సబ్ ఫీచర్

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికే ఉన్నతమైన విద్యావంతులను, మేధావులను మన విశ్వవిద్యాలయాలు అందించాయన్నది ఒకప్పటి మాట. నేడు విశ్వవిద్యాలయాలు రాజకీయాల కారణంగా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలకు మాత్రమే వేదికలుగా నిలిచిన విశ్వవిద్యాలయాలు నేడు కులసంఘాలతో, రాజకీయ విద్వేషాలతో నిండిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను తమ పార్టీ ప్రచారానికి వాడుకునే కుట్రపూరితమైన ఆలోచనలతో నేటితరం నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీలో సభ పెట్టడానికి అనుమతి ఇవ్వరాదని కొన్ని రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. ఏ రాజకీయ పార్టీ గాని, కులసంఘాలు గాని విశ్వవిద్యాలయాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తే విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం ఖాయం.
రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను బలిపశువులుగా మార్చకూడదు. చాలాకాలంగా విశ్వవిద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, తమ ప్రాబల్యం పెంచుకొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సరికాదు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, గత నాలుగేళ్లలో విశ్వవిద్యాలయాల సమస్యలపై పాలకులు దృష్టి సారించిన దాఖలాలు లేవు. బోధన, పరిశోధన ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయి. మెరుగైన వసతులు లేక విద్యార్థులు నానా ఇక్కట్లు పడుతున్నారు. విశ్వవిద్యాలయాలకు సరిపడా బడ్జెట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులు మసకబారిపోతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా మొండివైఖరితో ఉన్న ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదు? కాంగ్రెస్ పార్టీకి ఉస్మానియా వర్సిటీపై నిజంగా ప్రేమ ఉంటే- బడ్జెట్‌లో కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని ఎందుకు డిమాండ్ చేయలేదు. వేల కోట్ల రూపాయల మేరకు ఉపకార వేతనాలు అందకపోవడంతో అనేకమంది విద్యార్థులు చదువును కొనసాగించలేక పోతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కానరావడం లేదా?
ఇదే ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తే వసతి గృహాల్లోకి పోలీసులు చొరబడి ఉద్యమకారులపై విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. నెలల తరబడి జైల్లో పెట్టించిన ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ ఏ ఒక్కరోజైనా ప్రశ్నించిన పాపాన పోలేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 105వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలకు ఉస్మానియా వర్సిటీ వేదిక కావాల్సి ఉంది. అయితే, తమను విద్యార్థి లోకం ఎక్కడ ప్రశ్నిస్తుందోననే భయంతో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు వేరే రాష్ట్రానికి తరలించినా, అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించలేదు? విద్యార్థులపైన, వారి ఉన్నత చదువులపైన పట్టింపు లేదా? రాజకీయ ప్రయోజనాల కోసం వర్సిటీలను వాడుకోవడం ఏ రాజకీయ పార్టీకి కూడా తగదు. ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను జనంలోకి వెళ్లి ఎండగట్టాలి. విశ్వవిద్యాలయాలను అందుకు వేదికలుగా చేసుకోరాదు. ఎప్పుడూ విద్యార్థులను పట్టించుకోని నేతలు వర్సిటీల్లోకి చొరబడడం సరికాదు.
వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గడించింది. ఉత్తమ బోధనకు నిలయంగా కీర్తి గడించింది. ‘వందేమాతరం’ వంటి ఉద్యమాలకు వేదికగా నిలచి యువతలో దేశభక్తిని నింపింది. మిగతా వర్సీటీలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. నిరుద్యోగ సమస్య, పేదరికం వంటి సమస్యలపై రాష్ట్రం మొత్తం తిరిగి రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేయవచ్చు. అది ప్రజాస్వామ్యబద్ధం. కానీ, సరస్వతీ నిలయాలను రాజకీయాలకు అడ్డాలుగా మార్చడంలో నేతల ఆంతర్యమేమిటి? వర్సిటీలో నెలకొన్న అసౌకర్యాలపై రాజకీయ పార్టీలు గళం విప్పాలి. అంతేతప్ప, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులను విభజించి తమ స్వార్థం కోసం రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని ప్రయత్నించడం దారుణం. ఏ వర్సిటీలో కూడా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు ప్రభుత్వం అనుమతించ రాదు. తమను కులమతాల పేరిట విభజించి రాజకీయం చేయడానికి వస్తున్న నాయకులను విద్యార్థులు నిలదీయాలి.

--ఈర్ల రాకేష్ 99129 87077