సబ్ ఫీచర్

రేటింగ్స్ బరి.. వీక్షకుడు బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగానికి ‘నాలుగో స్తంభం’గా పిలువబడుతున్న మీడియా తన సామాజిక బాధ్యతల నుండి ఎప్పుడో దూరం జరిగినట్లు అనిపిస్తోంది. వార్తను వార్తలా కాకుండా, ఏ మాత్రం ప్రాధాన్యతలేని అంశాన్ని ఉదయం నుండి రాత్రి దాకా ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట ప్రేక్షకుల సహనాన్ని ఎలక్ట్రానిక్ మీడియా పరీక్షిస్తోంది. కొన్ని విద్యాసంస్థలు తమ ర్యాంకులను పదే పదే టీవీ మాధ్యమం ద్వారా ప్రకటించుకున్న రీతిలో- అప్రధానమైన విషయాలను చెప్పిందే చెప్పి ఊదరగొడుతున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని పక్కన పడేసి, ఒక చిన్న సంఘటనపై లేదా వీక్షకులు ఏ మాత్రం ఇష్టపడని విషయాలపై చర్చావేదికలు నిర్వహించడం పరిపాటైంది. కొన్ని వార్తాపత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఏదో ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతున్నాయి. కొన్ని తెలుగు చానళ్లే కాకుండా హిందీ, ఇంగ్లీషు చానళ్లు ఈ విషయంలో తక్కువేమీ కావు. నిర్దేశించిన 30 నిమిషాల వ్యవధిలో ఎనిమిది నుండి పది మందిని స్టూడియోలో కూర్చోపెట్టి లేదా ఫోన్ ద్వారా ఒక అంశంపై చర్చ నిర్వహిస్తే ఏవిధంగానూ ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అటువంటి చర్చలో పాల్గొన్నవారికి కేవలం ఒక్క రౌండు మాత్రమే అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశముంటుంది. కొన్నిసార్లు ఒకరిద్దరు అతిథులకి వారి అభిప్రాయాన్ని తెలియపరిచే అవకాశం కాడా దక్కదు. ఎందుకంటే వారందరికంటే మోడరేటరే ఎక్కువగా మాట్లాడతాడు కాబట్టి. మరో దుర్గుణం ఏమంటే, తన అభిప్రాయాలను లేదా చానల్ అధినేత అభిప్రాయాలను చర్చలో పాల్గొన్న వ్యక్తులపై రుద్దటానికి మోడరేటరే విశ్వప్రయత్నం చేయడం.
మోడరేటర్ కేవలం అతిథుల అభిప్రాయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ప్రజాభిప్రాయం కూడా పాల్గొన్న వ్యక్తుల ద్వారా సంబంధిత వ్యక్తులకు అందజేయాలి. ఏకపక్ష ధోరణితో లేదా ఆధిపత్య ధోరణితో తన అభిప్రాయాలను అతిథుల నోటినుండి చెప్పించాలనుకోవడం అభిలషణీయం కాదు. గత కొనే్నళ్ళుగా ఒక వీక్షకుడిగా గమనించిన విషయమేమంటే- చర్చాగోష్టిలో అతిథి అభిప్రాయం తనకనుకూలంగా ఉండదని భావించినట్లయితే, మోడరేటర్ అతని అభిప్రాయాన్ని మధ్యలోనే తుంచేయడం లేదా కార్యక్రమానికి కాసేపు విరామం ప్రకటించడం సహజంగా జరుగుతోంది. చర్చలో పాల్గొన్నవారు తెలివితక్కువ దద్దమ్మలని, తానే తెలివైన వాడిననే అహంకార పూరిత ధోరణి సంధానకర్తకు మంచి లక్షణం కాదు. చర్చలో పాల్గొనే వారిని కూడా దాదాపు సమానస్థాయి వారినే ఎన్నుకోవాలి. తమకు కావలసిన రాజకీయ పార్టీల నుండి తెలివైనవారిని, ప్రత్యర్థి పార్టీల నుంచి బలహీనులను ఎన్నుకోవడం వల్ల చర్చ సారవంతంగా ఉండదు.
తెలుగులో చర్చా కార్యక్రమాలు నిర్వహించే కొంతమంది సంధానకర్తలు తమకుతాము జాతీయ లేదా అంతర్జాతీయ జర్నలిస్టులుగా భావించుకునే ధోరణిని మనం గమనిస్తున్నాం. చర్చలో పాల్గొంటున్న కొన్ని రాజకీయ పార్టీల వారిని చులకన చేసి మాట్లాడటం, ఆ పార్టీని అవహేళన చేయడం, వెకిలి నవ్వులు నవ్వడం, కుళ్లు జోకులు వేయడం చేస్తుంటారు. వారు నిర్వహించే కార్యక్రమాల్లో ఏ మాత్రం గంభీరత ప్రదర్శించరు.
జాతీయ నాయకులను ఇంటర్వ్యూ చేసిన సందర్భాలలో కూడా సీనియర్ జర్నలిస్టులు ఆక్షేపణను ఎదుర్కొన్న సందర్భాలు లేకపోలేదు. భారత మాజీ రాష్టప్రతి ఒకరు- ఒకానొక సందర్భంలో తనను ఇంటర్వ్యూ చేసే సీనియర్ జర్నలిస్టు ‘తాను జవాబులిస్తుండగా జోక్యం కల్పించుకుంటున్నాడ’ని అభ్యంతరం తెలియజేసిన ఉదంతాలున్నాయి. ఒక సీనియర్ రాజకీయవేత్త ఒకానొక సీనియర్ జర్నలిస్టును ఇంటర్వ్యూలో అడ్డుపడుతున్నందుకు ‘షటప్’ అన్న సందర్భం లేకపోలేదు. ఈ మధ్యకాలంలో ఒక తెలుగు టీవీ చానల్‌లో ఒక రాజకీయవేత్త- ‘సంధానకర్త అనవసరంగా జవాబులకి అడ్డుపడటం లేదా ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం తగద’ని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాలో ఇలాంటి పక్షపాత ధోరణి సమర్థనీయం కాదు.
ప్రజలకు ఉపయోగపడే లేదా రాజకీయ నాయకుల, ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలపై కార్యక్రమాలు నిర్వహించటం మంచిది. పారిశుద్ధ్యం, ఆసుపత్రుల నిర్వహణ, పాఠశాలలు, కళాశాలల పనితీరు, పోలీసింగ్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిర్వహణ, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సామాజిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల సేవల గురించి ప్రజలకు తెలియచేస్తే సమాజానికి ఉపయోగం ఉంటుంది. న్యాయస్థానాల ప్రజోపయోగ తీర్పులు, న్యాయ చైతన్య సదస్సులు, వ్యవసాయశాఖ కార్యక్రమాలు, స్ర్తిల హక్కులు, వారిపై అఘాయిత్యాల నివారణ, బాలికా సంరక్షణ, ఆరోగ్య పోషణ లాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తుండాలి. చర్చావేదికలు అర్థవంతమైన దిశలో సాగాలి.
నేడు మనం గమనించినట్లయితే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే సంఘటనలను, భార్యాభర్తల వివాదాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, బ్రేకింగ్ న్యూస్‌గా ఒకే విషయాన్ని పదేపదే ప్రసారం చేయటం- ప్రాధాన్యత అవుతుందా? ఈ ధోరణి ఇకనైనా మారాలి. టి.ఆర్.పి. రేటింగ్స్ కోసం తమను బలిపశువులను చేయకండని సగటు ప్రేక్షకుడి హృదయం ఘోషిస్తోంది. తాము టీవీ చానళ్లను చూడటం మానేసినట్లుగా కొంతమంది మేధావులు ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తీకరిస్తున్నారు. అయితే, బ్రేకింగ్ న్యూస్, మసాలా వార్తలు కొంతమంది వీక్షకులను టీవీ చానళ్లు బానిసలుగా చేస్తున్నాయి. దీంతో వాటికి టి.ఆర్.పి రేటింగ్ పెరుగుతుంది. ఆ ‘వాపు’నే బలుపుగా కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయి. జనం కోసం టీవీ చానళ్లు తమ ఏకపక్ష, అస్తవ్యస్త విధానాలను మార్చుకోవడం ఉత్తమం.

-తడకమళ్ల మురళీధర్ 98485 45970