సబ్ ఫీచర్

పాపికొండల్లో పాపాల (పరి)హారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందిరం, మసీదు, చర్చి వంటివి పవిత్ర స్థలాలు. సందర్శకులకు, భక్తులకు అనేక నిబంధనలుంటాయి. సెల్‌ఫోన్లు, బ్యాగులతోపాటు బెల్టుల్ని కూడా అనుమతించరు. మరికొన్ని స్థలాల్లో కట్టుకునే దుస్తులపైనా నిబంధనలుంటాయి. టోపీ పెట్టుకోవడం, ముసుగు వేసుకోవడం లాంటివి విధిగా పాటించాల్సిందే! కాని ప్రకృతి ఒడిలో, నదీ తీరాల్లో, సముద్రపు ఇసుక తినె్నలపై ఎలా మసులుకోవాలో నిబంధనలెక్కడా లేవు, అలాంటివి కానరావు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి ఆవాసాల్ని బాధ్యతతో కూడిన భావంతో (్భక్తితోకాదు) గౌరవిస్తే, భక్తి పేరున, ముక్తి మార్గంలో మనదంతా ప్రకృతి విలోమ సిద్ధాంతమే! నమ్మకాల పేరున ఈ ఆవాస ప్రాంతాలకు భక్తి పేరున జనాల్ని భారీగా తరలించడం, వినోదం పేరున, ప్రకృతి అందాల వీక్షణం పేరున, రిసార్టుల పేరున విహార (విరహ) యాత్రల్ని ప్రోత్సహిస్తూ కాంట్రాక్టర్లకు కొమ్ముకాయడం పాలకుల విధిగా మారిపోయింది.
ఓవైపు ప్రాజెక్టుల పేరున ప్రకృతి సంపదతోపాటు అటవీ సంపద ధ్వంసమైపోతుంటే, సుదూర ప్రాంతాల నదుల, ప్రకృతి అందాలు తిలకించే పేరున ఉన్న వర్గాలు, ఉన్నత వర్గాలు వినోదం పేరున అడవుల్ని, కొండల్ని, నదీనదాల్ని నిత్యం కలుషితం చేస్తూ అపవిత్రం చేస్తున్నాయి. కాంట్రాక్టర్ల ముసుగులో పాలక వర్గాలే మనసా వాచా వీటిని ప్రోత్సహిస్తూ తరిస్తున్నాయి. పైగా గత 34 సంవత్సరాల కాలంలో (1980-2014) గత ప్రభుత్వాలు ఇరు తెలుగు రాష్ట్రాల పరిధిలో కేవలం 24వేల హెక్టార్ల అటవీ భూములను వివిధ ప్రాజెక్టులకై సేకరిస్తే, మూడు సంవత్సరాలలో తాము 8,400 హెక్టార్ల అటవీ భూముల్ని సేకరించి అభివృద్ధి మార్గాన పయనిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఢంకా భజాయించి ప్రకటించడం గమనార్హం! అంటే గత ప్రభుత్వాలకన్నా తామే అధికంగా పిచ్చాసుపత్రుల్ని కట్టామన్న చందంగా వుందీ వ్యవహారం!
పాలకులే కంచె దాటితే, పాలితులు గట్టుపైన కూర్చొని పంట కాపు కాస్తారా..? ఓసారి గోదావరి పరీవాహక ప్రాంతంలోని అందమైన పాపికొండల్ని చూస్తే మన ప్రకృతి ఆరాధన ఎంతో, పాలకుల భక్తి ఎంతో సమాధానం దొరకవచ్చు! భద్రాచలం నుంచి రాజమండ్రికి గోదావరిలో 200 కి.మీ ప్రయాణంలో నది వంపులు, లోయలు స్వయంగా చూస్తేగాని తనవి తీరదు. ఇలా తూర్పు కనుమల్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా చీల్చుకుంటూ వయ్యారంగా పోయే మార్గమే పాపికొండలు (డివైడ్)గా ప్రసిద్ధిగాంచాయి. ఒకప్పుడు ఇరు ప్రాంతాల ఆదివాసుల (కోయ, కొండరెడ్డి, భగత మొ)కే ఆలవాలంగా, ఆవాసంగా, జీవన ప్రయాణంగా, జీవితంగా, ఊపిరిగా అలరారిన నది, నదీతోపాటు ఆకాశాన్ని తాకే కొండలు, వాటిపై పచ్చని తివాచిలా విస్తరించిన జీడిమామిడి, మామిడి, చింత, వెదురు, ఇతర విలువైన అటవీ సంపద ఒకప్పుడు ఆదివాసుల ఆత్మగా, హక్కుగా ఉండేది. ఈ ప్రశాంత, ఆహ్లాద ప్రకృతిపై ప్రభుత్వాల దృష్టి శతాబ్దాల కాలంగా పడడం, అభివృద్ధి పేరున వాటిని ధ్వంసం చేయడం, వీటి పరిరక్షణ పేరున ఆదివాసులు సంప్రదాయ ఆయుధాలతో ఎదుర్కోవడం కథలుగా, గాథలుగా చెప్పుకుంటూనే ఉన్నం. ఇలా బాహ్య సమాజమే తెలియని ఈ ఆదివాసీ సమాజాన్ని జాతీయ స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) పేరున ఆదివాసేతరులుగా మార్చే ప్రక్రియ బ్రిటీషు పాలకుల కాలం నుంచే రాజ్యం మొదలుపెట్టింది. ఈ ముసుగులో మైదాన, పట్టణ ప్రాంత దళారుల్ని, వ్యాపారుల్ని, కాంట్రాక్టర్లని, ఆదివాసుల్ని, ఆ ప్రాంత అటవీ సంపదల్ని దోచుకునేలా ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఈ అభివృద్ధిని ‘మిధ్యా అభివృద్ధి’ అంటూ, అటవీ సంపదల్ని, ఖనిజ సంపదల్ని కొల్లగొట్టడమేకాక, తమ బతుకుల్ని ఛిద్రం చేస్తున్నాయని తరతరాలుగా ఆదివాసులు నినదిస్తూనే వున్నారు.
ఈ విషయాలన్నీ పట్టింపు వున్న జనాలెందరు? అనేది ప్రశ్న కాగా, వీటిని తనివితీరా అనుభవించాలని, చవిచూడాలని, దొరికినకాడికి చిదిమివేయాలనే ఆలోచనాపరులే ఎక్కువ. ఈ కోవలోనే పాపికొండల యాత్ర కొనసాడం గమనార్హం. నదుల సర్వే నేపథ్యంలో, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ కాలంలో ఈ పాపికొండల అందాలు బాహ్య సమాజానికి తెలిసి వచ్చాయి. అప్పటినుంచే ఆ కొండల్లో ఆవాసం ఉండే ఆదివాసుల ఉనికికే ప్రమాదకరంగా మారింది. ఇక ఆధునిక పాలకుల నిర్వాకంతో, మొత్తంగా ఆ ప్రాంతాల ఆదివాసులు నిర్వాసితులుగా మారబోతే ప్రకృతికే తలమానికంగా ఇరువైపులా తీర్చిదిద్దినట్లుగా వున్న వరుస కొండలన్నీ పోలవరం ప్రాజెక్టులో కనుమరుగు కాబోతున్నాయి. అలా మునక్కముందే ఆ అందాలను ఆస్వాదించాలనే ఆతృత పర్యాటకులదైతే, తమ ఆవాసాలే కాదు, తమ జీవితాలకే భద్రత లేకుండా పోయిందనేది ఆ ప్రాంత ఆదివాసుల గోడు! మా గోడును పాలకులు ఎలాగో వినడం లేదు కానీ, అంతా చదువుకున్నవారు, నాగరికులమంటూ, బీరాలు పలికేవారు, తమను అనాగరికులని ముద్రవేసినవారు మా గూర్చి ఒక్క క్షణం ఆలోచించడం లేదనే వారి ఆవేదన రోదనగానే మిగిలిపోతున్నది.
వినోదం పేరున, విహార యాత్ర పేరున గోదావరి నది పరవళ్ళను ప్రత్యక్షంగా చూడాలని, అలలపై వీచే పిల్లగాలులను పీల్చాలనే తపన వుండడంతో తప్పులేకపోవచ్చు! వీటికై సౌకర్యాల్ని కల్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కాంట్రాక్టులు దక్కించుకున్న దళారులది కావచ్చు! కానీ, ఈ విహార యాత్ర పేరున ప్రకృతి ఒడిలో జరుగుతున్న విధ్వంసం పాలకులకు, కాంట్రాక్టర్లకు ఎలాగూ పట్టకపోయినా, బాధ్యతగల పౌరులుగా సందర్శకులు కనీసంగా పట్టించుకోకపోవడం శోచనీయం కాదా? మద్యం సేవించడం నిషేధం అని యాత్రికులకు ఏర్పాటుచేసిన కాటేజెస్ (గుడిసెలు, టెంట్లు) ప్రాంతాల్లో నినాదాలు కనపడుతున్నాయి. కాని వాటి పక్కన పాలకుల కనుసన్నల్లోనే మద్యం అమ్మడం ఓ వింతగా తోచదు. అడవి బిడ్డలు స్వచ్ఛమైన ఇప్పసారా తయారుచేసుకొని తమ సంస్కృతిలో భాగంగా సేవిస్తే అది నిషిద్ధం! కాని, విదేశీ మద్యం వినోదం పేరున విచ్చలవిడిగా తాగి, ఖాళీ సీసాల్ని, ప్లాస్టిక్ గ్లాసుల్ని, తినుబండారాల ప్లాస్టిక్ కవర్లని నది తీరాల్లో టన్నులకొద్ది డంప్ చేయడం జరుగుతుంది. తాగిన మత్తులో సీసాల్ని పగలగొట్టి, నదిలో కలిసే వాగుల్లోని నీటిలో విసిరే వికృత చర్యలపై నిషేధం లేదు. పైగా ఆ గాజు పెంకులు జల జీవాలైన చేపలకు, మొసళ్ళకు, తాబేళ్లకు ఇతర జీవజాలానికి ఎలా ప్రాణాంతకంగా మారుతాయని ఈ పట్టణవాస (అ)వివేకవంతులకు తెలియదని అనుకుందామా? వీటిని నియంత్రించలేని పాలకుల, నిర్వాహకులదని సమాధానపడుదామా? వచ్చిందే సరదాకాయే.. తాగకపోతే ఎలా? ఆగి విసరకపోతే ఎలా..? తాగి తిన్న కవర్లని జేబులో పెట్టుకోలేంగా..? అనేవి సందర్శకుల మాటల తూటాలైతే, నియంత్రణ మొదలుపెడితే, యాత్రికులెలా వస్తారంటూ నిర్వాహకుల ఎదురుప్రశ్న! అలాంటప్పుడు ‘నిషేధం’ అనే మాటలెందుకు? అంటే, చట్టం వుందని గుర్తుచేయడానికేననే నోరు మూయించే సమాధానం!
చీకటి కార్యకలాపాలకు తహతహలాడే జంటలు కొన్నైతే, బొంగు చికెన్ కోసం వెంపర్లాడేవారు అత్యధికులు. వచ్చే చూసేవారంతా విద్యాధికులే! ప్రకృతి గూర్చి, పర్యావరణ పరిరక్షణ గూర్చి, సమతుల్యత గూర్చి ఉండాల్సిన జీవైవిధ్యం గూర్చి కాలేజీల్లో ఆపోసన పట్టినవారే! అయితేనేమి? అంతా పట్టింపులేని వ్యవహారమే! డబ్బులు ఇస్తున్నామని పర్యాటకులు, సౌకర్యాలు కల్పిస్తున్నామమని నిర్వాహకులు సమాంతర రేఖల్లా కాదు, వక్రరేఖల్లా కలిసిపోతారు. అందుకే కావాల్సినంతగా చికెన్, తిన్నంతగా చేప పులుసు, ఫ్రైలను మందుబాబులకే కాదు, మడికట్టుకున్నవారికి కూడా ఇక్కడ రుచి చూపిస్తున్నారు. అతిథి దేవోభవ..! పేరున ఇక్కడ కురిసేది కాసుల వర్షం! వ్యక్తిగత స్వేచ్ఛ పేరున వికృత చర్యలు- వెరసి పాపికొండల అనుభూతులుగా అలరారుతున్నాయి. ఈ (అ)నాగరిక జనాల్ని చూస్తూ ఇక్కడి ఆదివాసులు ముక్కున వేలు వేసుకోవడం, ముసిముసిగా నవ్వడం కొండలపై నుంచి జాలువారే నీటి దారల సాక్షిగా కొనసాగుతున్నది. పాపికొండల్ని ఎంతగా తరించామనే ధ్యాసకన్నా ఎంతగా వినోదాంచామన్నదే ప్రధానం!
అందుకే కాబోలు, ఇలాంటి రేపటి తరాన్ని కని, ఇబ్బందులకు గురిచేయడం కన్నా కనకపోవడమే మంచిదనే అభిప్రాయానికి కొందరు మహిళలు వస్తున్నట్లు ఈమధ్యన అమెరికాలో. ‘గర్వించతగ్గ భవిష్యత్తు..’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ సంగతి చెప్పడం గమనార్హం. ఇలాంటి అసమగ్ర పరిస్థితికి తమ పిల్లల్ని గురిచేయడం ఇష్టం లేదనేది వారి వాదన! అంటే చివరగా మిగిలిపోయిన కొమ్మను నరికినాక కాని, చిట్టచివరి నీటి బొట్టును అనుభవించినాక గాని, చివరి చేప పిల్లను కాల్చుక తిన్నాక కాని మన రేపటి భవిష్యత్తు అర్థం కాకపోతే.. సమాధానం చెప్పేది ప్రకృతే కావచ్చు!?
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162