సబ్ ఫీచర్

తెలుగు మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయోద్యమం చివరిదశలో మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తెలుగు మహిళామణులు డా. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఆరుట్ల కమలాదేవి, ‘ఆంధ్రా అనిబిసెంటు’గా పేరుగాంచిన బత్తుల కామాక్షమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, చుండూరి రత్నమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి, సరోజినీ నాయుడు, దువ్వూరి సుబ్బమ్మ, కొల్లాకనక వల్లి తాయారమ్మ, అచ్చంట రుక్మిణి, మాగంటి అన్నపూర్ణమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, పాకుర్తి సుందరమ్మ, వేదాంతం కమలాదేవి, సంగం లక్ష్మీబాయమ్మ, దర్శి అన్నపూర్ణమ్మ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, దేవులపల్లి సత్యవతి, జ్ఞానకుమారి, ఎల్లాప్రగడ సీతాకుమారి.. ఇలా ఇంకా ఎందరో.. వీరంతా తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు. వారి గురించి టూకీగా..
* బాపట్లలో జన్మించిన కనుపర్తి వరలక్ష్మి స్వయంకృషితో తెలుగు సాహిత్యం, సంస్కృతం, హిందీ భాషలను అభ్యసించారు. సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో వరలక్ష్మమ్మ, ఆమె సహచర మహిళలందరూ ‘స్వరాజ్యం లక్ష్మీ వ్రతం’, ‘రాట్న లక్ష్మీ’ పూజలు దేసి స్వదేశీ దీక్షా సూత్రాలు కట్టుకున్నారు. అప్పటి నుండి వరలక్ష్మమ్మ గాంధీగారి సూచనమేరకు ఖద్దరు ధరించి, బాపట్లలో ‘హితైషిణీ మండలి’ని స్థాపించి మహిళలకు సాహిత్య విషయాలతో పాటు, రాజకీయ క్రియాశీలతను ప్రబోధించిన మేధావి.
* ఆంధ్రా అనిబిసెంటుగా పేరుగాంచిన బత్తుల కామాక్షమ్మ ఉన్నవ లక్ష్మీనారాయణను పెళ్లిచేసుకుని సంఘసేవలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఉప్పును గ్రామాలలో వండి శాసనధిక్కారం చేశారు. 1941లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఈమెను మూడోసారి అరెస్టుచేసి రాయవేలూరు జైలులో మూడు నెలలు ఉంచారు.
* గుంటూరు ఝాన్సీరాణిగా పేరొందిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవమ్మ పత్రికా రచయిత. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు తెల్లదొరలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు నెల్లూరు, మద్రాసు జైళ్ళలో శిక్షను అనుభవించారు.
* చుండూరి రత్నమ్మ గాంధీజీ ప్రభోదనలకు ఆకర్షితురాలై స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు.
* మల్లు స్వరాజ్యం గురించి తెలియని వారుండరు. నిజాం నిరంకుశ పాలనపై కత్తికట్టి, కొండజాతి, కోయజాతి, అడవిజాతి వారిని పోగుచేసి వారిలో చైతన్యం కలుగజేసిన గొప్ప మహిళ మల్లు స్వరాజ్యం.
* మద్యపాన నిషేధానికి ఎంతగానో కృషిచేసి, స్ర్తిలందరికీ ఆదర్శప్రాయమైన మహిళ ఆరుట్ల కమలాదేవి.
* కులవృత్తి చేపట్టి బట్టలు ఉతికి జీవితం గడిపేవారు చాకలి ఐలమ్మ. అక్షరం ముక్క రాకపోయినా తన సాహసంతో దొరలను, రజాకార్లను ఎదిరించి, భయపెట్టి ముందుకుసాగింది ఐలమ్మ. ఆమె పోరాటమే భూపోరాటాలకు నాంది అయ్యింది.
* క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్న మహిళ శివరాజు సుబ్బమ్మ.
* బహు భాషా కోవిదురాలు బారు అలివేలమ్మ. మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేసింది ఈమె. అలహాబాద్‌లో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారాశిక్షను అనుభవించిన జాతీయ నాయకురాలు.
* పాలకోడేటి శ్యామలాంబ యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమస్ఫూర్తిని నింపేవారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని పికెటింగ్ నిర్వహించారు. 1932 శాసనోల్లంఘనంలోనూ, 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలోనూ పాల్గొని కఠిన కారాగార శిక్షను అనుభవించారు.
* వర్ణవివక్షను రూపుమాపడంలో విశేష కృషి చేశారు గూడూరి నాగరత్నం. ఆ పంథాలోనే బ్రాహ్మణ కులంలో పుట్టినా రంగయ్యను వర్ణాంతర వివాహం చేసుకున్న నిరుపమాన స్వాతంత్య్ర సమరయోధురాలు. 1926 32ల్లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని చాగల్లు పరిసరాల్లో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి ఖద్దరు ప్రచారం, స్వదేశీ ప్రచారం చేసిన వీరవనిత.
* సరోజనీనాయుడు కూతురు పద్మజా నాయుడు. ఖాదీ వస్త్రాలను వాడమని, విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించమని అందరికీ బోధించేవారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్షననుభవించారు.
* స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగింటి మహిళామణి దువ్వూరి సుబ్బమ్మ. నిర్భీతికి మారుపేరుగా చెప్పుకునే సుబ్బమ్మ నాటి ఉద్యమంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పమని కలెక్టర్ అడిగితే ‘నా కాలిగోటికి సైతం నువ్వంటే అసహ్యం’ అని చెప్పిన సాహసి. 1922, 30, 32, 42 ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ధీరవనిత. దుర్భరమైన దారిద్య్రాన్ని అనుభవించినా తలవంచని వ్యక్తిత్వం గలవారు. రాజమండ్రిలో సనాతన స్ర్తి విద్యాలయాన్ని నెలకొల్పి ‘దేశబాంధవి’గా పేరుపొందారు.