సబ్ ఫీచర్

ఫిల్లలకు దూరవౌతున్న బాల సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయ్‌ఁ... ఆ తెలుగు పుస్తకాలు నీకెందుకు? ...అంటూ బాల సాహిత్యాన్ని పెద్దలు లాగేసుకుంటున్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. అసలే పెద్దల పోరు, తెలుగు పట్ల పిల్లల అయిష్టం ‘బాల సాహిత్యా’న్ని పిల్లలకి దూరం చేసేస్తోంది.
‘ఏయ్! అది బాల సాహిత్యం కాదు! మా సాహిత్యం?’అంటూ ఉన్నవాటినీ పెద్దలు లాగేసుకుంటే పిల్లలకు మిగిలే సాహిత్యమేది?
పెద్దలే ఆలోచించాలి!
‘మిత్రలాభము, మిత్ర భేదము, సంధి, విగ్రహము’లాంటి విష్ణుశర్మ గ్రంథాల్ని తెలుగులోకి అనువదించాడు పరవస్తు చిన్నయ్యసూరి. ఇది చాలా గొప్ప విషయం!
మిత్ర లాభము, మిత్రభేదాలలో చిన్న పిల్లలకి చక్కటి నీతుల్ని జెప్పే చినచిన్న కథలెన్నో ఉన్నాయ్! పిల్లలకి జంతువులంటే చాలా ఇష్టం. అందుకని రకరకాల జంతువుల్ని, పక్షుల్ని పాత్రలుగా చేసుకుని చెప్పిన కథలవి. అందుకే పిల్లల్ని బాగా ఆకర్షించాయి. కానీ పెద్దలు పిల్లలకంత పెద్ద ఆస్తి లభిస్తే లాక్కోకుండా ఊరుకోగలరా? అనువాదకుడూ పెద్దమనిషేకదా? అందుకని ఆయనేం చేశాడంటే తన ప్రతిభను చూపించుకోవడానికి ప్రాచీన కాలంలో కావ్యాలలో కూడా వచన రచనలు మాట్లాడే భాషలో ఉండేవి. కానీ ఆయన తన పాండిత్యంతో వచనాన్ని గ్రాంధిక భాషలోకి మార్చారు, అనువదించేప్పుడు. ఆయన పుణ్యమాని ఆ తర్వాత కొన్ని దశాబ్దాలు వచనం కూడా గ్రాంధిక భాషలోనే రాసాగింది.
‘అనవుండిట్లనియె.... నావుడు ప్రాప్తకాలజ్ఞుండు...’ ఇవి ఆ గ్రంథాలలోని వచనానికి చిరు ఉదాహరణలు.
భాష అర్థంకానిది, నోరు తిరగనిది కావడంతో పిల్లలెలా చదవగలరు? అందుకే వీటిని పాఠాలుగా బలవంతాన పిల్లల్ని చదవమన్నా పిల్లలు పారిపోవడం ప్రారంభించారు, అవి పాఠాలా? బాల సాహిత్యమా? అనే విషయాన్ని పక్కనబెడితే..
ఇలా అక్షరబద్ధమైన బాల సాహిత్యం పెద్దలపాలై తెలుగు పిల్లలకు దూరమవడం ప్రారంభించింది. విక్రమార్క కథలు, భేతాళ కథలు, భోజరాజు కథల లాంటివి కూడా ఇలాగే క్రమంగా పిల్లల పక్షం కాదని పెద్దల పక్షం చేరాయి. పిల్ల అద్భుత, సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే, రాజుల సాహస కథలు, క్షణాల్లో రూపాల్నిమార్చి దుర్మార్గుల్ని చితగ్గొట్టే రాజుల కథలు పిల్లలకిష్టం కానీ, పెద్దలు మాకూ ఇవే ఇష్టమని బలవంతాన లాగేసుకున్నారు. ద్వాత్రింశత్సాలభంజికల కథల్ని పిల్లలకోసమే రాశారు. ‘గద్య చింతామణి’ని చూస్తే పలువురు పండితులు వెనుకటి కాలంలో పిల్లలకోసం గ్రంథాలు రాశారని అర్థమవుతుంది. వాటి సంగతేమిటి? ఇలాంటి సంప్రదాయంవల్ల పిల్లలకి, బాల సాహిత్యానికి ఎంతో నష్టం జరిగింది.
ఈ విషయాన్ని పక్కనబడితే మరో విషయం- ఎన్నో పెద్దల పుస్తకాల్నీ పిల్లలకి తగ్గట్టు మార్చి, రాయవచ్చు! పిల్లల అనుభవాలకు సరిపోయే వాటిని తీసుకుని క్లుప్తీకరించి, పిల్లలకర్థమయ్యే భాషలో, బొమ్మలతో వేసుకు వచ్చిన ‘బాల సాహిత్యం’గా మార్చవచ్చు. బాలబొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం, ‘బాలల బొమ్మల గురజాడ, వీరభక్త హనుమాన్’లాంటి ఉదాహరణల నెన్నింటినో చెప్పవచ్చు. ఇలా మార్చగలిగే కావ్యాలన్నీ అద్భుత కథలే! చిన్నప్పటి ఈ పునాదితో పెద్దయ్యాక ఆ కావ్యాల్ని చక్కగా అర్థం చేసుకోగలరు.
మనుచరిత్ర, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నలాంటి గ్రంథాలలో గంధర్వులొస్తారు. పర్వతాలూ, నదులు, పక్షులు, జంతువులన్నీ మనుషుల్లా మాట్లాడతాయి. మనుషులలా ప్రవర్తిస్తాయి. మనుషులు జంతువులవుతారు. దేవతలు మనుషులవుతారు. ఇవన్నీ అద్భుత లక్షణాలేగా పురాణ కథల్లోకూడా ఎక్కువ అద్భుతాలే!
‘‘చిన్నపిల్లల మనస్సుని ఆకర్షించే ప్రధాన రసం- అద్భుతం. వీర కరుణ, హాస్య రసాల్ని కూడా పిల్లలను ఆకర్షిస్తాయి. శృంగార, భయానక బీభత్స రసాలు పిల్లలకి పనికిరావు’’అంటారు చింతా దీక్షితులు.
పిల్లలకి తెలుగు పుస్తకాలు ఎన్నో విషయాలు చెబుతాయి. ఎలా మాట్లాడాలో చెబుతాయ్. ఎలా మాట్లాడకూడదో చెబుతాయ్. ఎలా ప్రవర్తించకూడదో నేర్పుతాయ్. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేట్టు చేస్తాయ్. భాషని నేర్పుతాయ్. సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుతాయ్. అందుకని ‘ఆయ్‌ఁ... ఆ తెలుగు పుస్తకాలు నీకెందుకూ?’ అనకండేం.

- డా.వేదగిరి రాంబాబు సెల్: 9391343916