశ్వరరావుగారి కుమారుడు. అతడు రాజమహేంద్రవరం వీరేశలింగం ఉన్నత పాఠశాలలో అయిదవ తరగతి చదువుతుండగా నాడు పరీక్షల విషయంలో జరిగిన ఒక సంఘటనను ఓ సభలో వివరించాడు. తోటి విద్యార్థులు అతనితో- ‘మీ నాన్నగారు తయారుచేసిన లెక్కల పేపరు నుండి నాలుగైదు లెక్కలు ఎలాగో నీవు సంపాదించి మాకు ఇవ్వాలి’ అని అడిగారు. అప్పుడతడు తండ్రిగారు ఇంట్లోలేని సమయంలో టేబుల్ సొరుగు నుంచి ఆ పేపరు తీసి గబగబా నాలుగు లెక్కలు వ్రాసి తిరిగి దానిని మడతలు పెట్టి యథాస్థానంలో ఉంచి ఆ లెక్కలు స్నేహితులకి చెప్పాడు. ఆ పేపరను సైక్లోస్టైల్ తీయించే ముందు కామేశ్వరరావుగారు దాని మడతలు చూచి అనుమానించి ఈ పని కుమారుడే చేసి ఉంటాడని భావించి పరీక్షకు మరో ప్రశ్నపత్రం తయారుచేశారు. పరీక్షా సమయంలో ఆశాభంగం కలిగిన విద్యార్థులు రాధాకృష్ణ తమను మోసం చేశాడని భావించారు. అసలు విషయం అతడు చెప్పగా వారు ఆశ్చర్యపోయారు. ఆనాటి సాధారణ పరీక్షలు కూడా ఎంత కట్టుదిట్టంగా ఉండేవో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
మొత్తం పరీక్షల నిర్వహణ, అర్హతల నిర్ణయం ఆయా విద్యాసంస్థలకు అప్పగించినపుడు ఉపాధ్యాయులకు ఒక రకమైన బాధ్యత కలుగుతుంది. వైద్యం, ఇంజనీరింగ్ వంటి కోర్సులకు సంబంధించిన కళాశాలల్లో ఇది సాధ్యమా? సాధ్యమయే మార్గాలు అనే్వషించాలి. కార్పొరేట్ విద్యాసంస్థలు అనే మహాప్రభంజనం ముందు మిగిలిన పాఠశాలలన్నీ డీలాపడిపోయాయి. కనుకనే రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కార్పొరేట్ పాఠశాలల స్థాయికి తీసుకువస్తామని ప్రకటిస్తున్నారు. ఇలా వ్యాపార వస్తువుగా మారిపోయిన విద్యను సరియైన గాడిలో ప్రవేశపెట్టడం ఎలా? ఇది ఒక పెద్ద సవాలు.
విద్యావిధానాన్ని శాసించాల్సిన ప్రభుత్వం ఆ పనినుండి తప్పుకుని విద్యరంగాన్ని పూర్తిగా విద్యావేత్తలకి అప్పగిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఇందులో కూడా ఒక రకమైన ప్రమాదం ఉంది. విప్లవాలను, దేశద్రోహులను పెంచి పోషించే భావజాలం గల విద్యావేత్తలు ఇందులో చొరబడకుండా చూడాలి. నేడు నిత్య జీవితంతో సంబంధం లేని అనేక పాఠ్యాంశాలు పుస్తకాలలో చోటుచేసుకుంటున్నాయి. ఈ చదువుపైన నమ్మకం లేక ఉద్యోగాలిచ్చేవారు ఎవరి పద్ధతిలో వారు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరీక్షలకు హజారుకావడానికి పదవ తరగతి లేక ఏదో డిగ్రీ ఉండాలని ఒక నియమం పెడుతున్నారు. ‘తమకు నమ్మకం లేని చదువుకి తిరిగి ఎందుకు విలువ ఇస్తున్నారు? మీరు నిర్వహించే పరీక్షకి తగిన ఫీజు చెల్లించి నేను హాజరుఅవుతాను, నేను ఏం చదువుతే మీకు ఎందుకు?’- అని ఎవరైనా అభ్యర్థి ప్రశ్నిస్తే జవాబు ఏది? భౌతికశాస్త్ర సిద్ధాంతాలు బాగా చదువుకున్న అభ్యర్థికి బ్యాంకులో ఉద్యోగం వస్తుంది. చదువుకి, ఉద్యోగానికి సంబంధం ఏమిటి? పెద్ద చదువులు చదివినవారు కూడా విఆర్‌ఒ పరీక్షలకు హాజరవుతున్నారు. వ్యవసాయశాస్త్ర పట్ట్భద్రుడు పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావచ్చు. ఏమిటి ఈ వైపరీత్యం? ఈ విధంగా చదువుకి, చేసే ఉద్యోగానికి ఏ విధమైన సంబంధం లేని వ్యవస్థ ఇప్పుడు తయారయింది.
ఆధునిక సదుపాయాలు మితిమీరిపోతున్నాయి. ఇందువలన ప్రతి పర్యాయం ప్రశ్నపత్రాలు పరీక్ష హాలు నుండి బయటకు వస్తాయి. ఈ దోషులకు నామమాత్రపుశిక్షలుంటాయి. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్లు మాల్‌ప్రాక్టీసుకి పాల్పడినపుడు వారిని విధుల నుండి తొలగిస్తున్నారు. ఇదేం శిక్ష? మంచి మార్కులకి, ర్యాంకులకి విలువ పెరిగిపోవడంతో కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాలకి పాల్పడుతున్నాయి. బాగా మార్కులు వచ్చినవారికి ధనరూపంలో కూడా బహుమతులిస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. కనుక విద్యావేత్తలు విద్యా విధానంలోను, పరీక్షా విధానంలోను తగిన సంస్కరణలకు పూనుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతోపాటు వివేకం, వినయం, యుక్తాయుక్త విచక్షణ లభించాలని కోరుకోవాలి. అందుకు ముందుగా వారు ఆదర్శప్రాయులుగా మెలగాలి.

-వేదుల సత్యనారాయణ