సబ్ ఫీచర్

దేశభక్తి అంటే ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల 9న జెఎన్‌యులో అఫ్జల్ గురు వర్ధంతి కార్యక్రమాన్ని ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఏఎస్‌ఏ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలతో వీరు హోరెత్తించారు. సియాచిన్ మంచుకొండలలో దేశం కోసం ప్రాణాలర్పించిన హనుమంతప్ప, మస్తాక్ అహ్మద్‌ల వంటి సైనికుల త్యాగాలకు నీరాజనాలు పలుకుతూ దేశమంతా ఒక్కతాటిపై నడుస్తున్న వేళ, పిడికెడు మంది జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులు దేశ వ్యతిరేక చర్యకు పాల్పడటం, జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపింది. ఇటీవల హైదరాబాద్‌లోని హెచ్‌సియులో జరిగిన సంఘటనలకు మూలం కూడా ముంబయి పేలుళ్లకు బాధ్యుడైన ఉగ్రవాది యాకూబ్ మెమెన్‌కు జైకొడుతూ భారత వ్యతిరేక-పాక్ నినాదాలతో, నమాజ్‌లతో 2015, జులై 15న జరిగిన కార్యక్రమంతోనే మొదలైంది. చివరికి దీన్ని విద్యార్థి సంఘాల మధ్య కొట్లాటగా, కులసమ్యగా చిత్రీకరించారు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు ఇతర చిన్నా చితకా పార్టీలు అబద్ధాలను ప్రచారం చేయడంలో, భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో పోటీపడ్డాయి. దేశ వ్యతిరేక చర్యలను ఉగ్రవాదులకు మద్దతు తెలిపే ఉన్మాదాన్ని ఎండగట్టడాన్ని కావాలనే విస్మరించడం గర్హనీయం. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఆచార్యులు సర్. గిలాని, ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో అఫ్జల్ గురును భారత కోర్టులే హత్య చేశాయని తేల్చేశాడు. ఇటువంటి దేశ వ్యతిరేక, ఉగ్రవాద అనుకూల రంకెలు వేస్తూ వాక్‌స్వాతంత్య్రం అంటూ సమర్థిస్తారు మన హక్కుల కార్యకర్తలు, కొంతమంది మేధావులు, రాజకీయ నాయకులు. ఈ దౌర్భాగ్యం జాదవ్‌పూర్ యూనివర్సిటీకి కూడా సోకింది.
ఇటీవల విరాట్ కోహ్లిపై అభిమానంతో పాకిస్తాన్‌లో తన ఇంటిపై భారత జెండా ఎగురవేసిన ఉమర్ డ్రాజ్ అనే కుట్టుపని వానికి పదేళ్ల జైలుశిక్ష విధించింది పాక్ ప్రభుత్వం. భారత క్రికెట్ జట్టుపై పాక్ జట్టు గెలిచినప్పుడల్లా మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్ జెండా ఎగరడం పరిపాటైంది. ఈదేశం తిండి తిని, గాలి పీల్చి, నీళ్లు తాగి, ఇక్కడి పేద ప్రజలు కట్టే పన్నులతో చదువుకునే విద్యార్థులు, లక్షల్లో జీతాలు తీసుకునే అధ్యాపకులు పాక్‌కు తొత్తులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
ఈ మేధావుల జాతి వ్యతిరేక ప్రవర్తనకు కారణాన్ని 2011లో అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అరెస్ట్ చేసిన డాక్టర్ సయ్యద్ గులాం నభీ ఫాయ్ ఉదంతం నుంచి కొంతవరకు తెలుసుకోవచ్చు. కాశ్మీర్‌లో పుట్టి, అమెరికా పౌరుడైన ఫాయ్ అమెరికాలో పిహెచ్‌డి చేసి కాశ్మీరీ అమెరికన్ కౌన్సిల్ (కెఎసి) స్థాపించాడు. 1990 నుంచి 30 ఏళ్ల పాటు అమెరికాలో, ఇండియాలో కాశ్మీర్ అంశంపై అనేక సదస్సులు, సెమినార్‌లు నిర్వహించి కాశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతు కూడగట్టే యత్నం చేశాడు. గొప్ప మేధావిగా, అభ్యుదయ వాదిగా చెలామణి అయ్యాడు. అమెరికాలోని చాలామంది సెనెటర్లను, మేధావులను, రాజకీయ నాయకులను, మీడియాను ప్రభావితం చెయ్యగలిగాడు. ఇక్కడి వరకు తప్పేంలేదనిపిస్తుంది. కానీ 2011లో ఎఫ్‌బిఐ ఆయన్ను అరెస్టు చేయడంతో ఈ మేధావి వెనుక దాగిన కుట్రకోణం బయటపడింది. గత 30 ఏళ్ల నుంచి పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ నుంచి ఏడాదికి ఏడు లక్షల డాలర్ల చొప్పున పాయ్‌కి అందినట్లు తేలింది. ఈ డబ్బునంతా కాశ్మీర్‌కు, పాకిస్తాన్‌కు మద్దతు తెలిపే అమెరికాలోను, మనదేశంలోను సెక్యులరిస్టులుగా, ఉదారవాదులుగా, మేధావులుగా చెలామణి అయ్యే కొంతమంది పాత్రికేయులు, రిటైర్ట్ జడ్జీలు, ప్రభుత్వ అధికార్లు, అధ్యాపకులపై ఖర్చు పెట్టాడు. వీరిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కాశ్మీరీ సమస్యను పరిష్కరించడానికి నియమించిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వపు కమిటీలోని సభ్యుడైన దిలీప్ పడ్గోంకర్, సచ్చార్ కమిటీ ఛైర్మన్ అయిన జస్టిస్ రాజేందర్ సచ్చార్, వేద్ ప్రకాశ్, ఎటిటర్ హరిందర్ బవేజా, గౌతమ్ నవలాఖ, మానవహక్కుల లేత కమల్ చెనాయ్, ప్రపుల్ బిద్వాయ్ (కాలమిస్టు), ప్రధానమంత్రి మీడియా సలహాదారు హరీశ్ కరె, బర్కాదత్తా, ఇంకా ఎంతో మంది మేధావులు ఫాయ్ నుంచి లబ్ది పొందినట్టు ఎఫ్‌బిఐ తేల్చింది. ఈ సొమ్మంతా పాక్ సైన్యం, ఐఎస్‌ఐ సమకూర్చినదే. అమెరికా లాంటి దేశంలో అక్కడి భద్రతా సంస్థల కళ్లుకప్పి ఫాయ్ 30 ఏళ్లపాటు పాకిస్తాన్ ఏజెంటుగా పనిచేసి, కాశ్మీరీ ఆజాదీకి, పాక్‌కు, అటు అమెరికా, ఇటు ఇండియాలో మద్దతు కూడగట్టగలిగాడు.
మనదేశంలో మన విశ్వవిద్యాలయాలలో మేధావులు, ప్రగతిశీలకుల పేరుతో విద్యార్థుల్లో విషబీజాలు నాటుతూ, దేశ ద్రోహులకు, పాక్ ఉగ్రవాదులకు మద్దతు తెలిపే విధంగా ప్రభావితం చేస్తున్నారో మనం ఊహించలేం. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన బెట్టి పాలక-ప్రతిపక్షాలన్నీ దేశం కోసం ఏకతాటిపై వచ్చి మన భద్రతా సంస్థలకు, నిఘా సంస్థలకు స్వేచ్ఛనిస్తే ఎవరు ఎందుకు పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారో ఒక్కరోజులో తేల్చేస్తారు. ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఆమె చాలా అమాయకురాలని ప్రతిపక్షాలు, హక్కుల సంఘా లు, మేధావులు గగ్గోలు పెట్టారు. అమె కరుడుకట్టిన ఉగ్రవాది అని డేవిడ్ హెడ్లీ అనే ముంబయి పేలుళ్లకు బాధ్యుడైన మరొక ఉగ్రవాది చెబితే కాని వీళ్ల నోళ్లు మూతపడలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన నాయనమ్మ, తండ్రి, ఉగ్రవాదుల బాధితులని కూడా విస్మరించి వందలాది మంది మరణానికి కారణమైన ముంబయి అల్లర్ల నిందితుడు యాకుబ్ మెమెన్‌కు మద్దతు తెలిపిన విద్యార్థులను మహాత్ముడితో పోల్చడం సిగ్గుచేటు. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశం ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నదనే అంశాన్ని కూడా రాహుల్ మరచి, ఉగ్రవాద అనుకూల, దేశవ్యతిరేక శక్తులకు మద్దతు పలకడం శోచనీయం.
కాంగ్రెస్ తన లబ్దికోసం మొదటినుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. ఇక గతితప్పిన తిక్క వాదంతో కమ్యూనిస్టు పార్టీలు ఊరంతా ఒకదారైతే-ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు అనేక సందర్భాల్లో వ్యవహరించి, తర్వాతి కాలంలో చారిత్రక తప్పిదం చేశామంటూ లెంపలేసుకున్న సందర్భాలు అనేకం. స్వాతంత్య్రోద్యమ కాలంలో నేతాజీని వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీ,క్విట్ ఇండియా ఉద్యమంలో, 1962 నాటి చైనాతో జరిగిన యుద్ధంలో ఎవరి పక్షాన ఉన్నదో భారత ప్రజలు మరచిపోలేదు. యూనివర్సిటీల్లో చదువుకునే అట్టడుగు విద్యార్థులలో విషం నింపుతూ తము కూర్చున్న చెట్టును తామే నరుక్కుంటున్న చందంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధ్యాపకులు ఎవరి ఏజెంట్లుగా పనిచేస్తున్నారో కాలమే నిర్ణయిస్తుంది.
ప్రపంచ దేశాలు భారత గౌరవాన్ని గుర్తిస్తున్న వేళ, ఐక్కరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందబోతున్న తరుణంలో ఏ దేశ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీలు వాటి విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయో ప్రజలకు చెప్పాలి. ప్రతిపక్షాలు అంశాల వారీగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు కాని, ఉగ్రవాదాన్ని సమర్థించే చర్యలకు పాల్పడటం ఏ రాజనీతికిందికి వస్తుంది? మన విద్యార్థులనే మన దేశానికి వ్యతిరేకంగా ఎగదోయడం ఇప్పుడే మొదలైన పనికాదు. గత 60 ఏళ్లుగా కుహనా వామపక్ష మేధావులు చాపకింద నీరులా చేస్తున్న ప్రయత్నాలే. ఇప్పుడు బయటపడ్డాయంతే. ఇప్పటికైనా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఏఎస్‌ఏ వంటి విద్యార్థి సంఘాలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు జాతికి క్షమాపణ చెప్పాలి.

-డాక్టర్ మాసాడి బాపూరావు ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు