సబ్ ఫీచర్

హితం కోరేదే స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎక్కడైనా లభించేది స్నేహం ఒక్కటే. సాంకేతికత పెరిగిన ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషికి అనేకానేక సమస్యలు, సవాళ్లు అనునిత్యం తప్పడం లేదు. ఒక్కోసారి ఏం చేయాలో తోచదు. కళ్ల ముందు అంధకారం అగుపిస్తుంది. అంతలోనే ఓ ఆత్మీయ పిలుపు ‘నేనున్నానం’టూ చెవులకు వినిపిస్తుంది. ఆ చేతి స్పర్శ భుజంపై మెల్లగా తాకినట్లవ్వగానే- మరింత బాధ, కన్నీళ్లు కట్టలు తెంచుకుంటూ రావడం, ఆ వెంటనే ఒకే ఒక్క ఆలింగనంతో, ప్రేమతో, ఆప్యాయతతో స్నేహితుడు మాట్లాడే ఆ నాలుగు మాటలతో- బాధ సగం తగ్గిపోతుంది. ఆ స్నేహితుడు అందించిన మనోధైర్యం ముందు సమస్య చాలా చిన్నదిగా అయిపోతుంది. ‘నాకు నేనుగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలిగాను.’ అనే తృప్తి కలుగుతుంది. ఇది అరమరికలు లేని స్నేహం వల్లే సాధ్యం.
చిన్ననాటి జ్ఞాపకాలు..
పాఠశాల రోజులలో ‘లంచ్ బెల్’ మోగగానే ఒక ఆనందం.. పరుగెత్తుకుంటూ వెళ్తూ టాప్‌ల దగ్గరకు వెళ్లడం.. మిత్రుడు కింద పడగానే అందరం పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని లేపుతూ, అతని మోకాళ్లకు అంటుకున్న ఇసుకను తీసివేయడం.. అతను ఏడుస్తూ ఉంటే అందరికీ దెబ్బతాకినంతగా బాధపడడం.. ఏం కాదు.. ఇలాంటి దెబ్బలు మాకూ తగిలాయని అతనికి మనోధైర్యం ఇవ్వడం.. ఓదార్చేందుకు వచ్చిన మిత్రుల ఆదరణ, ఆప్యాయతల ముందు ఆ దెబ్బ నొప్పి మాయం కావడం.. ఇవన్నీ మరచిపోలేని మధుర స్మృతులు. ఓ మిత్రుడు పరుగెత్తుకుంటూ వచ్చి గాయమైన చోట కట్టుకడుతూ- ఆ స్నేహితుడు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరువలేనిది. బాల్యంలో ఆనందం కోసం చేసిన అల్లరి, పెనవేసుకున్న అనుబంధం ఇప్పటికీ మరువలేకపోవడమే- స్నేహబంధం.
దిశానిర్దేశం చేసేవాడే..
కాలచక్రంలో జీవితం ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. ‘ఏం చేయాలనుకుంటున్నావురా?’ అని నాన్న రోజూ తిడుతుంటాడు. ‘్భవిష్యత్తు కోసం జీవితంలో సెటిల్ అవ్వాలిరా’ అని అమ్మ మెల్లగా మందలిస్తుంది. బంధువులు, ఆత్మీయులు ‘నెక్స్ట్ ఏం చేస్తావ్?’ అని అడుగుతూ ఉంటారు. ఆ క్షణంలో ఓ చేయి ఆ వ్యక్తిని పట్టుకుని- ‘ఇదీ నీకు సరైన దారి.. పయనించు, కష్టపడు, ఇష్టపడు.. సాధించు లక్ష్యంవైపు పరుగులు తీయ మం’టూ దిశానిర్దేశం చేస్తుంది. అలా చెప్పేవాడే ఆప్తమిత్రుడు.
మానసిక సమస్యలు..
కలసిమెలసి ఉండగలగడం, ఒకరి కోసం ఒకరు పోరాడగలగడం, అవసరమైనపుడు తీరిక లేదనో, అలసిపోయాననో అనకుండా, ఆపదలో ఆదుకోవడం స్నేహం లక్షణం. స్నేహమంటే పాత పరిచయం కాదు. ఎప్పుడూ వీడని అనుబంధం. అన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ. స్నేహం మనసుకు సంబంధించిన విషయం. అనుభూతులకు నెలవు. అనుభవాలకు కొలువు. ‘ఈ సృష్టి వున్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే.. కుదిరితే కప్పు కాఫీ, లేదంటే కబుర్లు చెప్పుకుని సరదాగా గడుపుతారు. నీ వెంట నేనున్నా’ అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు, మన గెలుపును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు. సమస్యల్లో ఉన్నపుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నపుడు- అండగా ఉంటానని ధైర్యానిచ్చేవాడు మిత్రుడు.
ఒత్తిళ్లకు పరిష్కారం
యవ్వన దశలోకి ఎదిగే క్రమంలో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు స్నేహం ఎంతో అవసరం. యవ్వన దశలో హార్మోన్ల ప్రభావంతో శరీరంలో కలిగే మార్పులతో, మానసికంగా తలెత్తే భావోద్వేగాలను పంచుకోవడానికి మిత్రుల సహకారం చాలా అవసరమై ఉంటుంది. స్నేహితులు ఒకరి నుంచి మరొకరు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి దోహదం చేస్తారు. స్నేహం ఒక గొప్ప వరం. స్నేహం ఒక్కగొప్ప బాధ్యత. కష్టసుఖాల్లో ‘నీకు నేను ఉన్నా’ అని చెప్పే ఒకే ఒక్క గొప్ప బంధం.
దోస్త్ మేరా దోస్త్..
వయస్సుతో సంబంధం లేదు, కులంతో పనిలేదు.. స్నేహానికి కావాల్సింది రెండు కల్మషం లేని మనసులు. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులకు కూడా చెప్పుకోలేని విషయాల్ని ఫ్రెండ్‌తో పంచుకుంటాం. ఏ సమయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా, కష్టమైనా సుఖమైనా.. అన్నింటిని పంచుకునేది స్నేహితుడితోనే. మాటామాటా కలిస్తే చాలు ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ఫ్రెండ్‌షిప్‌లు జీవితాంతం ఉంటాయి. విజయం నీ సొంతమైతే సంతోషంతో గెంతులేసేది నీ మిత్రుడే. బాధ నీదైతే కన్నీళ్లు కార్చేది అతడే. ఎక్కడో పుట్టి ఎప్పుడో కలిసినా మట్టిలో కలిసేవరకు నీ వెంట ఉండేదీ ఆ స్నేహితుడే.. స్నేహం మాటలకు అందని బంధుత్వం. హృదయంతో జతకట్టే అనుబంధం. జీవితమనే పూదోటలో స్నేహమనే పరిమళాల సుమాలు విరబూయాల్సిందే.. ఆ సార్థకత చేకూరాలంటే దోస్తులు ఉండాల్సిందే...
స్నేహాన్ని ఎంచుకోవాలి
మనం పనిచేసే చోట సహోద్యోగులతో స్నేహం పెంచుకోవాలి. సగం జీవితం ఆఫీసుల్లోనే గడిపేస్తాం. ఒక్కోసారి ఇంట్లో సమస్యలు తలెత్తినా, కార్యాలయంలో సమస్యలు తలెత్తినా మనకు చటుక్కున ఆదుకునేవారు మన సహోద్యోగులే. జీవితంలో సంతోషం వెల్లివిరియాలంటే సహోద్యోగి స్నేహితుడు కావడం అత్యవసరం.
నిజమైన స్నేహితుడా..
జీవితంలో మిత్రులనూ, శత్రువులనూ గుర్తించడం నేర్చుకోవాలి. లేదంటే సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. కొందరు పైకి గంభీరంగా కనిపించినా అవసరానికి ఆదుకుంటారు. ఇంకొందరు వెన్నంటే ఉంటారు, రాసుకు పూసుకు తిరుగుతారు. కానీ అవసరం వస్తే.. తప్పించుకు తిరుగుతుంటారు. మరికొందరు ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి, వారిని విడదీయాలని చూస్తుంటారు. అందుకే స్నేహితులు తమ మధ్య అపార్థాలు రాకుండా చూసుకుంటూనే.. శత్రువుల వల్ల అనర్థాలు కలగకుండా జాగ్రత్తపడాలి.
మంచి స్నేహితుని కోసం ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా అతణ్ణి వదులుకోవద్దు. స్నేహాన్ని పెంచుకోవాలనేగాని తుంచే ప్రయత్నం చేయవద్దు. స్నేహితుల ప్రతి అడుగు, ఆచరణ ఇద్దరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఎవరికైనా మనస్పర్థలు సహజం. చిన్న చిన్న గొడవలను మనసులు గాయపడే స్థాయికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కరెక్టు అనిపించింది కొన్ని సందర్భాలలో మీ స్నేహితునికి తప్పుగా కనిపించొచ్చు. అంతమాత్రాన వాదనలతో దూరం కాకుండా చూసుకోవాలి.
ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలతో పాఠశాలల్లో అనేక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తూ పాతమిత్రుల సెల్‌నెంబర్లను సేకరించడం, కుటుంబ సమేతంగా ఒక ప్రదేశంలో కలుసుకోవడం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. మానసికంగా ఉల్లాసం, నూతనోత్తేజాన్ని కలిగించడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో దోహదం చేస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలను బాల్యదశలోని తీపి జ్ఞాపకాలతో దూరం చేసుకోవచ్చు. ఒక్కసారిగా బాల్యదశలోకి, యవ్వన దశలోకి మనసును పరుగులు తీయిస్తూ సంతోషంగా గడపడం అలవాటైతే జీవితం సాఫీగా సాగిపోతుంది.

-డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321