సబ్ ఫీచర్

వ్యవ‘సాయం’ తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 12 శాతానికి తగ్గింది. అయితే, మన శ్రామికశక్తిలో 55 శాతం ఈ రంగంపైనే ఆధారపడి వుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్ని మన పాలకులు అనాదిగా పటిష్టపరచలేకపోతున్నారు. దేశంలో ఇపుడు నాలుగు కోట్ల టన్నుల మేరకు ఆహార ధాన్యాల నిల్వలు వున్నాయి. కరవుకు భయపడే పరిస్థితి లేదు. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరవును పూర్తిగా నివారించలేకపోయాం. దీనికి ముఖ్యకారణం మన సాగుభూమిలో 40 శాతానికే నీటి పారుదల వసతులు ఉండడం. ఉత్పాదకత తక్కువ స్థాయిలో వుండటానికి కూడా ఇది ఒక కారణం. ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేరకు పెరగడం లేదు. 2014-15లో ఇది 25.2 కోట్ల టన్నులు. 2015-16లో కూడా దాదాపు అదే స్థాయిలో వుంది. తృణధాన్యాలు, పప్పు్ధన్యాల విషయంలో అనుకున్నంత ప్రగతి లేదు. ప్రభుత్వం మాత్రం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు గొప్పగా చెబుతోంది. దేశవ్యాప్తంగా సాగుభూమి విస్తీర్ణం 14.20 కోట్ల హెక్టార్లు. 11వ ప్రణాళిక (2007-12)లో వ్యవసాయాభివృద్ధి రేటు 4.1 శాతం. ఆ తర్వాత ఇది 1 నుండి 2 శాతానికి తగ్గింది.
ప్రస్తుతం మన వ్యవసాయ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నది. వ్యవసాయం లాభసాటిగా లేనందున కొందరు ఇతర వృత్తులను, పనులను కోరుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కొన్ని నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా తగ్గి రైతులకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి. ఉదాహరణకు.. ఉల్లిపాయలు, టమాటాలు. ఆహార ధాన్యాల ఉత్పాదకత ఆశించిన స్థాయిలో లేదు. ఈజిప్ట్‌లో వరి దిగుబడి మన దిగుబడి కంటే మూడురెట్లు ఎక్కువ. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం. 75 శాతం మంది రైతులకు పంటల విషయంలో ఎలాంటి మద్దతు ధర లభించడం లేదు. 2012-13లో వ్యవసాయ కుటుంబాలలో 52 శాతం అప్పుల ఊబిలో వున్నాయి. పంటలకు చేసే ఖర్చులను తగ్గించుకోవలసిన అవసరం వుంది. ప్రకృతి వ్యవసాయం ఇందుకు ఉపయోగపడుతుంది. జలవనరుల, ఎరువుల వాడకం అధిక స్థాయిలో ఉంటున్నా పంట దిగుబడులు అంతంత మాత్రమే. వనరుల వినియోగంలో శాస్ర్తియత లోపించడమే ఇందుకు కారణం. ఉత్పత్తయ్యే వాటిలో సుమారు 8 శాతం ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఈ రకమైన వృథాను అరికట్టాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా సాగు భూముల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోంది. వ్యవసాయేతర అవసరాలకు సాగుభూమిని వాడుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే 2002-2014 మధ్యకాలంలో దాదాపు 7.2 లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు వినియోగించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరచడానికి స్వామినాథన్ కమిషన్ గతంలోనే కొన్ని సూచనలు చేసింది. వ్యవసాయ భూమిని ఇతర కార్యక్రమాలకు వాడరాదు, గిరిజనులకు, పశువుల కాపరులకు భూమి, సాగునీటి వనరులు అందుబాటులో వుండాలి. వ్యవసాయ భూముల అమ్మకాలపై నిరంతర నియంత్రణ, పర్యవేక్షణ వుండాలి.
వ్యవసాయ రంగంలో దళారుల దోపిడీని పూర్తిగా తొలగించాలి. ‘ఆన్‌లైన్ మార్కెట్’ ఇందుకు తోడ్పడగలదు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకొనే అవకాశం వుండాలి. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపులపై నియంత్రణలు వుండరాదు. బ్యాంకు రుణాలు పేద రైతులకు అందుబాటులో వుండాలి. పంట నష్టం ఆధారంగా పంట బీమా పథకం అమలుచేయాలి. కొన్ని సమయాలలో పొలం పనులకు కూలీలు కూడా దొరకటం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొన్ని వ్యవసాయ పనులు చేపట్టాలి. కేవలం రుణ మాఫీతో రైతులను ఆదుకోలేము. రైతు కనీస ఆదాయానికి భద్రత కల్పించాలి.

-ఇమ్మానేని సత్యసుందరం