సబ్ ఫీచర్

పొదుపులో పెద్దలే పిల్లలకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధనం మూలం మిదం జగత్’, ‘పైసామే పరమాత్మ’, ‘డబ్బుకు లోకం దాసోహం’, ‘్ధనమేరా అన్నిటికీ మూలం’... ఇలా ఎంతగా అనుకున్నా జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఎవరికైనా ధనం అవసరమే. డబ్బు సంపాదనకు అనేక మార్గాలున్నాయి. కష్టపడి నిజాయితీతో ధనం సంపాదించేది కొందరైతే, అనేకానేక అడ్డదారులు తొక్కి అక్రమంగా సంపాదించేది ఇంకొందరు. జీవితంలో ఎదగడానికి డబ్బును కొందరు పొదుపుగా వాడుకుంటే, వ్యసనాలను తీర్చుకునేందుకు నేరాలకు సైతం పాల్పడేది మరికొందరు. ధనలక్ష్మిని అదుపులో ఉంచుకుని, పొదుపును పాటించేవారే సుఖసంతోషాలతో ఉంటారన్నది జగమెరిగిన సత్యం. డబ్బు సంపాదించే పెద్దలు పొదుపును పాటిస్తూ, ఆ విషయం పట్ల పిల్లలకు తగిన అవగాహన కల్పించడం నేటి రోజుల్లో అత్యంత అవసరం. ఈకాలపు పిల్లలు చిన్నతనం నుంచే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు వినియోగిస్తూ అందర్నీ అబ్బురపరుస్తుంటారు. వారు ఏదైనా కొత్త విషయాల్ని ఇట్టే నేర్చేసుకుని అందరినీ విస్మయపరుస్తుంటారు. వారి మేధాశక్తిని గుర్తించి మంచి అలవాట్లను పెద్దలే నేర్పించాలి. పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేయాలంటే పొదుపు పట్ల వారికి తగిన అవగాహన కల్పించాలి.
సాధారణంగా ఇళ్లలో పెద్దవారు చిన్నపిల్లల ముందు డబ్బు గురించి అంతగా మాట్లాడరు. ఇంటి ఖర్చులు, సంపాదన వంటి వివరాలు పిల్లలకు తెలియవు. డబ్బు గురించి చెబితే చిన్నారులు ఎక్కడ పెడత్రోవ పడతారోనన్న అపోహ చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఇది తప్పని ముందుగా పెద్దలు గ్రహించాలి. మధ్యతరగతి కుటుంబాల్లో పెద్దలు నెల బడ్జెట్‌కు ముందే రూపకల్పన చేసుకొని, సంపాదనను ఎలా ఖర్చు చేయాలో, ఎంతమేరకు పొదుపు చేయవచ్చో వంటి వివరాలు పిల్లలకు చెబుతుండాలి. ఆడంబరాలకు పోయి డబ్బును దుబారా చేయకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. సంపాదన ఎంత? ఖర్చుపెట్టేది ఎంత? ఇంటి నిర్వహణకు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? రోజువారీ ఖర్చులను ఒక కాగితం మీద రాసుకోవాలి. తప్పనిసరి అవసరాలకు ఖర్చు చేయగా మిగిలిన మొత్తాన్ని ఇంటి నిర్మాణానికో, తప్పనిసరైన గృహోపకరణాలను కొనేందుకో వినియోగించాలి. ఏ నెలలో ఏం కొనాలనేది ముందుగానే నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా పొదుపు పాటించాలి. అనవసర ఖర్చులు, పొదుపు ఎలా చేయాలి? అనే విషయాలపై పిల్లలతో మనసువిప్పి మాట్లాడాలి. దీనివల్ల వారికి భవిష్యత్‌లో డబ్బును ఎలా వాడుకోవాలన్న విషయం అర్థమవుతుంది. సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అనుసరిస్తారు. గనుక వారికి పేరెంట్స్ ఆదర్శప్రాయంగా ఉండాలి. పిల్లల పేరిట బ్యాంకులో నెలనెలా ఎంతోకొంత మొత్తం పొదుపు చేస్తుండాలి. పొదుపు చేసుకోమని వారి చేతికి డబ్బు ఇస్తే మొదటికే మోసం వస్తుంది. పెద్దలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తే పిల్లల్లోనూ అదే ధోరణి వచ్చే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నామని, ప్రతి రూపాయి పిల్లల అభివృద్ది కోసమేనని వివరించాలి. పిల్లలు పొదుపు చేసే మొత్తాలతో వారికి అవసరమైన పుస్తకాలు, దుస్తులు వంటివి కొనాలి. పిల్లలకు ఇంట్లో చిన్న చిన్న పనుల్ని అప్పజెప్పి, వాటిని పూర్తిచేస్తే ప్రోత్సాహకరంగా కొంత ధనాన్ని ఇస్తూ, ఆ మొత్తాన్ని పొదుపు ఖాతాలో వారిపేరిట జమ చేస్తుండాలి. తాము పొదుపు చేసిన మొత్తంతో కొత్త వస్తువులు కొనుక్కున్నామన్న సంతృప్తి చిన్నారుల్లో వెల్లివిరుస్తుంది. బ్యాంకులు అందించే పొదుపు పథకాల గురించి వారికి చెబుతుండాలి. ఇళ్లలోనే కాదు, పాఠశాలల్లో కూడా పిల్లలకు డబ్బు పొదుపు గురించి టీచర్లు అవగాహన కల్పించాలి.

-ఈ వేమన