సబ్ ఫీచర్

రంగు వెలసిన మార్క్సిజంపై ఎందుకంత ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం చెల్లిన మార్క్స్ సిద్ధాంతాన్ని అత్యున్నత శిఖరంపై చూడాలనుకునే రచయిత్రి రంగనాయకమ్మ స్వాప్నికురాలు, అమాయకురాలు.. మార్క్సిజం ‘బలిపీఠం’ ఎక్కడం ఏ మాత్రం సహించని సంప్రదాయ మార్క్సిస్టు ఆమె. సాంకేతిక పరిజ్ఞానం శ్రామికుల ముంగిళ్లలో నర్తనమాడుతున్నా ఆమె పాతకాలపు సమీకరణలనే వల్లెవేస్తున్నారు. మార్క్సిజంపై ఈగ వాలనీయకుండా ఆమె ఇటీవల చేస్తున్న రచనలు చూస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది. ఆచంద్రతారార్కం మార్క్సిజం కొనసాగాలని ఆశించే ‘అల్పజీవి’ ఆమె. విషవృక్షాన్ని కోసిన రంపానికి ‘విషం’ ఏ మాత్రం అంటుకోరాదని భావించే మార్క్సిస్టు మహిళ రంగనాయకమ్మ.
ఉటోపియన్ సిద్ధాంతం...
మార్క్సిజం ఒక ఉటోపియన్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారు, ఇది కలకాలం కొనసాగాలనుకునేవారు కరడుగట్టిన ఉటోపియన్ల కింద లెక్క. అంటే, ఊహాలోకంలో విహరించేవారన్నమాట! కల్పనకు, వాస్తవికతకు మధ్య సరిహద్దులు విస్మరించడం సమంజసం కాదు. కల్పన.. ఊహ.. ఉపమాలంకారాలు సాహిత్యానికి వనె్నతెస్తాయి. వాటిని జీవితాలకు అన్వయిస్తామని చెప్పడం అంతగా నప్పని అంశం. రంగుల కలల్ని రంగరించి జీవితంలోకి ఒంపుతామని ఉద్రేకపడటం అసహజంగా ఉంటుంది. మార్క్సిజం ఆ కోవకు చెందినదే? మనిషిలోని అరిషడ్వర్గాలు, ఆలోచనలు, రసాయనిక చర్యలు, స్పందనలు ఒకే మూస ధోరణిలో కొనసాగుతాయని విశ్వసించడం, ‘రెండు వర్గాల’కు వాటిని వేర్వేరుగా అంటగట్టడం అమాయకత్వమే. ఈ సూక్ష్మ విషయాన్ని పట్టుకోకుండా, మార్క్స్ ప్రతిపాదనల ప్రాసంగికతను గమనించకుండా శ్రామిక ప్రజలకు ఆ సిద్ధాంతం సంజీవని అని, సమస్త సమస్యలకు పరిష్కార మార్గమని భ్రమలు కల్పించే ప్రయత్నం ఏ విధంగా మెప్పు పొందుతుంది?
వేల సంవత్సరాల క్రితం బౌద్ధం పెద్ద ఉప్పెన తీసుకొచ్చింది. అది ఉత్థాన పతనాలను చవిచూసింది. అంత గాఢంగా సుదీర్ఘకాలం ఉన్న ఆ సిద్ధాంతం తెరమరుగైన విషయం తెలిశాక, అలాంటి ఎన్నో ఆలోచనలు ఆవిరైపోయాక.. మార్క్సిజం చిరస్థాయిగా వర్థిల్లుతుందని, వర్థిల్లాలని ప్రచార హోరు సృష్టించడం, మొండి వాదించడం అది వితండవాదమే! మార్క్సిజం తనకు తానే స్వయం ప్రకాశంగా వెలుగొందదు. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేవారు మానవమాత్రులు, అనేక బలహీనతలతో కాలం వెళ్ళదీసే ‘కామ్రేడ్లు’. వారి వల్లే మార్క్సిజం భ్రష్టుపడుతోందని వాపోవడంలోనూ అర్థం లేదు. పాపం వారిని నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు.. నోరెళ్లబెట్టడం తప్ప!
కామ్రేడ్లు ‘విష సంస్కృతి’ని వదిలించుకోలేరా? అని గద్దిస్తే ఏమిటి ప్రయోజనం? పుటకతో వచ్చింది పుడకలతో గాని పోదనే సమాధానం వారి తరఫున వినిపిస్తుంది. మానవ స్వభావాన్ని తారుమారుచేస్తామని, బూర్జువా వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి నూతన సమాజం, శ్రామిక శ్రేయోరాజ్యం, దోపిడీలేని వ్యవస్థను రూపొందిస్తామని ఉద్రేకపడటానే్న ఉటోపియన్ ఆలోచనా విధానమంటారు. మార్క్స్ కన్నా ముందే ఇంతే మోతాదులో ఆదర్శ సమాజం కోసం ఉటోపియన్లు ఎనె్నన్నో ఆదర్శ సూత్రాలు క్రోడీకరించి, చార్టర్‌ను సిద్ధం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఆ ‘యోధులే’ అరిషడ్వర్గాలకు తలొగ్గి అనేక బలహీనతలకు బానిసలై అనంతరం ప్రధాన స్రవంతిలో పడిపోయారు. ఉటోపియన్ల అనుభవం, చరిత్ర తెలిసినప్పటికీ, సమాజ పరిణామక్రమం గూర్చిన అవగాహన ఉన్నప్పటికీ ఫ్రాయిడ్ సిద్ధాంతం గుర్తెరిగినప్పటికీ, విఫలమైన సిద్ధాంతానికే పెద్దపీట వేయాలని ఆరాటపడటంలో అర్థం లేదు. ఇదొక బలహీనతగానే పరిగణింపబడుతుంది తప్ప దార్శనికత అనిపించుకోదు!
రష్యా విప్లవ స్మరణ...
రష్యా విప్లవ విజయాన్ని కొన్ని మాసాల క్రితం గట్టిగా స్మరించుకున్నపుడు శతాబ్ది ఉత్సవాల్లో దొర్లిన యాంత్రిక ప్రకటనలు, సభలు- సమావేశలపై కూడా రంగనాయకమ్మ విరుచుకుపడ్డారు. కాని అది ‘కాలం’ తీసుకొచ్చిన మార్పుగా ఆమె గమనించలేదు. వందేళ్ల సమయం స్వల్పమైనదేం కాదు. ఈ వ్యవధిలో నాలుగు పారిశ్రామిక విప్లవాలు వెల్లువెత్తాయి. అవి తమ ప్రభావాన్ని బలంగా సమాజంపై చూపాయి. దీన్ని పరిగణనలోకి తీసుకోకపోతే ఎలా? మొదటిసారి పారిశ్రామిక విప్లవం వెలుగులో మార్క్సిజం ఉబికి వచ్చింది. ఆ ‘ఇజం’ అంత సాంద్రతతో నాల్గవ పారిశ్రామిక విప్లవం శరవేగంగా ప్రపంచమంతటా పరచుకుంటున్న తరుణంలో జిగేల్ మంటూ అవే వెలుగులను పంచుతుందా? లేదు! ఈ అవగాహన, స్పష్టత ఉన్నట్టయితే రంగనాయకమ్మ ప్రశ్నలకు, శంకలకు సమాధానాలు దొరుకుతాయి. కాని ఆమె అటువైపు దృష్టి సారించకుండా రెండు రెళ్ళనాలుగు అన్నట్టు మార్క్సిజం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు నిక్కచ్చిగా న్యాయం చేసే సిద్ధాంతంగా విశ్వసించడం విడ్డూరం. ఆ విశ్వాసంతో కామ్రేడ్లను గద్దిస్తే ఏమిటి ప్రయోజనం?
శాస్ర్తియం కాని ఇజాన్ని శాస్ర్తియమని అక్షర దాడులు చేస్తే అది శాస్ర్తియమవదు కదా?.. విజ్ఞులు, విశారదులు, అక్షరజ్ఞానం అపారంగా ఉన్నవారు భేషజాలకు పోతే నష్టపోయేది సమకాలీన సమాజమే. ఈ ఎరుక లేకపోతే జరిగేదంతా విధ్వంసమే! మార్క్సిజం పేర ఇప్పటివరకు జరిగిన విధ్వంసం చాలదా? పదికోట్లమంది ప్రజల హననం తర్వాత కూడా హననం కొనసాగాలా?.. ఆగిపోవాలా?
ఉత్పత్తి సాధనాలు మారాయి!
రంగనాయమ్మ ఆధునిక ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞానం, అవి కల్పించిన చైతన్యం, సమాజాన్ని రూపాంతీకరించిన వైనాన్ని పట్టించుకోకుండా పూర్వపు ఉత్పత్తి సాధనాలు, సంబంధాల అవగాహనతోనే వాటి ఆధారంగా వెలువడిన ఆనాటి మార్క్సిజం అజరామరం, సంజీవని అని ఒక ‘భ్రమ’లో గడుపుతూ తన అక్షర తూణీరంలోని అస్తశ్రస్త్రాలను సంధిస్తున్నారు. ఈ వైఖరి, విధానం శ్రామిక వర్గానికి, కార్మిక లోకానికి ఏ మాత్రం ఉపకరించదు. ప్రజలెప్పుడూ గతంలో జీవించరు. వర్తమానంలోనే ఉపాధి దొరుకుతుంది, అందుకనుగుణంగానే విజ్ఞుల, విప్లవకారుల ఆలోచనలుండాలి తప్ప కాలం చెల్లిన సిద్ధాంతాల చుట్టూ తిరగడం కాదు. అలా చేయడం వల్ల కాలయాపన తప్ప మరో లబ్ధి చేకూరదు. కాలాన్ని ‘గేలి’ చేస్తే శ్రామిక వర్గానికి, పేద ప్రజలకు ఒరిగేది శూన్యం. వేల సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, ఈ వంద సంవత్సర్లా చోటుచేసుకుంది. అది భౌతికాభివృద్ధే అయినా దాని ప్రభావం మానవ మస్తిష్కంపై కనిపిస్తోంది. చైతన్యంపై పరావర్తనం చెందుతోంది. జార్ చక్రవర్తి కాలం నాటి కార్మికుడికి, మార్క్స్ జుకర్ బర్క్ ఫేస్‌బుక్ ఆవిష్కరణ తర్వాత కార్మికుడికి గల తేడాను, అతని శ్రమలో కనిపించే మార్పును పసిగట్టకపోతే ఎలా? ఈ పరిణామాన్ని పట్టించుకోకుండా పాత సమీకరణల, సిద్ధాంతాల ఆసరాతోనే ఆలోచిస్తే వర్తమాన కార్మికుడికి ‘న్యాయం‘ ఎలా జరుగుతుంది?
మానవుడి శ్రమపై స్వేదంపై ఆధారపడిన మార్క్సిజం డ్రైవర్ లేని కార్లు, రోబోలు ఇబ్బడిముబ్బడిగా పనిచేస్తున్న వర్తమానంలో అంతే దూకుడుగా ఉపకరించాలనుకోవడం, ఉపకరిస్తుందని దబాయించడం అమానవీయం. మార్క్సిజంపై ఆరాధనా భావంతో, అభిమానంతో వర్తమాన సమీకరణలను, సాంకేతిక విప్లవాన్ని విస్మరించడం అది సరైన వీక్షణం అనిపించుకోదు! అక్టోబర్ విప్లవ ప్రభావం కన్నా కృత్రిమ మేధ, ఐటి విప్లవం కల్పించిన ప్రభావం అపారమైనది. అది ప్రపంచాన్ని ఓ కొత్త కక్ష్యలోకి మార్చిన సంగతి ‘మన’ సౌకర్యార్థం విస్మరిస్తే ఎలా? మనిషికన్నా వేగంగా, హేతుబద్ధంగా, సమర్థవంతంగా ఆలోచించే రోబోలు ఉత్పత్తి రంగంలో, సేవా రంగాల్లో విస్తృతంగా పనిచేస్తూ మెరుగైన సేవలు మానవాళికి అందిస్తున్న తరుణంలో.. అవి అశేష ప్రజల కష్టాలు తీర్చే మార్గం గూర్చి ఆలోచించకుండా ప్రత్యామ్నాయం పేర కాలం చెల్లిన మార్క్సిజం గూర్చి ఇంకా కలలు కనండి! అని ఊదరగొట్టడంలో, నినదించడంలో వాస్తవికత ఇసుమంత కూడా కనిపించదు.
ప్రపంచమంతా ప్రజలే!
21వ శతాబ్దంలో, మనిషి అంగారక గ్రహంపైకి వెళ్తున్న సమయంలో, విశ్వం అంచులను తాకాలని ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో ‘రెండు వర్గాల’ గూర్చి, బూర్జువాల దోపిడీ గూర్చి వగచినంతకాలం బూర్జువాలే కాదు అందరూ నవ్వుకుంటారు. వర్గ కసిని నూరిపోసే ప్రచారం, గోబెల్స్ ప్రచారం చూసి చిత్రంగా చూస్తారు. ప్రజలు.. ప్రజలు మాత్రమే కనిపించే ఈ సమాజాన్ని కృత్రిమకంగా విడదీసి చూసే సిద్ధాంతం వికృతమైంది. ఆ ‘చూపు’ నిరర్థకమైనది. ఆ సిద్ధాంతానికి ఆక్సిజన్ అందించడానికి అహోరాత్రులు శ్రామిక ప్రజలకు ఒరిగేది హళ్ళికి హళ్ళి.. సున్నకు సున్నానే! కాలం అందిస్తున్న అనేక పరిష్కారాలను తిలకించే అంతర్నేత్రం తెరచి ఉంచుకోవాలి. దాన్ని మూసేసి మూస ధోరణిలో ఓ ప్రవాహంలో కొట్టుకపోవడంవల్ల నష్టపోయేది ఈ తరమే కాదు.. వచ్చే తరాలు సైతం నష్టపోతాయి, కష్టపడతాయి. స్పార్టకస్ కాలం నుంచి వర్తమాన సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణ వరకు జరిగిన జరుగుతున్న పరిణామాలన్నీ మానవాభ్యుదయానికే. ఈ మెలకువ లేనంతకాలం, అంతర్నేత్రం తెరవనంతకాలం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడంలానే వుంటుంది. ఈ ఆనాలోచిత వైఖరితో కాలయాపన చేయడమంటే కార్మిక లోకాన్ని వంచించడమే. జ్ఞానం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అద్భుతాలకు కారకం. దాన్ని ఒడిసిపట్టే విధానం అధోఃజగత్ సోదరులకు అందించడంలో రంగనాయకమ్మ అక్షరాలు తోడ్పాటునందిస్తే సంతోషం! అప్పుడే ఆమె అక్షరాలకు సార్థకత ఏర్పడుతుంది.

--వుప్పల నరసింహం 99857 81799