సబ్ ఫీచర్

ప్రజాస్వామ్యం ముసుగులో ‘రాచరికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ప్రాచీన కాలంలోను, మధ్యయుగాల్లోనూ, ఆమాటకొస్తే బ్రిటిష్ వారాక్రమించుకునే వరకూ, వివిధ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులూ వుండేవారు. వారి పాలన మాటెలావున్నా వారి జీవనశైలి అతి ఆడంబరంగా వుండేది. రాజుగారు బయలుదేరితే ఏనుగు అంబారీపై కూర్చుని వెళ్ళేవారు. ఆ ఏనుగుకు ముందు ఆయుధ పాణులైన నలుగురు సైనికులు గుఱ్ఱాలమీద వెళ్ళేవారు. అలాగే వెనుక నలుగురు, వారి వెనుక గజాలు, గుఱ్ఱాలూ వెళ్ళేవి. రథాలుండేవి! అందుకే, ‘‘రాజువెడలె రవి తేజములలరగ’’అనే మాట వచ్చింది! అయితే, ఈ ఆడంబరానికంతా అయ్యేఖర్చు ప్రజలే భరిస్తున్నారనే విషయం ప్రజలకే తెలియదు! ఆ తర్వాత రాజ్యాలు పోయాయ. రాజులూ పోయారు.
స్వాతంత్య్రం వచ్చాకా, రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ ప్రజాప్రభుత్వాలేర్పడ్డాయి. రాజులు, చక్రవర్తుల స్థానంలో మంత్రులొచ్చారు. ఆ ఆడంబరాలు, విలాసాలూ కనుమరుగయ్యాయి. అయితే, ఆ తరం నాయకులున్నంతవరకే ఈ పరిస్థితి కొనసాగింది. స్వాతంత్య్ర సమరతరం నాయకులు తరలివెళ్ళిపోయారు. కొత్తతరం నాయకులు మంత్రులు మొదలైన వివిధ పదవుల్లోకొచ్చారు. ఈ కొత్తతరం వారికి, పదవులనేవి ప్రజలకోసం కాదు, ప్రజలను పాలించడంకోసమే! అపరిమితమైన ధనార్జనకోసమే! పాలకులనగానే, రక్షణ ఇతర కారణాలరీత్యా ఆర్భాటాలూ, సెక్యూరిటీ వుండక తప్పదని వీరి అభిప్రాయం. ఇప్పుడు సాధారణ మంత్రిగారి నుండి, ముఖ్యమంత్రులు, ప్రధానమత్రిగారివరకూ ఇదే బాణీ! వీరంతా వి.వి.ఐ.పి.లు. ఒక వి.వి.ఐ.పి. ఎక్కడికెళ్ళినా, ముందు ‘పైలట్’ కారుంటుంది. ఆ తర్వాతాయన కారుంటుంది. ఆ వెనుక కారుల ‘కాన్వాయ్’ వుంటుంది. ఇది ఆనాటి రాజురి పరివారం కంటే గొప్పది, అంతకంటే ఖరీదైనది! ఆనాటి గుఱ్ఱాలు, ఏనుగుల కంటే ఈ కారులు సైజులోను, విలువలోనూ ఎక్కువే! వారెళ్ళినచోటల్లా బోలెడంత పోలీసు బందోబస్తు. ఇదంతా ఎందుకూ అంటే, ఆయనకు రక్షణ కావద్దా అని!
స్థానికంగా సమావేశమేర్పాటుచేసిన నాయకులు, కార్యకర్తలు, ఆయనకు గర్వించదగిన ఆహ్వానం పలుకుతారు. వేదిక ఎక్కాకా, ఆయన్ను గౌరవించడానికి పూలమాలాంకృతుడ్ని చేస్తారు. అది సాధారణ పూలదండ కాదు. సాధారణ పూల దండలను చిన్నస్థాయి నాయకులకేస్తారు. వి.వి.ఐ.పి.గారికి ‘గజమాల’ వేస్తారు. గజమాలంటే, ఏనుగులాగే అతి పెద్ద, లావైన, బరువైన పూల దండ! ఆ గజమాలను ఎవరిమెడలో వేసినా కూడా, వారు దాన్ని మోయలేరు. కనుక ఇద్దరు మనుషులు ఆయనకటూ ఇటూ నిలబడి, దండను గట్టిగా పట్టుకుని, మెడ దగ్గర పెట్టి చూపిస్తారు. కెమేరా క్లిక్‌మంటుంది. వీడియో తీస్తారు. ఆ తర్వాత గజమాలను ఇద్దరూ కలసి ప్రక్కన పెట్టేస్తారు. ఒక్క నిమిషంలో జరిగే ఈ హంగామా కంతటికీ ఎంత ఖర్చు? సాధారణ పూలదండే వందల మీద ఖరీదుంటుంది. మరి, గజమాల ఖరీదెంత? ఎవరి తృప్తికోసమీ తతంగమంతా? ఇలాగే ఎన్నో సమావేశాలు, ఎందరో వి.వి.ఐ.పి.లు! ఈ ఖర్చంతా ప్రజల డబ్బేనని అందరికీ తెలుసు. ఆ మాత్రం మర్యాదా, రక్షణా వారికవసరం అంటున్నారు. అర్ధవంతమైన మర్యాదా, రక్షణా వారికివ్వవలసిందే! కాని ఇలాంటి వాటిలో అర్థమెంత అనేది ప్రజ ప్రశ్న!
దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ కలిసి సుమారు 4వేల మంది ఎమ్.ఎల్.ఏలున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ 700 పైగా ఎంపీలున్నారు. వీరందరికీ రక్షణగా గన్‌మెన్లనిస్తారు. వీరంతా ప్రజలచేత ఎన్నుకోబడిన సభ్యులు. వారు ప్రజల్లో తిరగాలి. ప్రజాసమస్యలు తెలుసుకోవాలి. ఇలాంటి వారికి కూడా ఆపదలు కలిగే అవకాశముందా? అలా వుంటే రక్షణ కలిగించవలసిందే! కాని, అలాంటి భయాన్ని కలిగించే పరిస్థితి దేశంలో వుంటే, అందుకు కారణమేంటి అని ఎవరూ ఆలోచించడం లేదు. ఆ కారణాలనెలా తొలగించాలని ప్రయత్నాలు చేయడం లేదు. ఒక్క గన్‌మాన్‌కు జీత భత్యాల ఖర్చెంత? అంతేకాకుండా, ఆ గన్‌మాన్ తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ వి.ఐ.పి.ని కాపాడాలి. అతను కూడా మనిషే కదా! ఈ దేశ పౌరుడే కదా! ప్రజాప్రతినిధులకు గన్‌మాన్ పద్ధతి ఇదివరలో లేదు. కొంతకాలం నుండే మొదలైంది.
ఇప్పటి పరిస్థితిలో, ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే కోట్లు ఖర్చుచేయాల్సి వస్తున్నది. అందువలన కోట్లున్న వారే ప్రజాప్రతినిధులవుతున్నారు. వీరికి జీత భత్యాలు, సదుపాయాలూ ఎక్కువే వుంటాయి. పోనీ, కొటీశ్వరులకు జీత భత్యాలెందుకు, వారు స్వచ్ఛందంగానే వాటిని వదులుకొమ్మని ప్రధాని, ముఖ్యమంత్రులూ కోరవచ్చును కదా! ఆర్థికంగా బాగా వున్నవారు గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకొమ్మని ప్రధాని కోరారు కదా. కొందరాసబ్సిడీని స్వచ్ఛందంగానే వదులుకున్నారు. అలాగే, ధనవంతులైన ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను వదులుకోవచ్చును. ఇందువలన ప్రజలమీద భారం చాలా తగ్గుతుంది.పోనీ, అసెంబ్లీలలోనూ, పార్లమెంటులోనూ చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఎప్పుడూ గందరగోళమే! ఈ పార్టీ ఆ పార్టీ అని లే దు. అన్ని పార్టీలదీ అదే వరస!
మేధావులేమో, సిద్ధాంత రాద్ధాంతాలలో ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. వారి వారి సిద్ధాంత వాదనల ప్రకర్షను ప్రదర్శిస్తున్నారు. ఈ సిద్ధాంతాల పేరుతో వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లబోయి చూడడమే ప్రజల వంతైనది! కనీసావసరాలతో ఇల్లు గడుపుకోవలసిన సాధారణ కుటుంబీకులకు సిద్ధాంత రాద్ధాంతాలతో పనుండదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో నాయకులకు మెడలో నూలు దండలు (దారం దండలు) వేసేవారట! అమెరికా అధ్యక్షుడు తన గొడుగును తానే పట్టుకుంటాడు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మళ్ళీ మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థకు దారితీయవచ్చును. ఇప్పటికే నాయకులు అనువంశిక వారసత్వ అధికారాన్ని పంచుకుంటున్నారు. ఆలోచించండి!

- మనె్న సత్యనారాయణ