సబ్ ఫీచర్

దోషనాశం.. పవిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓం అపవిత్రః పవిత్రోవాసర్వావస్థాంగతోపిన
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః’’
అనే శ్లోకాన్ని పూజలు, వ్రతాలు చేసే సమయంలో పఠించి శుద్ధి చేసుకుంటాం! అంటే మనలోని అపవిత్రతను తొలగించుకుని పవిత్రులమవుతాము. పవిత్రత అనేది ప్రధానమైంది. అటువంటి పవిత్రతను తిరిగి పొందేందుకు, కలిగిన అపవిత్రతను తొలగిచుకునేందుకు చేసే ఉత్సవాలే పవిత్రోత్సవాలు!
తెలుగువారి ఇలవేల్పు, కలల పందరి, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలుదీరిన భూలోక వైకుంఠం తిరుమలలో జరిగే నిత్య, వార, నక్షత్ర, మాస, సంవత్సర్సోవాల్లో ‘పవిత్రోత్సవాలు’ ఒకటి. సనాతన సంప్రదాయం ప్రకారం క్షేత్రాలకు భక్తులు అత్యంత పవిత్రమైన హృదయాలతోనే వస్తారు. అయినా తెలిసీ తెలియక రావడం లేదా తిరుమలకు చేరుకున్నాక జాత శౌచం, మృతశౌచం వంటివి రావచ్చు. భక్తులవల్లనే కాక ఆలయ, క్షేత్ర సిబ్బందివల్లనూ, పూజల్లోనూ, ఉత్సవాల్లోనూ పొరపాట్లు రావచ్చు. అందువల్ల ఆలయ పవిత్రత కొంత తగ్గుతుంది. ఇలాంటి స్థితిలో ఆలయ పవిత్రతకు లోపం రానీయకుండా నివారించేందుకు, తెలిసీ తెలియక చేసిన దోషాలవల్ల కలిగిన అపవిత్రతను తొలగించేందుకు నిర్వహించే ఉత్సవాలకే ‘పవిత్రోత్సవాలు’ అని పేరు. తిరుమల క్షేత్రంలో ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో శుక్లపక్ష దశమి మొదలుకుని ద్వాదశి వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనకాలం నుంచే జరుగుతూ వున్న ఈ సేవలు మధ్యలో నిలిచిపోగా, 1962 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలవారు తిరిగి పునరుద్ధరించి, ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వున్నారు.
అంకురార్పణ
దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ప్రధానమైంది, ముందుగా జరిగే కార్యక్రమం- ‘అంకురార్పణ’. అంటే అంకురాలను మొలకెత్తించడం. అట్లే పవిత్రోత్సవాల ముందురోజు అంకురార్పణ జరుగుతుంది. శ్రావణ శుద్ధ నవమి రోజు సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేనాపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయం నుంచి వెలుపలకు వచ్చి తిరుమాడ వీధులలో ఊరేగుతూ మహాప్రదక్షిణా మార్గంలో నైఋతిలో వున్న వసంతోత్సవ మండపానికి చేరుకుని అక్కడ భూమి పూజ చేస్తారు. అంకురార్పణ చేస్తారు. అంటే నవధాన్యాలను ఆ మట్టిలో వేసి బీజావాపం చేస్తారు. మరుసటి రోజునుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయి.
పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రోత్సవ మండపంలో ఏడు హోమగుండాలను ఏర్పాటుచేసి, వాటిల్లో అగ్నిప్రతిష్ఠ చేస్తారు. వీటిమధ్య వేదికపై నవ కలశాన్నీ, మరో వేదికపై ప్రాయశ్చిత కలశాన్నీ ఏర్పాటుచేస్తారు. తర్వాత ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని పవిత్రోత్సవ మండపానికి తీసుకుని వచ్చి స్నానపీఠంపై కొలువుదీరుస్తారు. పట్టుదండల మాదిరిగా వుండే పట్టు పవిత్రాలను యాగశాలలో వుంచుతారు. తర్వాత హోమ కార్యక్రమం పూర్తిచేసి పవిత్రాలను పూజిస్తారు. అనంతరం వేదపండితులు శ్రీసూక్తం, పురుషసూక్తం వంటి వేద మంత్రాలను పఠిస్తూ వుండగా అర్చక స్వాములు ముందుగా స్వామివారలకు శుద్ధ జలంతో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీటితో అభిషేకం చేసి హారతులను సమర్పిస్తారు. తర్వాత స్వామివారలకు చందనాన్ని అద్ది, తులసిమాలలను ధరింపజేసి, బంగారు జల్లెడను స్వామివారలపై పట్టుకుని అందులో నీరు పోస్తూ సహస్రధారాభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తయ్యాక వస్త్రాలంకరణ, నైవేద్య కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం స్వామివారు తిరుమాడ వీధులలో దివ్యలంకారశోభితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి, తిరిగి పవిత్రోత్సవ మండపానికి చేరుకుంటారు.
పవిత్ర సమర్పణ
ఇక రెండవ రోజు మొదటిరోజు మాదిరే హోమాదులు, అభిషేకాదులు పూర్తయ్యాక, పవిత్రోత్సవ మండపంలో తొలినాడు ప్రతిష్ఠించిన పవిత్రాలను తీసుకుని గర్భాలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. పవిత్రాలను స్వామివారి వద్ద వుంచి పూజాదులను నిర్వహించిన తర్వాత ముందుగా మూలమూర్తికి పట్టు పవిత్రాలను సమర్పిస్తారు. స్వామివారి కిరీటం, మెడలోనూ హారాలుగా పవిత్రాలను వేస్తారు. శంఖు, చక్రాలు, నందక ఖడ్గానికి, వక్షస్థలంలోని శ్రీదేవి భూదేవులకు, కటి, వరద హస్తాలకు పవిత్రాలను సమర్పిస్తారు. గర్భాలయంలోని ఉత్సవ మూర్తులతోపాటూ జయ, విజయులు, గరుడాళ్వారు, ఉషాలయాలు, వంటశాలలోని మూర్తులకు, ఆనంద నిలయ విమాన గోపురానికి నాలుగువైపులా, విమాన వేంకటేశ్వరస్వామికి, ధ్వజస్తంభం, బలిపీఠంలకూ పవిత్రాలను సమర్పిస్తారు. తర్వాత వరాహస్వామి ఆలయంలోని దేవతామూర్తులకు, బేడి ఆంజనేయస్వామిల ఆలయంలోని దేవతామూర్తులకు పవిత్రాలను సమర్పిస్తారు. తిరిగి ఆలయం చేరుకుని పవిత్రోత్సవ మండపంలోని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, యజ్ఞకుండాలకు, కలశాలకు పవిత్రాలను సమర్పిస్తారు. తర్వాత అర్చకులు, ఋత్విక్కులు పవిత్రాలను స్వీకరించి ధరిస్తారు. స్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింపజేసి పవిత్రోత్సవ మండపానికి చేరుకుంటారు.
మూడవ రోజు హోమాదులు, అభిషేకాలు జరుగుతాయి. అలంకరణలు, నైవేద్యాలు పూర్తయ్యక పూర్ణాహుతి నిర్వహిస్తారు. పూర్ణాహుతి పూర్తయ్యాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పవిత్రోత్సవ మండపం నుంచి ఆనంద నిలయానికి చేరుకుంటారు. దీనితో పవిత్రోత్సవాలు వైభంగా ముగుస్తాయి. పవిత్రోత్సవాల సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు పవిత్రోత్సవ మండపంలోనే వేంచేసి ఉండడం విశేషం- క్షేత్రంలో తెలిసీ తెలియక జరిగే దోషాలవల్ల కలిగిన అపవిత్రత తొలగిపోయి తిరిగి పవిత్రత సంతరించుకుంటుంది. స్వామివారూ, ఆలయం అనంతకోటి దివ్య తేజస్సులతో వెలుగొందుతూ భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తారు.
‘‘శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాం ఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్’’

-ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖరరావు