సబ్ ఫీచర్

గాయకుడు గద్దర్.. ఓ పెద్ద గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ఆగస్టులో పది లక్షల మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీని ప్రకటిస్తానని, మేనిఫెస్టోను ఆవిష్కరిస్తానని గాయకుడు గద్దర్ రెండున్నర నెలల క్రితం గొప్పగా ప్రకటించాడు. పార్టీ ఆవిర్భావ సభ జాడ లేదు, ఈ జాప్యంపై వివరణ కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి, కొత్త పార్టీతో ప్రజల్లోకి వస్తానన్న గద్దర్ మాటకు ఇక ‘విశ్వసనీయత’ ఉందా? హాస్య పాత్రలో ఉన్నట్టు గద్దర్ రకరకాలుగా మాట్లాడితే ఆ మాటకు ‘మాన్యత’ ఉంటుందా? గందరగోళమే మిగులుతుంది కదా?
ఈనెల 9న హైదరాబాద్‌లో ఒక సదస్సులో గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీచేస్తానని, అన్నీ కలిసొస్తే సీఎం అవుతానని ప్రకటించాడు. ఇదీ ఆయన వరుస! ఈ మాటల్లో ఏమైనా ‘పస’ కనిపిస్తోందా? ఏది తోస్తే అది మాట్లాడే వైనం కనిపిస్తోందా? రెండవ అంశమే అగుపిస్తోంది. మరి ఇలాంటి ప్రకటనలు ప్రజలకు ప్రయోజనకరమైనవేనా?
శాసనసభ రద్దయిన విషయం తెలిసి, తొమ్మిది నెలలముందే కేసీఆర్ పాలన పీడ విరగడయిందని బహిరంగంగా వ్యాఖ్యానించి, తనలోని అసహనాన్ని ఏమాత్రం దాచుకోకుండా గద్దర్ వెళ్ళగక్కాడు.
తాను సీఎం అవుతానని ప్రకటించిన రోజే తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కతో గద్దర్ సమావేశమై, సామాజిక తెలంగాణ ఏర్పడితే ప్రజలు సంతోషిస్తారని అన్నాడు. అదే రోజు మరోచోట త్యాగాల తెలంగాణను తేవాలని విద్యార్థులకు పిలుపునిచ్చాడు. ఇలా ఏరోటికాడి పాట ఆ రోటికాడ పాడటం పూర్తిగా ఒంట బట్టించుకుని మాట్లాడితే ఆ మాటలకు విలువ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీని దశాబ్దాలపాటు ఈసడించుకున్న గద్దర్ ‘ భట్టి’తో సమావేశమవడంలో మతలబు ఏమిటో? గద్దర్ కుమారుడు ‘సూర్యం’ కాంగ్రెస్‌లో చాలారోజుల క్రితం చేరిన సంగతి తెలిసిందే! అతనికి ‘టిక్కెట్’ ఇప్పించుకునే పనిలో కలిశాడని ఓ వాదన వినిపిస్తోంది. ఓటు రాజకీయమంటే ఈసడించుకుని, ఎన్నికల్ని బహిష్కరించమని, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని దశాబ్దాలపాటు పాటలు-పద్యాలు పాడి ప్రజల్ని ఆకట్టుకున్న గద్దర్ చివరికి తన కుమారుడికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం పైరవీ చేసే స్థితికొచ్చాడు! అనంతరం, వి.హనుమంతరావుతో ములాఖాత్ అయ్యాడు. మావోయిస్టుల ఒడిలో ఉన్నప్పుడు, అనంతరం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని నినదించాడు. ఇప్పుడు త్యాగాల తెలంగాణ కావాలని, సామాజిక తెలంగాణ రావాలని కాంగ్రెస్ వారితో మంతనాలు జరుపుతున్నాడు.
గద్దర్ కేసీఆర్‌పై, విమలక్క కేటీఆర్‌పై పోటీ చేస్తారని ఆయన మిత్రుడు, టి-మాస్ అధ్యక్షుడు కంచ ఐలయ్య హైదరాబాద్‌లో, నిర్మల్‌లో ఇటీవల ప్రకటించారు. ఆ విషయాన్ని గద్దర్ ఖండించలేదు. అంటే కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీచేస్తారన్న మాట? గద్దర్ సొంత ఊరు తూప్రాన్. అది గజ్వేల్ నియోజకవర్గంలోకే వస్తుంది. ఇటీవలే అక్కడ తన ఓటును నమోదుచేయించుకున్నాడు. ‘కేసీఆర్‌పై గద్దర్ పోటీ’ వినడానికి వింతగా ధ్వనిస్తుంది కదా? హాస్య చతురోక్తి విన్నట్టుగా తోస్తోందా?
ఓటు రాజకీయమంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానని గత జూలైలో గద్దర్ ఒక సదస్సులో ప్రకటించాడు. ఓట్ల రాజకీయం తెలియని గద్దర్ కేసీఆర్‌ని ఢీకొనగలరా? లేక ఇది మరో గందరగోళ ప్రకటనా? ప్రహసనమా? ప్రజలలో ఎంతోకొంత పలుకుబడి ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటకు విలువ, విశ్వసనీయత ఉండాలి. ‘ట్రాక్ రికార్డు’ గొప్పగా ఉండాలి. దీన్ని తుంగలోతొక్కి ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడటం అంత గొప్పగా రాణించదు. అలా మాట్లాడటమే రాజకీయమనుకుంటే పూర్తిగా పొరపడటమే! అన్ని వెంటనే జరిగిపోవాలి... తలిచినవన్నీ వాస్తవం రూపం దాల్చాలి... అసహనంతో పరుగెత్తాలి... ఆకర్షించేలా ఏదో ఒకటి మాట్లాడి ఆ పూట గడిచేలా చూడాలి... ఇదా రాజకీయం? కానే కాదు. గద్దర్ వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నంగా లేదు. మావోయిస్టు పార్టీనుంచి బహిష్కరణకు గురయ్యాక ఆయనలో అనేకానేక ఆశలు, ఆకాంక్షలు తలెత్తాయి. గొప్ప రాజకీయ నాయకుడిని అవుతానని ఆశిస్తున్నాడు. వాస్తవానికి ఆయనలో రాజకీయ నాయకుడి లక్షణం వీసమెత్తుకూడా కనిపించదు. హాస్యపు జల్లులు, విరుపుల మాటలు, పొడుపు కథలు, జానపద పాటలు రసోత్పత్తిని కల్పించే కంఠం... వీటివల్ల గాయకుడు కావచ్చు గాని రాజకీయ నాయకుడు కాలేడు. పది లక్షల మందితో భారీ సభ పెట్టి పార్టీని, మేనిఫెస్టోను ప్రకటిస్తానన్న పెద్దమనిషిలో ఆ ఊసే లేకపోతే ఆయన చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుందా? ఇది రాజకీయ నాయకుని లక్షణమా? కానే కాదు!
పార్టీని ప్రకటిస్తానన్నప్పుడే గద్దర్ బూటకపు ‘సత్తా’ ఏమిటో తేటతెల్లమైంది. అన్ని హంగులున్నవారే లక్ష మందిని పోగేయడం కష్టంగా ఉన్న సమయంలో- గద్దర్ పది లక్షల మందిని పోగేస్తానని ప్రకటించడం ‘బడాయి’ గాకపోతే ఏమిటి? జాతీయస్థాయి పార్టీలే వేల మందిని సమీకరించడం గగనమవుతున్న సందర్భంలో గద్దర్ మాట ఒట్టి ‘నీటి మూట’గా తేలిపోయింది. రాజకీయంగా ఎదగాలనుకునే గద్దర్ ఇలా నీటిమూటలను విప్పితే విశ్వసనీయత పెరుగుతుందా? ఆయన ‘రంగు’ ఏమిటో అప్పుడే తెలిసిపోయింది.
‘తెలంగాణ ప్రజాఫ్రంట్’లో ఆయన ఇమడలేదు. అక్కడా విఫలమయ్యాడు. అనంతరం నిశ్శబ్దంగా ఉండి ఇటీవల కాలంలో ‘టి-మాస్’ను రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతానని ప్రకటించాడు. అదీ ఎక్కడేసిన గొంగడిలా అక్కడే ఉంది. కొన్నిరోజులు ‘తెలంగాణ ఇంటి పార్టీ’ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్‌తో ‘దోస్తీ’ చేశాడు. అదీ నిలువలేదు. తన ‘తోటి మిత్రులు’ తలా ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవడంతో (కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్) రోజూ పత్రికల్లో వారి ప్రకటనలు, ఫొటోలు కనిపించడంతో ఆవేశపడి తాను త్వరలో పార్టీని పెడతానని, అందుకు ముహూర్తం ఆగస్టు నెలాఖరు అని ప్రకటించాడు. ఆ ముహూర్తం దాటిపోయింది. తెల్ల లేదు- నల్ల లేదు. కాని వివిధ వేదికలపై తాను ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటిస్తున్నాడు. ఏ పార్టీ తరపున పోటీచేస్తాడో చెప్పడు. అలా ఓ ‘్ఫలర్’ వదలుతాడు. మిగతాది ‘కాలం’ చూసుకుంటుందిలే అని ఇంటికెళ్ళిపోతాడు. ఇదీ ఆయన వైఖరి... రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమిదేనా?
గద్దర్ ‘గ్రాఫ్’ సవ్యంగా లేదు. ఆయన మాట-పాటతో నెట్టుకొస్తున్నాడు. ఏదో విధంగా మీడియాలో కనిపించాలనుకోవడం.. అదే లక్ష్యమైతే రాజకీయం అవుతుందా? మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరణ, హంగు ఆర్భాటం గల పాఠశాల నిర్వహణ, కొడుకు కాంగ్రెస్‌లో చేరడం లాంటి అనేక అంశాలు ఆయన ‘గ్రాఫ్’ పడిపోయేలా చేశాయి. విశ్వసనీయత పోయింది. సరదాగా కొంతసేపు నవ్వుకునే అవకాశాన్ని కల్పించడం రాజకీయ నేత లక్షణం ఎప్పటికీ అవదు.
కేసీఆర్ పథకాలు బాగున్నాయని ‘కితాబు’నిస్తాడు, తన కొడుకు స్మారకార్థం భవనం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం పొందుతాడు. అంతా అయ్యాక మళ్లీ కేసీఆర్‌ది ‘దొరల పాలన’ అని విమర్శకు దిగుతాడు, 9 నెలల ముందే తెరాస పీడ విరగడైందని వ్యాఖ్యానిస్తాడు. ఇదీ ఆయన రాజకీయం. ఈ రకమైన మానసిక స్థితితో గొప్ప వ్యక్తిగా, రాజకీయ నేతగా ఎదిగే అవకాశం లేశమాత్రం కూడా కనిపించదు. ఆయన మాత్రం సీఎం కావాలని కలలుకంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఏకంగా రాష్టప్రతిని అవుతానని కలలుగన్నాడు. కూట్లె రాయి తీయలేని మనిషి ఏట్ల రాయితీస్తానన్నాడట గద్దర్ లాంటివాడు. 70 సంవత్సరాలు దాటాక, ఆధునిక కంప్యూటర్ యుగంలో- కృత్రిమ మేధ రాజ్యమేలుతున్న సందర్భంలో- మార్క్సిస్టు భావజాలపు వాసనలతో అలరిస్తామనుకోవడం ఉత్త దండగ! సీఎం పదవి గద్దర్‌కు గగన కుసుమమే! దానికై ఇన్ని నాటకాలు ఆడటం అవసరమా?

-వుప్పల నరసింహం 99857 81799