సబ్ ఫీచర్

చైతన్యానికి ఉత్ప్రేరకం సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలగమనంలో సామాజిక హితాన్ని కాంక్షించే రసాయనిక చర్యల్లో సాహిత్యం ఉత్ప్రేరకంగాను పనిచేస్తుంటుంది. సమాజంలో దుష్పరిణామాలను హరించే మంచిని పెంచే చర్యలను వేగవంతంగా ప్రోత్సహించే చైతన్యాన్ని సాహిత్యం కలిగిస్తుంటుంది. అంతటా ఆవహించిన అస్థిరతను, అస్థిమితాన్ని పటాపంచలుచేస్తూ, మనిషిని ఒంటరితనం నుంచి కాపాడే కారకాలను ప్రజాసాహిత్యం అందిస్తుంటుంది. సమాజంలో నేస్తాన్ని నెరపుతున్న సాంస్కృతిక కళారూపాలను ఊపిరిలూదటంలో సాహిత్యం తనదైన పాత్ర పోషిస్తోంది. అయితే నేడు సాహిత్య పరిజ్ఞానం దారితప్పి దోపిడీ శక్తుల వలలో చిక్కింది. మనిషి ఆలోచనా విధానాన్ని మటుమాయం చేస్తుంది. ‘మానసిక’ వ్యాధిగ్రస్తమైన అర్థంకాని అభివ్యక్తితో వస్తురహితమైన కవిత్వం నైరూప్యశిల్పంతో వెలువడుతోంది. దీన్ని అత్యాధునికతగా భావించడం జరుగుతోంది. కవి ఓ శిల్పిగా మారనిదే శిలలో ఉన్న శిల్పం బయటకు రాదు. నేడు కవులు శిలలో వున్న శిల్పాన్ని బయటకు తామనుకున్న రీతిలో తేవడంపోయి, శిల్పాన్ని మరుగుపరచే యత్నమే చేస్తున్నారు. భావస్పష్టతకు దూరమైపోతున్నారు. కవి తన ప్రతిభాస్వరాల్ని కవిత్వంలో ఒలికించి పలికించి పాఠకుణ్ణి నిలువెల్లా పులకింపచేయుటలో కృతకృత్యుడు కావాల్సి వుంది. కాని పాఠకునికి ఎక్కడ అర్థమై ఆనందపడతాడోననే మీమాంసతో, కనెక్టివిటీ లేని అర్థరహిత పదబంధాలను గుప్పిస్తూ, అసంపూర్ణ వాక్యాలతో, అడ్డదిడ్డమైన భావాలతో కవిత్వాన్ని ముగించి, ‘కాల’రెగరేసే కవులూ లేకపోలేదు. వారిని ఆదరించే లిటరరీ గ్రూపులు బహుళంగానే కనిపిస్తున్నాయి. కవిత్వ లక్ష్యం తెలిసిన కవులు తమ మార్గాన్ని కవిత్వ నిర్మాణంలో అద్భుతమైన శబ్దచిత్రాలను, భావచిత్రాలను, చక్కని పద బంధాలను, ఆకట్టుకునే ఇమాజిరీలను, అభివ్యక్తి నవ్యతను భావతీవ్రత ఉండే విధంగా ఎన్నుకుంటారు. అంశాన్ని అద్భుతంగా వ్యక్తీకరిస్తారు. కవి క్రాంతదర్శిగా, విశాల దృక్పథంగల మానవతావాదిగా దోపిడీని దండించే విప్లవకారునిగా, సృజనశీలిగా చైతన్య ప్రవాహమై సాగిపోతుండాలి. కాని దుష్టపాలకుల చేతుల్లో పావుగా, కీలుబొమ్మగా, దోపిడీ ప్రోత్సాహకారిగా, మూఢాచారాలకు ప్రచారకారిగా కవి ఉండకూడదు. అవార్డు రివార్డుల కోసం సాహితీవేత్తలు అర్రులుచాస్తూ, రాజకీయాల ప్రమేయంతోనే అది పొంగి వుంటే అంతకంటే విషాదం సాహిత్యంలో మరొకటి ఉండదు. ఇది సృజనకారుడనుకునే సాహితీవేత్తకు ఆత్మహత్యా సదృశమే అవుతుంది కాని గౌరవప్రదం కానేరదు.
ఇవాళ సాహిత్యం నిర్దిష్టమైన భౌతిక దృష్టితో శాస్ర్తియ దృక్పథంతో, హేతుబద్ధతతో విశ్వజనీన చరిత్రకి రూపకల్పన చేసే విధంగా ఉండాలి. ఒక విధంగా ఆలోచిస్తే ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాల వైఫల్యం కొంతమేరకు అభ్యుదయ సాహితీవేత్తలను ఉదార ప్రజాస్వామ్యంవైపు పూర్తిగా జరుపలేకపోయినా దానిని ఆకాంక్షించే స్థితికి చేర్చింది. వర్తమాన విధ్వంసక చర్యలనుండి మనిషిని ఏమార్చేదిగా సాహిత్యం నిలువకూడదు. రాజకీయ వ్యవస్థల లోటుపాట్లను వారి అంతర్గత ఆలోచనా విధానాలను, వారి నైతిక పతనాలను ఏ విధంగా సమర్ధించుకొంటూ, జనాన్ని ఆర్థికాశాపరులుగా మారుస్తూ గద్దెలనెక్కి వారి స్వార్థాలను వైశాలించుకుంటున్నదో ఎలుగెత్తి చాటే సాహిత్యం ఈవాళ అవసరం. జీవము ఒక రసాయనిక ప్రక్రియ. అలాగే సమాజానికి సామాజిక చైతన్యానికి ఓ కెమిస్ట్రీ వుంది, అందులోనే ఓ రసాయనిక చర్య వుంది. సామాజిక రసాయనిక చర్యలో పాల్గొనే మూలధాతువుల మధ్య సాహిత్యం ఓ ఉత్ప్రేరకంగా చేరి సత్ఫలితాలిచ్చే చర్యను చైతన్యానిచ్చే అంశాలు వెలువడడానికి వేగవంతం చేస్తుంది. అందుకే సాహిత్యమూ ఉత్ప్రేరకంగా మారాల్సిన అవసరముంది. దేశాన్ని అగమ్యగోచరంగా, చీకటి ముసుగుల్లోకి నెడుతున్న వంచకులెవరో, వంచనలేవో తేల్చుకోవాల్సిన సమయమిది.
పరిశ్రమల మిషతో సాగు భూములు కార్పొరేట్ పారిశ్రామికవేత్తల చేతుల్లోకి పోతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి సాకు చెప్పి పాలకులే పొలాలను లాక్కుంటున్నారు. సేద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. హాలికుడిని ఆకలికి గురిచేస్తున్నారు. అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఈ తరుణంలో సమాజంలో నూతన చైతన్యం వెల్లివిరియాలి. విశే్లషించి, వివరించి, విమర్శించి ఎత్తిచూపే సాహిత్యం పుంఖానుపుంఖాలుగా రావాలి. నిర్మొహమాటంగా, నిష్కర్షగా, నిష్ఠగా, సత్యాన్ని వెలుగుచూపించే సాహిత్యం సామాజిక రసాయనిక పరిజ్ఞానపు చర్యతో ఓ ఉత్ప్రేరకంగా వెలువడాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సమాజం ఈనాడు అల్పాదాయ కలల్లో, ఆర్థిక ప్రలోభాలకులోనై, వస్తువ్యామోహభరితమైన వ్యాపకాల్లో తలదాచుకొంటుంది. సామాజిక విధ్వంసక చర్యలమీద పోరాటానికి సంఘటిత పడడానికి దోపిడీకి లోనయ్యే బడుగు బలహీనవర్గాలు ముందుకు రావడంలేదు. మారిపోతున్న కాలరీతుల్ని మారని నియమాలతో ముడివడిన జీవితాలు అవగాహనించుకునే దశలో లేవు. కవిత్వంలో కూడా కాల లక్షణాలకి అనుకూలంగా ప్రయోగాలు జరగాలి. ఈ ప్రయోగాలను ఆదరించకుండా అలక్ష్యంగా చూసే కుహనా సాహిత్యం జనాన్ని ముంచెత్తుతుంది.
సమాజాన్ని పాలకులు మాటల గారడీతో అచేతన స్థితిలోకి నెట్టివేయడాన్ని గమినించలేకపోతున్న దుస్థితి. ఈనాడు మనుషుల మధ్య ద్వేషం, పగ, ఈర్ష్య వాటి రూపాల్లో ఉండవు. స్నేహపూరితంగా భుజంమీద వేసిన చేయిలాగ, ప్రేమతో తల నిమిరే ఆప్యాయతలాగ, కరుణ, దయను కురిపించే ఓదార్పు వాక్యంలాగ మోసం నటనతో దరిచేరి కొంపలు ముంచుతుంటాయి. నిజాయితీ లోపించిన చిత్తశుద్ధి కొరవడిన జీవన కావ్యాలను వినిపించడం, నమ్మకాన్ని వమ్ముచేయడం మానవ నైజంగా మారడం నేడు చూస్తున్నాం. మన సాహిత్య ప్రతిభ అనుకరణకు ప్రాధాన్యత యిచ్చినంతకాలం ఒకని మోచేతి కింది నీళ్లు తాగాల్సి వస్తుందనేది సత్యం. అందుకే సాహితీవేత్తలు సృజనశీలురుగా ఉండాలి. సత్యానే్వషణా దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఉద్యమస్ఫూర్తికి ఊపిరిలూదే అక్షరధారులై ఉండాలి.
సామాజిక రసాయనిక చర్యలు సమతుల్యంగా వేగవంతం కావాలంటే సాహిత్యపరమైన ఉత్ప్రేరకాన్ని వినియోగించుకోవాల్సి వుంటుంది. మానవ సమాజ ప్రగతికి ప్రేరణశక్తిగా సాహిత్యం పనిచేయాలి. నిజమైన సాహిత్యం వస్తుపరిజ్ఞానాన్ని యదార్థంలో శోధించి, అనుభవం ద్వారా గ్రహించి, ఆచరణలో నిగ్గుతేలే విధమైన భావస్ఫూర్తినిస్తూ, మానవ సామాజిక పరిణామక్రమాన్ని అధ్యయనంచేస్తూ శాస్ర్తియ పద్ధతితో సజీవతను సంతరించుకొని సాగిపోతుంటుంది. జీవితంలో ఎదురయ్యే చిక్కుముడులను విప్పుకునే క్రియాత్మక దృక్పథం కలిగి ఉంటుంది. మనిషిని చుట్టుముట్టే ఎన్నో సమస్యలను విడమరచి విప్పుకునే నైపుణ్యాన్ని సాహిత్యం కలిగిస్తుంటూంది. ఉత్తమ సాహిత్యమెప్పుడూ ప్రజల పక్షమే నిలుస్తుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, 9948774243