సబ్ ఫీచర్

కవిత్వాన్ని కొలిచే కొలమానాలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలేది కదిలించేది కవిత్వం అన్నారు శ్రీశ్రీ, ఒక హృదయం ఎంతగా కదిలితే, అంతటి చిక్కని భావాన్ని అది చిలుకుతుంది. ఆ భావాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించినపుడు అది కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వమే సమాజాన్ని కదిలించి సంస్కరణల వైపు నడిపిస్తుంది. కవిత్వం నేరుగా సమాజాన్ని మార్చదు, దానిని చదివి ప్రేరణ పొందినవారే సమాజంలో మార్పు తీసుకురావడానికి కారకులవుతారు. ఏ చరిత్ర చూసినా ఇదే చెబుతుంది. మరి అసలు కవిత్వం అంటే ఏంటి? దానిని తూచే కొలమానాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న వస్తే, ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెప్తారు. కవిత్వాన్ని తూచే తూనిక రాళ్లు లేవన్నారు చలం. సాధారణంగా ఒక విషయాన్ని సాధారణ ప్రజలు ఎలా వ్యక్తపరుస్తారో, అదే విషయాన్ని ఎవరూ ఊహించని కోణంలో ఆవిష్కరిస్తే అదే కవిత్వం అని కొంతవరకు అర్థంచేసుకోవచ్చు. అదే మామూలు మనిషి నుండి కవిని వేరుచేసి చూపించేది. కవిత్వంలో భావాన్ని వ్యక్తపరచడంలో కొత్తదనం, నూతన పోలికలు, భిన్న పార్శ్వాల్లో వస్తువును స్పృశించడం, ఉదాహరణలు, పాఠకుడిని మైమరిపించే ఎత్తుగడలు, మనసుని కట్టిపడేసే భావజాలాలు, చిన్నచిన్న చరుపులు ఇవన్నీ కలబోసి ఉంటే అది మంచి కవిత్వం అవుతుంది. కవితకు, మంచి కవిత్వానికి ఉన్న తేడా ఏంటంటే, పాఠకుడి మెదడును మాత్రమే కదిలిస్తే అది సాధారణ కవిత, పాఠకుడి హృదయాన్ని కదిలించి ఆలోచింపచేస్తే, హృదయావిష్కరణ జరిగి అది దీర్ఘకాలిక సౌభాగ్యం ఉన్న కవిత అవుతుంది. అన్ని కవితాశైలులు హృదయాన్ని అంతగా కదలించలేకపోవచ్చు. హృదయాన్ని కదిలించే కవిత్వమే కాలంతోపాటు ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆధునిక కవిత్వంలో భావంలో గాఢత, పదాలలో సరళత ఉన్నవి ప్రజలలోకి తొందరగా చొచ్చుకెళ్తాయి. సంక్లిష్ట పదబంధాలు వాడితేనే మంచి కవిత్వమవుతుందని, అలతి పదాలతో రాస్తే సాధారణ వచనం అవుతుందనే ధ్యాసనుండి కవులు బయటపడాలి. ప్రజల భాషే రాజభాష ఎలా అవుతుందో, ప్రజల మనసు లోతుల్లోకి వెళితేనే ఆ కవిత్వానికి సార్థకత. ఏ కవిత అంతిమ లక్ష్యమైనా సమాజంలో మార్పును తీసుకురావడమే. దానికి వ్యవహారిక భాషే మార్గమవుతుంది.
ప్రస్తుతమున్న వర్ధమాన కవుల్లో, ప్రవర్ధమాన కవుల్లో ఎంతోమందికి కవిత్వం అంటే ఏమిటి? ఎలా రాస్తే అది మంచి కవిత్వం అవుతుంది అన్న సంశయాలు ఉండడం సహజం. పైన పేర్కొన్న అంశాలతోపాటుగా, వర్ధమాన రచయితలు, రచయిత్రులు పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. గొప్ప గొప్ప రచయితల రచనలను చదివితే మంచి మెళుకువలు వంటపట్టి మంచి రచనలు చేయగలుగుతారు. చాలావరకు యువత సరైన మెళుకువలు తెలుసుకోకుండా కవితలు అల్లుతున్నారు. ప్రారంభ దశలోనే సామాజిక మాధ్యమం, పత్రికల ప్రోత్సాహం ఉండడంతో తమ భావాలని సమాజంతో పంచుకుంటున్నారు.
ఇవి కొంతవరకు బాగానే ఉన్నా, విమర్శ బారిన పడటం, దాంతో వారు చిన్నబుచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వర్ధమానులు ముందుగా ఎక్కువ కవితా పఠనానికి, మెళుకువలు సంగ్రహించడానికి, శబ్ద పదబంధాలపై పట్టుసాధించడానికి, ప్రతీ వస్తువును కొత్తకోణంలో చూడడానికి కృషిచేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని, నిత్య విద్యార్థిగా మారాలి. అలాగే ప్రముఖ విమర్శకుల విమర్శలను నిశితంగా గమనించడం ద్వారా ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకోవచ్చు. అలతి అలతి పదాలతో గొప్ప రచనలు చేస్తున్న కవుల నాడిని పట్టుకోగలగడం ద్వారా నాణ్యమైన రచనలు చేయవచ్చు. కాబట్టి వర్ధమాన, ప్రవర్ధమాన కవులు పఠనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి నాణ్యమైన రచనలు చేస్తూ ఇటు సాహిత్య రంగాన్ని, అటు సమాజ శ్రేయస్సుని భుజాన మోస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన గురుతర బాధ్యత ఈ తరం కవులపై ఉంది.

--- పరవస్తు విశ్వక్సేన్