సబ్ ఫీచర్

నాయకుల స్వార్థంతో ఏపీ విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సభ్య సమాజంలో స్వేచ్ఛ తక్కువుంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక నియంత్రణ వుంటుంది. కనుక ఎవరిష్టం వచ్చిన విధంగా వారు చేయడానికి వీలుండదు. బలవంతుడు, ధనవంతుడూ బలహీనుడ్ని పీడించడాన్ని సమాజం లేదా ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుంటుంది. అందువలన సభ్య సమాజంలో రక్షణ ఎక్కువుంటుంది.
ఆటవిక సమాజంలో స్వేచ్ఛ ఎక్కువుంటుంది. అక్కడ సామాజిక నియంత్రణ కాని, ప్రభుత్వ నియంత్రణకాని వుండవు. ఎవరిష్టం వచ్చిన విధంగా వారు చేయడానికి స్వేచ్ఛ వుంటుంది. కాని అక్కడ రక్షణ తక్కువగా వుంటుంది. ఎందుకంటే బలవంతుడు బలహీనుడ్ని పీడించినా అడ్డుకునే యంత్రాంగమేమీ వుండదు.
ఇపుడు దేశంలోని రాజకీయ పరిస్థితులు సభ్యసమాజంనుండి ఆటవిక సమాజం వైపు తిరోగమిస్తున్నాయనిపిస్తున్నది! రాను రానూ ఈ పరిస్థితులు క్షీణించి నియంత్రణను బలహీనపరుస్తున్నాయి. ఇవి ప్రజాక్షేమానికి విఘాతం కలిగించే అవాంఛిత పోకడలు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఎంత అనాగరికంగా జరిగిందో దేశ ప్రజలందరికీ తెలుసు.
అయిదున్నర కోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రతినిధులను (ఎం.పి.)లను, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న కారణంగా, పార్లమెంటు సభలోనే ఇతర ప్రాంత ఎం.పి.ల చేత పిడిగుద్దులు గుద్దించారు. పార్లమెంటు తలుపులు మూసేసారు. టీ.వి. ప్రసారాలు ఆపుచేసారు. ఓటింగు జరపకుండానే, రాష్ట్ర విభజన బిల్లు పాసయిందని ప్రకటించారు. అలా జరిపిన సమావేశాలను పార్లమెంటు సమావేశాలనే అంటారా? (ఇలా జరిగిందని, ఇటీవల ప్రధాని మోదీ కూడా పార్లమెంటులో ప్రస్తావించి ధ్రువీకరించారు) ఇలాగ అనాగరికంగా జరిగిన సమావేశాలను కూడా ‘పార్లమెంటు’ అంటారని ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు భావించారా? తమ తరువాతి తరాల్లోని రాజకీయ నాయకులు, పార్టీలూ ఇలా అప్రజాస్వామికంగా దిగజారిపోతారని ఆనాటి రాజ్యాంగ రచయితలు అపుడే ఊహించి వుంటే, ఇటువంటివి జరగకుండా నియంత్రించడానికి కొన్ని అదనపు రక్షణలను రాజ్యాంగంలోనే పొందుపరచి వుండేవారు. ఆర్టికల్ 3, 4లు ఇప్పుడున్న విధంగాకాకుండా, మరికొన్ని నియంత్రణలతో వ్రాసి వుండేవారు. స్వతంత్ర భారతదేశంలో తరువాత తరాల్లోని నాయకులు కూడా తమలాగే నీతిబద్ధమైన వారవుతారని వారపుడు భావించారు! అసలు ఆర్టికల్ 3, 4ల ప్రధాన ప్రయోజనమే వేరు. బ్రిటిష్ పాలనలో ఇప్పటిలాకాకుండా, దేశమంతా 11 పెద్ద ప్రెసిడెన్సీలు లేదా ప్రావిన్సులుగా (రాష్ట్రాలు)గా వుండేవి. పరిపాలనా సౌలభ్యంకోసం వాటిని చిన్న రాష్ట్రాలుగా విభజించే చట్టబద్ధతకోసమీ ఆర్టికల్స్‌ను ముఖ్యంగా పొందుపరిచారు. ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి గాని, కలపడానికి గాని, ఈ ఆర్టికల్స్ ప్రకారం ఒక బలమైన ‘ప్రాతిపదిక’ వుండాలి.!
ఈ విధంగా రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్‌ను ఉపయోగించి ‘్భషా ప్రాతిపదికగా’ భాషాప్రయుక్త రాష్ట్రాలుగా 1956లో, అంతకుముందున్న 11 ‘వర్జిన్ రాష్ట్రాల’ నూ విభజించారు. బ్రిటీష్ కాలంలోని ఆ పెద్ద ప్రెసిడెన్సీలను ‘వర్జిన్ స్టేట్సు’ అనేవారు. అటువంటి ‘్భష ప్రాతిపదికతోనే’ ఆంధ్ర ప్రాంతంలోని తెలుగు భాషా ప్రాంతాన్ని, హైదరాబాదు స్టేట్‌లోను తెలుగు భాషా ప్రాంతాన్నీ ఒక రాష్ట్రంగా - ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచారు.
ఒకసారి ఆర్టికల్స్ 3, 4లను ఉపయోగించి ఏర్పరచిన రాష్ట్రాన్ని అవే ఆర్టికల్స్‌నుపయోగించి, మళ్ళీ విడగొట్టడం రాజ్యాంగబద్ధమా అనేది ఎవరూ మాట్లాడలేదు. అంతేకాకుండా, ఒక రాష్ట్రంగా కలిపినపుడు ఏ ప్రాతిపదికను వినియోగించారో అదే ప్రాతిపదికకు విరుద్ధంగా మళ్ళీ విడగొట్టడం రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్‌కు అనుగుణమైన చర్యేనా అనేదే ఎవరూ మాట్లాడలేదు. ఈ విషయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన సుప్రీంకోర్టూ, రాష్టప్రతి కూడా వౌనంగా వుండిపోయారు. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, రాష్టప్రతి వంటి రాజ్యాంగ వ్యవస్థనే అటువంటి సమయంలో అయిదున్నర కోట్ల ఆంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించలేకపోతే ప్రజలకు దిక్కెవరు?
ఇంత అప్రజాస్వామికంగా, ప్రజావ్యతిరేకంగా జరిగిన ఈ విభజనకు ముఖ్య కారకులు ఆనాడు అధికారంలో వున్న కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం, ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా వున్న బి.జె.పి.యే అని అందరికీ తెలుసు. అంతేకాకుండా ఆనాటి ఆంధ్రప్రాంతంలో వున్న అన్ని రాజకీయ పక్షాల నాయకులు కూడా కొంతవరకు బాధ్యులే! వీరుకూడా ఎవరి ప్రయోజనాల్నివారు చూసుకున్నారే తప్ప, ప్రజలు సంఘటితమై ఉద్యమించినా కూడా, ఆ బలాన్ని వినియోగించుకుని కేంద్రాన్ని ప్రతిఘటించలేదు. అందుకు వారి స్వార్థప్రయోజనాలడ్డువచ్చాయి. చివరకు రాష్ట్రం విడిపోయింది. మా రాజధాని అనుకున్న నగరం నుండి, రాజధాని నగరం అనేది లేకుండా, ఆంధ్రులు బైటకువెళ్ళవలసి వచ్చింది. సుమారు 60 సం.లు ఇరుప్రాంతాలవారూ కష్టపడి, పెట్టుబడులుపెట్టి అభివృద్ధిచేసుకున్న రాజధానిని ఒక ప్రాంతంవారికే ఇచ్చారు. ఏ రాష్ట్రానికైనా అత్యధికమైన ఆదాయం రాజధాని నగరంనుండే వస్తుంది. ఉభయ ప్రాంతాలవారికీ కలిపి రాజధాని మీద వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఆవలి ప్రాంతంవారికే ఇచ్చేసారు. కనీసం కొనే్నళ్ళపాటైనా, తెలంగాణా, ఆంధ్ర ప్రభుత్వాలకు ఏదో ఒక నిష్పత్తిలో పంచి ఇవ్వాలనే కనీస న్యాయం కూడా, రాష్ట్ర విభజన చేసిన రెండు జాతీయ పార్టీల నాయకులకూ కలగలేదు. ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోడానికే రాజధాని నగరం కాని, దానిమీద వచ్చే ఆదాయంకాని లేక ఆంధ్ర ప్రాంతం నిరాశ్రయంగా మిగిలిపోయింది.
అంత అప్రజాస్వామికంగా చేయబడిన విభజన చట్టంతో ఆంధ్రకు కొన్ని అరకొర హామీలను అపుడు ఇచ్చారు. కాంగ్రెసు పార్టీకి తరువాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రలోనే కాక, దేశవ్యాప్తంగా ఓటమి జరిగింది. అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన బి.జె.పి. అధికారంలోకొచ్చింది. విభజన చట్టంలోని హామీలను కొత్తగా ఏర్పడిన బి.జె.పి ప్రభుత్వం వెంటనే నెరవేర్చవలసి వుంది. అంతేకాక, అప్పుడు జరిగిన అడ్డగోలు విభజనకు కాంగ్రెసుతోపాటు బి.జె.పి.ది సమాన బాధ్యత. కానీ, కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం మొదటినుండీ ఈ అయిదేళ్ళలోనూ మొండివైఖరిని అవలంబిస్తూనేవుంది. అరకొరగానే నిధులను విడుదల చేస్తున్నారు. నెరవేర్చవలసిన హామీలను ఎగ్గొట్టడానికి 14వ ఆర్థిక సంఘం, నీతీ ఆయోగ్, ఇతర రాష్ట్రాల వ్యతిరేకత అనే అసత్యసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇటీవలి చివరి బడ్జెట్టులో ఆంధ్రకు ఇవ్వవలసిందేమీలేదని తేల్చిచెప్పేసారు. అంతేకాదు, ఆర్థికమంత్రి ఆంధ్రులను యాచకుల్లాగ మాట్లాడారు. అయిదున్నర కోట్లమంది ఆంధ్రులను అవమానించారు.
కేంద్ర ప్రభుత్వం చేత తిరస్కరింపబడి, అవమానింపబడిన అత్యవసర పరిస్థితుల్లోనైనా ఆంధ్రలో రాజకీయ పార్టీలు తమ విభేదాలను తాత్కాలికంగానైనా విడిచిపెట్టి ఏకమై కేంద్రంమీద పోరాటం చేయడంలేదు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా ఏ పార్టీకివారే వేరుగా ఇచ్చారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని చర్చకుకూడా రాకుండా అడ్డుకుంది. తమ చెప్పుచేతల్లోవున్న అన్నాడిఎంకె ఎంపీల చేత సభలో రభస చేయిస్తూ వచ్చింది. తీర్మానం ఇచ్చినవారిలో 50 మంది ఎంపీలను లెక్కపెట్టలేకపోతున్నానని లోక్‌సభ స్పీకర్ 20రోజులపాటు ప్రతిరోజు వాయిదావేస్తూ, ఆఖరున సభను నిరవధికంగా వాయిదావేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత హాస్యాస్పదమైన విషయం. సభలో బి.జె.పి. ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ వున్నందున, అవిశ్వాస తీర్మానం ఓటింగుకు పెట్టినా కూడా వారి ప్రభుత్వం పడిపోదు. అది తెలిసికూడా మొండిగా ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కారు.
ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఉద్యమాన్ని ఉధృతం చేసాయి. కాని అందరూ కలవడం లేదు. ఎవరి అజెండా వారిదే, ఎవరి పద్ధతి వారిదే! కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించడం మానివేసి, ఆంధ్రలోని ఈ పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అధికారంకోసమో, మరోటో ఎవరి స్వార్థప్రయోజనాలకోసం వారు ఉద్యమం పేరుతో చేస్తున్నారు తప్ప, కేంద్రాన్ని వంచి రాష్ట్రానికి రావలసిన వాటిని పొందడానికి కాదనే విధంగా వీరి వైఖరి వుంది. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ నాయకుల స్వార్థాలతో రాష్ట్రం విలవిలలాడుతోంది! రాష్ట్ర ప్రజలు దిక్కుతోచకుండా వౌనంగా వుండిపోయారు!

- మనె్న సత్యనారాయణ