సబ్ ఫీచర్

మానవ హక్కులు.. వౌనమునులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీ చేతికున్న గాజులు తీసేసి, మీరు చేయగలరో లేదో చెప్పండి.. ఇదేం ప్రభుత్వం? ఈయనేం ప్రధాని?’ - సరిహద్దు ప్రాంతంలో పాక్ కీచకులు భారత జవాన్ల కుత్తుకలు కత్తిరించి, వారి దేహాలను ఛిద్రం చేసిన అమానవీయ ఘటన క్రమంలో, జాతి కోపాగ్నితో రగులుతున్న వేళ కాంగ్రెస్ మహనీయుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్య ఇది. పైగా ఉగ్రవాదులను అణచివేయడంలో సరైన విధానమంటూ లేకపోవడాన్ని ఆ పార్టీ గళధారులు ఆక్షేపించారు. దేశానికి ఆపద వచ్చిన సమయంలో, విదేశీ-స్వదేశీ ముష్కరులు భద్రతాదళాలపై విరుచుకుపడి వందలమందిని నిహతులను చేసిన సందర్భాల్లో, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకుమించిన స్పందన ఎవరూ ఆశించలేరు. అసలు ఆ విధంగా స్పందించకపోతే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్విరామంగా ఈ దేశాన్ని పాలించి, శాసించి, శ్వాసించిన కాంగ్రెస్ పార్టీ తన హయాంలో ఉగ్రవాద నివారణకు సరైన విధానం ఎందుకు రూపొందించలేదని ప్రశ్నించినవాడు పాపాత్ముడి కిందే లెక్క! ఉగ్రవాదులను జైల్లో పెట్టి వారికి పొట్టపగిలేలా బిర్యానీ ఎందుకు పెట్టారని ఎవరైనా నిలదీస్తే వారు నికార్సయిన హిందూ మిలిటెంట్లే! ఈ విషయంలో ఒక్క కాంగ్రెసే కాదు, ఆ పార్టీకి అన్న, తమ్ముడు వరసయ్యే వామపక్షాలు, లాలూలు, కేజ్రీవాలాలు, దిగ్విజయ్ సింగులూ, మానవహక్కుల సంఘ మహానేతలూ ‘డిటో’నే.
అసలు మన దేశానికి ఇప్పటివరకూ ఒక సైనిక వ్యూహమంటూ లేదు. రక్షణ రంగంలో చైనాతో పోలిస్తే మన ఖర్చు అత్యల్పం. ఇదెవరో చెప్పింది కాదు. సాక్షాత్తూ రక్షణ దళపతి చేసిన ఆవేదనాపూరిత వ్యాఖ్య! ఇందుకు ఎవరిని నిందించాలి? మూడేళ్ల క్రితమే అధికారపీఠంపై గజ్జెకట్టిన మోదీ, అంతకుముందు వాజపేయినా? లేక దశాబ్దాలు అధికార పీఠంపై వామపక్షీయుల భుజం దన్నుతో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనా? మెడమీద తల ఉన్న వారికెవరికైనా సమాధానం సులభంగానే తడుతుంది. వంకర బుర్రలున్న వారికే భిన్నమైన జవాబు దొరుకుతుంటుంది.
ఈ అంశంలో ఇక్కడ మోదీ సర్కారును భుజానికెత్తుకుంటున్నారనుకుంటే అంతకుమించిన వెర్రిబాగులతనం మరొకటుండదు. ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి కీలకమైన అంశాల్లో ముందు ఎవరైనా భారతీయుడిగానే ఆలోచించాలి. తర్వాత పార్టీలు, వ్యక్తులూనూ! దురదృష్టవశాత్తూ అ దే కొరవడిందిప్పుడు. మోదీ ఒక పార్టీకి నాయకుడు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ- ప్ర జలు దయదలిస్తే కొనసాగవచ్చు. లేదంటే గుజరాత్ వెళ్లి పటేల్ విగ్రహం పనిచూసుకోవచ్చు. అప్పుడు ఈ దేశానికి ‘ఆశాకిరణ’మైన రాహుల్ గాంధీనో, ప్రతిపక్షాలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకువచ్చే పనిలో ఉన్న నితీష్‌కుమారో, లాలూప్రసాద్ యాదవో లేక వీరెవరూ సరిపోకపోతే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నయిన మన ఢిల్లీ ఏలిక అరవిందుడో ప్రధాని కావచ్చు. కానీ, ఈ దేశానికి రక్షణపరంగా, జాతీయపరమైన ఒక విధానమంటూ రూపొదించాలి. ఆ పనిచేసిన వారెవరికైనా శాల్యూట్ చెప్పాల్సిందే. ఇప్పుడాపని బిజెపి చేయడం లేదు, అప్పుడు కాంగ్రెస్సూ చేయలేదు.
సైనికులకు సర్కారు చేస్తున్న ఖర్చును కూడా అనవసరంగా భావించే దేశభక్తులున్న పుణ్యభూమి మనది. సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలి భరిస్తూ మన కోసం తమ ప్రాణాలర్పించే సైనికులను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత పాలకులదే కదా? కానీ మందుబాటిళ్లు, మిలటరీ క్యాంటిన్ సరుకులు, ఇళ్లస్థలాల కోసమే సైన్యంలో చేరుతున్నారని గతంలో ఘనత వహించిన ఓ టిడిపి ఎంపి చేసిన వ్యాఖ్య ఒక్కటి చాలు, మన ప్రజాప్రతినిధుల్లో సైన్యం పట్ల ఎంత గొప్ప అభిప్రాయం ఉందో చెప్పడానికి! సరిహద్దుల వద్ద పాక్ కిరాతకుల చేతిలో దారుణ హత్యకు గురైన జవాన్లకు సంబంధించి దేశమంతా ఒక్క గళమే వినిపించాల్సిన వేళ, అందులో భిన్నాభిప్రాయాలు, విభిన్నవాదనలు- పరాయిదేశం ముందు పలచన చేసేవేనన్న విషయం గ్రహించకపోవడం సిగ్గుచేటు. గతంలో చేసిన సర్జికల్ దాడులు మళ్లీ ఆశించడంలో తప్పేమీ లేదు. అది ప్రతి భారతీయుడి ప్రతీకారేచ్ఛకు నిదర్శనం. కానీ, విదేశీ-రక్షణ విధానాలు, సైనిక వ్యూహాలపై బజారుకెక్కడమే తప్పు. ఈ విషయంలో బిజెపి సహా ఏ పార్టీకీ వాటిని ప్రస్తావించే నైతిక అర్హత లేదు.
సరిహద్దుల్లో కిరాతక చర్యకు కొద్దిరోజులు ముందే చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలితీసుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు విషాద ఘటనలను ఏ ఒక్క పౌరహక్కుల సంఘ మేధావీ ఖండించలేదు. ఈ దేశంలో మానవహక్కులు, ప్రజాస్వామ్య ఫలాలు ఎవరికి ఎంత ఎక్కువ అందుతున్నా యి? వాటిని ఎవరు ఎక్కువ అనుభవిస్తున్నారన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. ఎందుకంటే మనది పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశం. బాధ్యతల కంటే హక్కులకే ప్రాధాన్యం ఇచ్చే జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్క మనమే. పోలీసులు, మిలటరీ జవాన్లపై ముష్కరమూకలు దాడులు జరిపి, డజన్ల సంఖ్యలో హతం చేస్తే ఏ ఒక్క పౌరహక్కుల మేధావి గళం విప్పడు. అదే పని పోలీసులు, మిలటరీ దళాలు- ఉగ్రవాదులపై, తీవ్రవాదులపై చేస్తే మాత్రం వాటిని ఖండించడానికి దేశంలో ఉన్న చిన్న మీటింగుహాళ్లు కూడా సరిపోవు. తమ మేధస్సును ఉపయోగించి రాసే కరపత్రాలకు ఈ దేశంలో ఉన్న న్యూస్‌ప్రింటూ సరిపోదు. అదీ మనదేశ గొప్పతనం! పాకిస్తాన్‌లో పరదేశీ పాటను మెచ్చుకున్నా, పరాయి దేశ క్రికెటర్‌ను మెచ్చినా అతని పని అయిపోయినట్టే. కానీ మన యూనివర్శిటీల్లో మనదేశ ప్రజల పన్నులతో ఉచిత విద్యను అనుభవిస్తున్న వామపక్ష చిరంజీవులు మాత్రం పాక్ ఉగ్రవాదులను ఫొటోలు పెట్టి మరీ పూజిస్తారు. దేశాన్ని ఖతం చేయాలన్న వారి పిలుపును సమర్థిస్తారు. అవేమీ మానవహక్కుల నేతలని చెప్పుకునే మేధావులకు పట్టదు.
చత్తీస్‌గఢ్ దారుణకాండలో మావోల చేతుల్లో హతులైన 25 మంది జవాన్లకు ఒక్క మానవహక్కుల మేధావి సానుభూతీ దక్కలేదు. యాభైఏళ్ల నక్సల్బరీ ఉద్యమం తొలినాళ్లలో జనానికి చేరువయిందన్నది నిజం. 90వ దశకం వరకూ జనం ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మావోయిస్టులుగా రూపాంతరం చెందకముందున్న పీపుల్స్‌వార్ పార్టీకి బలమైన నాయకత్వంతోపాటు అంకితభావం ఉన్న క్యాడరూ ఉండేది. అప్పట్లో ఆర్‌ఎస్‌యు విద్యార్ధి విభాగంలో చురుకుగా పనిచేసినప్పటి నా అనుభవాలను, 94 తర్వాత మారిన పరిణామాలను బేరీజువేసుకుంటే ఉద్యమానికి జనం మద్దతు తగ్గిపోయిందనేది నిష్ఠుర నిజం. మిగతా వ్యవస్థల మాదిరిగానే బలహీనతలు చొరబడటం, తమ సిద్ధాంతాలను మెప్పించడంలో వైఫల్యం కావడం, గ్రూపులు పెరిగి చందాల దందాలకు పాల్పడి, ఆ తర్వాత సెటిల్‌మెంట్లు చేసే దళారులుగా రూపాంతరం చెందడం వంటివన్నీ ప్రజలకు ఉద్యమం దూరమవడానికి కారణమయ్యాయి. ఇటీవల మృతి చెందిన నరుూం, అంతకుముందు కత్తుల సమ్మయ్య, జడల నాగరాజు వంటి మాజీ నక్సలైట్లు చేసిన దందాలు జనం ఇంకా మర్చిపోలేదు. ఎక్కువకాలం అనారోగ్యానికి గురయిన సీనియర్ కామ్రేడ్లు ఇక ఆయుధం పట్టే ఓపిక లేక లొంగుబాట్ల బాట పట్టి, జనజీవనస్రవంతిలో కలవడంతో ఉద్యమం సహజంగానే బలహీనపడింది.
మార్పు అనివార్యం. ఈ వ్యవస్థను మార్చేందుకు సర్వం త్యాగం చేసి కుటుంబ జీవితాన్ని కోల్పోయి, తమ జీవితాలను ప్రజలకు అంకితం చేసిన అలనాటి నేతలను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. రాజ్యంపై తిరగబడాలన్న సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకుని, వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ వ్యవస్థను మార్చేందుకు తుపాకులు పట్టిన ఎందరో కామ్రేడ్లు ఆనక జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. దానికి కారణాలేమైనా తాము మార్చాలనుకున్న వ్యవస్థను ఏమీ చేయలేమన్న తత్వాన్ని అనుభవంతో గ్రహించారు. అంతెందుకు? ఓటుస్వామ్యాన్ని వ్యతిరేకించే మావోలు నేపాల్‌లో ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారమే చేజిక్కించుకున్నారు. జనం కష్టాలను పాటగా మార్చి దానిని పాలకులపై ప్రయోగించిన గద్దర్ ఇప్పుడు ఓటు స్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. గద్దరన్న కూడా ఆస్తికుల మాదిరిగానే గుళ్లకు వెళుతున్నారు. దీన్ని తప్పుపట్టడమో, ఎద్దేవా చేయడమో తగదు. ఇవన్నీ.. వ్యవస్థ ఎప్పుడూ మారదు. మనమే వ్యవస్థకు అనుగుణంగా మారాలని చెప్పే జీవిత సత్యాలే.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మారుమూల ప్రాంతాలు పాలకులచేత నిర్లక్ష్యానికి గురువుతున్నాయని చెప్పే మావో మేధావులు పేలుస్తున్న తూటాలు, ముందువరసలో విధినిర్వహణలో ఉన్న అదే బడుగు బలహీనవర్గాలకే తగులుతున్నాయి కదా? రోడ్డు నిర్మాణాలను అడ్డుకోకుంటే మావోలు చెప్పే ‘ప్రజాచైతన్యం’ మరింతగా పెరుగుతుంది కదా? మరి వాటిని అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? తర్కంగా కాకుండా నేరుగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే వారెవరు?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144