సబ్ ఫీచర్

అన్నింటికీ బ్రాహ్మణులనే అనడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటికీ చాలా ఊళ్ళలోని వీధులు కులాల పేరుతోనే చెలామణి అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడూ కూడా కులాలు సజీవంగానే ఉన్నాయి. కులాభిమానం ఉండేదే తప్ప కుల దురభిమానం ఉండేది కాదు. కులం తిట్లు సజీవమే. ఇప్పుడా తిట్లు కొన్ని వర్గాల వారికి పరమ నేరం. కులాన్ని సూచించే పేర్లు ఆరోజుల్లో కొందరికి మాత్రమే పరిమితమైతే నేడన్ని కులాల వాళ్ళు (మినహాయింపు మామూలేకదా!) తమ పేరు చివర కులాన్ని సూచించే తోకల్ని సగర్వంగా తగిలించుకుంటున్నారు. అదీ తప్పు లేదు. ‘‘మీరేమట్లు?’’అని అడగక్కర్లేకుండానే తెలిసిపోతూ ఉంది. ఇంతవరకు ఏ ఒడిదుడుకులు లేవు. అయితే కొన్ని కులాల తోకలతోనే వ్యక్తుల్ని సంబోధిస్తూ ఉన్నాము కాని అవేవీ తిట్టుగా (పిలిపించుకున్నవారితో సహా) ఎవరికీ తోచదు. పైగా అదే గౌరవ వాచకంగా కూడా అనిపిస్తుంది. కుల నామాలను తమ పేర్ల చివర చేర్చుకుంటున్నారు నేడు. మరి వాటినే వ్యక్తి నామాలుగా పిలిస్తే ‘కులం పేరుతో దూషించినారు’అని భుజాలెందుకు తడుముకుంటారు? పైన పేర్కొన్న కులం పేర్లు తిట్లుకానప్పుడు ఇవి మాత్రమే తిట్లు ఎందుకవుతాయి? పోనీ ఇవి తిట్లు అని ఒప్పుకుంటున్నప్పుడు పైన పేర్కొన్నవి కూడా తిట్లే ఎందుకు కాకూడదు? అప్పుడు పైవాళ్ళు కూడా కులం పేరుతో దూషించారని యాగి చేయవచ్చుకదా!
ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం ఒక్క బ్రాహ్మణులు మాత్రమే అన్ని వర్ణాల వారిని తమ ఉక్కుపాదం కింద అణచి పెట్టినట్లు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు శూద్రులకు విద్య నేర్పరు అన్న దానికి ఉదాహరణగా ఏకలవ్యుడిని, కర్ణుడిని ముందుకు తెస్తారు. ముందుగా ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాం. ఏకలవ్యుడు మహామేధావి. వేలు చొప్పితే హస్తం కాదు మనిషినే మింగ గలిగేటంతటి తెలివితేటలు అతని సొత్తు అనటానికి ఎలాంటి సంశయం అక్కరలేదు. అందుకే గురువు విగ్రహాన్ని ఎదురుగా ఉంచుకొని గురువుతో సమానమైన విద్యను నేర్చుకోగలిగాడు. అయితే మన సంప్రదాయం ప్రకారం ఏ విద్య అయినా తప్పనిసరిగా గురుముఖంగానే నేర్చుకోవాలి. అప్పుడే మనకు అందులోని మంచి, చెడు, సంశయాలు విశదమవుతాయి. ప్రపంచానే్న గుప్పెట్లో పెట్టుకోగలిగినంత సాంకేతిక అభివృద్ధిని సాధించాము కదా! ఆ సాంకేతిక సౌలభ్యంవలన ‘‘నేను వైద్య విద్యనంతా అభ్యసించాను’’ అని ఎవరైనా ఒక మేధావి సర్జరీ చేయటానికి ముందుకు వస్తే నకిలీ వైద్యుడని అరదండాలు తగిలించి కటకటాల వెనక్కితోసి దేహశుద్ధిచేస్తారా? లేదా? సాంకేతికతను ఆధారం చేసుకొని సర్జరీ చేయగలిగిన స్థాయికి ఎదిగాడని ఎదురువెళ్ళి స్వాగతం పలికి వైద్యపట్టా అందజేస్తారా? నిశ్చయంగా మొదటిదే చేస్తారు.. ఎందుకంటే కొన్ని విద్యలు తప్పనిసరిగా గురుముఖంగనా నేర్వవలసిన అవసరం ఉన్నది. గురుముఖంగా నేర్వని ప్రాణాంతకమైన అస్తవ్రిద్య శబ్ద భేది. అంటే ధ్వనినిబట్టి ప్రాణహాని కలిగించే జంతువు అయినప్పుడు సంహరించవచ్చు. కాని ఏకలవ్యుడు కుక్క ఆర్తనాదం విని తన విద్యాకౌశలంతో ఆ కుక్క నోటిలోనికి బాణాలు వేసి సంహరించినాడు. ఇది ధనుర్విద్య దుర్వినియోగం. నేటి నకిలీ వైద్యుడిని శిక్షించినట్లుగానే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు గురుదక్షిణగా అప్పటి న్యాయం ప్రకారం కోరినాడు.
ఇక కర్ణుడి వివరాలు తెలుసుకునే ముందు ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునే దరఖాస్తులో 1) విద్యార్థి పేరు ఇంటి పేరు 2) పుట్టిన తారీఖు 3) జాతి 4) మతము 5) కులము 6) తల్లిదండ్రుల పేర్లు 7) నివసించు ప్రదేశము 8) వృత్తి 9) తల్లిదండ్రులవద్ద ఉన్నాడా? 10) లేదా ఇతరుల సంరక్షణలో ఉన్నాడా? 11) ఇతరులయితే వారి పేర్లు 12) విద్యార్థితో వారికి గల బాంధవ్యం 13) వారి విలాసము 14) వృత్తి. ఇన్ని వివరాలు సరిగ్గా తెలియజేసిన తర్వాతే బడిలో ప్రవేశం లభిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వివరాలేవీ లేకపోతే వాడికి ఓనమాలో ఎబిసిడిలో నేర్చుకునే అర్హత లేదా? ఇవన్నీ అనవసరమైన అంశాలని ఎవరయినా నిలదీస్తున్నారా? పొట్టపోసుకోటానికి నాలుగక్షరాలు నేర్చుకోటానికి సవాలక్ష వివరాలు అవసరమైనప్పుడు ప్రాణాంతకమైన అస్త్ర విద్య నేర్చుకోవటానికి కర్ణుడి వివరాలను తెలుసుకోవలసిన అవసరం గురువైన పరశురాముడికి ఉంది. వివరమడిగినప్పుడు బ్రాహ్మణుడనని అసత్యమాడి మారణహోమం చేయగలిగిన అతి భయంకరమైన అస్తవ్రిద్యను అభ్యసించినాడు. అసత్యమాడటం నేరం కాదా? మారణాస్త్రాన్ని నిర్వీర్యం చేయటానికి పరశురాముడు శపించినాడు.
ఇక క్షత్రియులైన రాముడు, కృష్ణుడులకు దేశమంతటా దేవాలయాలు ఉన్నాయి. యదు వంశానికి చెందిన క్షత్రియుడు కృష్ణుడు (నేటి కులపు తూనిక రాళ్ళతో తూచి యాదవులు అనగానే గొల్లవారు అని భావిస్తూ ఉన్నారు). రామ, కృష్ణ దేవాలయాలలో అర్చకత్వం నిర్వహిస్తూ వారి పాదోదకాన్ని నెత్తిన చల్లుకోవటమే కాక పరమ పవిత్రమైన తీర్థంగా భావించి సేవించి ధన్యులౌతున్నవారు బ్రాహ్మణులే!!
బ్రాహ్మణుడైన పరశురాముడి గుడులను లెక్కబెట్టటానికి చేతివేళ్ళే చాలు. పతిసేవలో నిమగ్నురాలైన బ్రాహ్మణ యిల్లాలు కౌశికుడనే తాపసికి భిక్షవేయటానిక జాగుచేస్తుంది. పరమ కోపిష్ఠి అయిన ఆ తాపసి తన తపశ్శక్తితో కాల్చి బూడిద చేయటానికి ఆమె వంక తీక్షణంగా చూస్తాడు. నీ నెత్తిమీద రెట్టవేసిన కాకిని కాదు నాయనా కాలి పోవటానికి అన్న గృహిణి మాటలకు సిగ్గుపడి జ్ఞానబోధ చేయమని కోరితే ధర్మవ్యాధుడనే మాంస విక్రేత వద్దకు కౌశికుడిని పంపుతుంది ఆ యిల్లాలు. ఇది చాలామందికి తెలిసిన కథే అయినా బ్రాహ్మణులను దూషించేటప్పుడు మాత్రం ఎవరికీ గుర్తుకురాదు.
బోయవాడైన వాల్మీకి రచించిన రామాయణం నేటికీ బ్రాహ్మణులకు శిరోధార్యమే!! ‘‘వందే వాల్మీకి కవికోకిలం’’ అని శిరసు వంచి బోయవాడైన వాల్మీకికి వందనం చేసేవారు బ్రాహ్మణులే!! దళిత మహిళగా భావించే అరుంధతీదేవి దర్శనం చేయించనిదే బ్రాహ్మణులకు అతి ముఖ్యమైన ఉపనయనం కాని వివాహం కాని సంపూర్తికాదు. అష్టాదశ (18) పురాణాలను రచించిన వ్యాస మహర్షులవారు బెస్తకన్యకు జన్మించినవారే!! అంత దాకా ఎందుకు ప్రతి పురాణము సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వచ్చినవే!! ఒక దాసికి పుట్టిన విదురుడు చెప్పిన నీతి పరమప్రమాణికం బ్రాహ్మణులకు!! రాక్షస గురువైన శుక్రుడు వచించిన నీతి బ్రాహ్మణులకు అనుసరణీయములే!!
బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ పుణ్య పురుషులే అని చెప్పటం లేదు. అన్ని అనర్థాలకు మూలం కేవలం బ్రాహ్మణులే అన్న అపోహను వీడమని చెప్పటమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

- ఆయి కమలమ్మ