సబ్ ఫీచర్

వనరుల పరిరక్షణ సమష్టి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి తన కనీస అవసరాలు తీర్చుకోవడంలో విజయం సాధించాడే కాని కుటుంబ, సామాజిక, దేశ సంబంధ సమస్యలు అతడిని వేధిస్తూనే ఉన్నాయి. మానవ సమాజం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లలో పర్యావరణ సమస్య ప్రధానమైనది. ఆధునిక యుగంలో పలురకాల వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎక్కువ వనరులను వినిమయం చేయడం పరిపాటిగా మారింది. వస్తు ఉత్పత్తితోపాటు కాలుష్యం కూడా అంతేస్థాయిలో పెరుగుతోంది. ‘నేడు ప్రపంచం సమస్య టెర్రరిజం కాదు.. కాలుష్యం’ అని ఏనాడో అన్నారు ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య తన ‘అమృతం గమయ’ నవలలో.
గత రెండు, మూడు శతాబ్దాల కాలంలో పాశ్చాత్యుల ఆలోచనా విధానం మన సంస్కృతి, నాగరికతలను బాగా ప్రభావితం చేసింది. ‘వ్యక్తి వేరు- ప్రకృతి వేరు’ అన్న వారి ఆలోచన ప్రకృతి పట్ల మనలోని తాదాత్మ్యభావనను దూరం చేసింది. మనిషి తన కోరికలన్నింటినీ- అవి ఎలాంటివైనాసరే వాటిని తీర్చుకోవడమే వివేకానికి నిదర్శనంగా ఆధునిక అర్థశాస్త్రం చెప్తోంది. ఇది మనిషిలోని వినియోగ ప్రవృత్తికి ఆలంబనగా నిలిచింది. తన కోరికలను తీర్చుకోడానికై అవసరానికి మించి వస్తువులను ఉత్పత్తి చేయడానికి మనిషి ప్రకృతి వనరులను అడ్డూ అదుపూ లేకుండా కొల్లగొడుతున్నాడు. ఇది పర్యావరణ కాలుష్యానికి కారణవౌతోంది. ఫలితంగా భూమి వేడెక్కుతోంది. కాలుష్యం వల్ల భూసారం క్షయమవడం, అడవులు క్షీణించడం, వందలాదిగా జంతు, వృక్షజాతులు నశించిపోవడంతో పర్యావరణం హానికరంగా మారుతోంది. అభివృద్ధి పేరుతో మానవుడు సాగించిన ఈ ప్రయాణం అతడిని పతనపుటంచులలో నిలబెట్టింది.
తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించాలనే తాపత్రయంలో ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నాడు మనిషి. ఫలితంగా అతడు సాధించిన ప్రగతికి అర్థం లేకుండాపోతోంది. నేడు ప్రపంచంలో మానవుని మనుగడను ప్రశ్నిస్తున్న ప్రధాన సమస్యలలో పర్యావరణ కాలుష్యం ఒకటి. ‘మానవుడు ముందుచూపుకోల్పోయాడు. భూమిని నాశనం చేస్తున్నాడు’ అంటారు ఆల్బర్ట్ స్క్విట్జర్. మన ఈ వినాశకర ధోరణికి కారణం పాశ్చాత్యుల దృక్పథం. దీంతో ఎన్నో అనర్థాలు జరిగాయి. ప్రకృతిపరంగా ఎంతో నష్టపోయాం.
మరోపక్క భారతీయ తాత్త్విక చింతన వలన సకల మానవాళికీ మేలు కలుగుతుందని స్పష్టమైంది. భారతీయ తాత్త్విక చింతన సుఖం పొందడాన్ని, అనుభవించడాన్ని వ్యతిరేకించదు. ఇంద్రియాల ద్వారా లభించే సుఖ సంతోషాలు అశాశ్వతమని చెప్తుంది. శాశ్వత ఆనందానికై ప్రయత్నించమని చెప్తుంది. శాశ్వత ఆనందం ఇంద్రియాలకు అతీతమైనది. ఇందులో భౌతిక వాంఛలకై పరుగులు తీయడం ఉండదు. కాబట్టి ప్రకృతి వనరుల శోషణ కూడా ఉండదు. ఇంద్రియాల ద్వారా మనస్సు భౌతికమైన ఆనందం కోసం నిరంతరం అనే్వషిస్తుంటుంది. ఆనందం లభించగానే తాత్కాలికంగా మనస్సు ప్రశాంతవౌతుంది. కాని వెంటనే కొత్త ఆనందానికై అనే్వషణ ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియకి అంతం లేదు. మనిషికి తన చుట్టూ ఎన్ని సౌకర్యాలు ఉన్నా సంతృప్తి మాత్రం కలుగదు. భౌతిక సుఖాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నప్పటికీ మనిషిలోని ఆశ, అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు.
కాబట్టి జీవితం పట్ల మనిషి ఆలోచనల్లోనే మార్పు రావాలి. కోరికల విషయంలో మనిషి తన మనస్సును అదుపుచేసుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. అప్పుడు మానవ జీవితంలో వస్తు వినిమయం, ప్రకృతి వనరుల శోషణ తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది.
మనస్సును నియంత్రించడం, వస్తు వినిమయాన్ని అదుపుచేయడం కష్టతరమైన విషయమే. కానీ మానవాళి దీర్ఘకాలిక శ్రేయస్సుకు అదే ఏకైక మార్గం. పాశ్చాత్యుల ఆలోచన యాంత్రికతను, భౌతిక వాదాన్ని, భోగ లాలసతను ప్రోత్సహించింది. భారతీయ తాత్త్విక చింతన జీవితం పట్ల సమగ్ర దృష్టితో కూడిన త్యాగ భావనని ఒక ఆచరణాత్మక ఆదర్శంగా ప్రపంచం ముందుంచింది. భారతీయుల తాత్త్విక చింతన ప్రపంచం యొక్క శాంతియుత ప్రగతికి నమూనాను అందిస్తుంది. భౌతిక స్థాయిలో ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం ఎలాగో నిర్దేశిస్తుంది. మన ఋషులు తమ సుదీర్ఘ తపస్సుచే తెలుసుకుని మనముందుంచిన మహోన్నత జీవన విధానాన్ని మనం అవగతం చేసుకోవాలి. ప్రకృతికి, మనకుగల సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. కొల్లగొట్టబడేదిగాగాక మనల్ని పోషించే తల్లిగా ప్రకృతిని అర్థం చేసుకోవాలి.
‘వసుధైక కుటుంబం’ అంటే ఈ భూమండలమే ఒక కుటుంబం అని మన వేదాలు ఘోషించాయి. ఇది అవగతమైతే ప్రకృతి వనరులు ఏ ఒక్కరి కోసమో కాదని, భూమిపైగల సమస్త ప్రాణికోటి అవసరాలను తీర్చడం కోసమని గ్రహిస్తాం. సమస్త ప్రాణికోటి యొక్క శాశ్వత మనుగడకై ప్రకృతి వనరులను సంరక్షించాలన్న బాధ్యతను గుర్తిస్తాం. అప్పుడు మనలో భోగభావన కాకుండా త్యాగభావన నెలకొంటుంది. ఈ త్యాగభావనయే సకల మానవాళికీ, ప్రాణికోటికీ శ్రీరామరక్ష!
అభయం యావా పృథివీ ఇహాతున్నోభయం సోమఃసవితా నతుమోతు!
అభయం నోత్తర్యంతరిక్ష సప్త ఋషీణాం చ ఆవిషాభయం నో ఆస్తు॥
(పృథివీ సూక్తం)

- డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690