సబ్ ఫీచర్

మన చదువులు ఏ తీరానికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతి బాగుపడాలంటే ప్రజలందరూ విద్యావంతులు కావాలని చెబుతారు. విద్య అంటే ఏమిటి? చదవడం, రాయడం నేర్పడమేనా? కేవలం ఇదే కాదు. సంస్కారం, విలువలు కూడా అవసరం. నేటితరం పిల్లలు సంస్కార రహితమైన విద్యను యాంత్రికంగా అభ్యసిస్తున్నారు. ఇది పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు మాత్రమే పనికివచ్చేదిగా తయారైంది. విశ్వవిద్యాలయాలలో కూడా జ్ఞానార్జనకి పనికివచ్చే చదువుకరవైంది. విద్యా విధానంలో అనేక పనికిమాలిన మార్పులు, ప్రయోగాలు చేసి పిల్లలను ఉభయభ్రష్టులుగా మారుస్తున్నారు. దీనికితోడు సామాజిక వాతావరణం నానా విధాలుగా కలుషితమైపోయింది. పిల్లలను విపరీతమైన అనేక దుష్పరిణామాలకు గురిచేసే పరిస్థితులు నెలకొన్నాయి.
నేటి సినిమాలలోను, టీవీ సీరియళ్లలోను అసభ్యకరమైన, అశ్లీలమైన దృశ్యాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు పోటీపడి మరీ స్ర్తిలను అసభ్యకరంగా చూపిస్తున్నాయి. వాడవాడలా బ్రాందీషాపులు వెలిశాయి. వస్తధ్రారణ సంస్కారవంతంగా ఉన్నపుడే ఎవరికైనా సమాజంలో గౌరవం లభిస్తుంది. యువతీ యువకులు పొట్టి లాగులు, బిగుతైన దుస్తులతో రోడ్లపై సంచరిస్తున్నారు. మనకు అవసరం లేకపోయినా, ఆధునిక నాగరికత పేరుతో వస్తధ్రారణలో విచ్చలవిడితనం చోటుచేసుకుంటోంది. చింపిరి జుట్టుతో లేకపోతే ‘్ఫ్యషన్’లో వెనుకబడిపోతామన్న భావన నేటి యువతలో నెలకొంటోంది.
ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సైతం సంస్కారవంతంగా దుస్తులు ధరించడం లేదు. పూర్వం తహశీల్దారులు కోటు ధరించకుండా కార్యాలయాలకు వచ్చేవారు కాదు. ఇప్పుడు పెద్ద ఉద్యోగులు కూడా గళ్ల చొక్కాలు, అడ్డచారల టీ షర్టులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు. మన ప్రభుత్వం ఇలాంటి విషయాలు పట్టించుకోదు. వ్యక్తిస్వేచ్ఛ ఉండవలసిందే కానీ- సభ్యత, సంస్కారం, సంస్కృతి వంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై పిల్లలకు తల్లిదండ్రులు ఏమీ చెప్పడం లేదు. వారు చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో పిల్లలు లేరన్నది వాస్తవం. అనేక నేరాలు, ఘోరాలకు కారణమవుతున్న మద్యం దుకాణాలను, అశ్లీల సినిమాలను ప్రభుత్వం నిషేధించలేకపోతోంది. ఇక చదువుల విషయం పట్టించుకునే తీరిక పాలకులకు లేదు. ప్రతి పాఠశాలలోను ఇప్పుడు మధ్యాహ్న భోజనాలు మొదలయినాయి. ఈ విధానం జూనియర్ కాలేజీల్లో కూడా ప్రారంభమయింది. అసలు బడిలో భోజనాలు ఏమిటి? పిల్లలకు పౌష్ఠికాహారాన్ని నేరుగా అందజేయాలి. లేదా వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. బడుల్లో వంటశాలలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడి వాతావరణం మారుతోంది. ఒకప్పుడు ప్రతి పాఠశాలకు ఒక మేనేజిమెంటు కమిటీ ఉండేది. ఆ కమిటీలు విద్యాభివృద్ధికి ఎంతో కృషి జరిపేవి. ఇప్పుడు అలాంటి ధ్యాసే లేదు. అంతా ప్రభుత్వ అధికారుల నిర్వాకమే. మధ్యాహ్న భోజన పథకం నుంచి పిల్లలకు యూనిఫారమ్‌ల పంపిణీ వరకూ అంతటా అధికారుల చేతివాటమే.
అనేక పథకాల పేరిట పాలకులు దండిగా నిధులను ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రమే. ఐదవ తరగతి పిల్లలు సైతం సరిగా చదవలేరు, రాయలేరు. ఇలాటి పిల్లలకు ఇప్పుడు ఒకటవ తరగతి నుంచే ఇంగ్లీషు మీడియమ్ ప్రారంభమయింది. పిల్లలందరూ మాతృభాషలోనే విద్యను నేర్చుకోవాలని విద్యావేత్తలు ఎంతోకాలంగా చెబుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిని పెడచెవిన పెట్టి విద్యావిధానాన్ని భ్రష్టుపట్టిస్తోంది. ప్రైవేటు విద్య పేరుతో నకిలీ డిగ్రీలు పెరిగిపోతున్నాయి. ఎవరు సమర్ధులో, ఎవరు అసమర్ధులో ఎలా నిర్ణయించాలి? ముందు ముందు మన ప్రభుత్వం ఇంజనీరింగ్, వైద్యవిద్యలో కూడా ‘దూరవిద్య’ను ప్రవేశపెట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు. ముఖ్యమైన కోర్సులకు దూరవిద్యా విధానం నిషేధించాలి. చదువుకావలసినవారు విధిగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి అభ్యాసం చేయాలి. కాలేజీ హాస్టళ్లలో ర్యాగింగ్, లైంగిక వేధింపులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి.
‘ఎలుకల నివారణకు ఇంటికి నిప్పుపెడతారా?’ అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అలా చేయవలసిన పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కామన్ విద్యావిధానం ప్రవేశపెట్టాలి. అన్ని పాఠశాలలు ఈ విధానాన్ని అనుసరించి తీరాలి. హైస్కూల్ స్థాయి వరకూ ఇంగ్లీషు మీడియమ్‌ను రద్దుచేయాలి. విద్యాబోధన మాతృభాషతోనే ప్రారంభం కావాలి. ఇంగ్లీషును ఒక భాషగా నాల్గవ తరగతి నుండి బోధించాలి. ఇంటర్మీడియట్ నుండి ఇంగ్లీషు మాధ్యమం ఎలాగూ ఉంటుంది. సమాజాభివృద్ధి కోసం, యువత మేలు కోసం ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. యువత పెడదోవ పడుతున్నందున మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలు జరపాలి. తాగిన మత్తులో తల్లిదండ్రులను, భార్యాపిల్లలను హతమారుస్తున్న సంఘటనలు నిత్యకృత్యమైపోయాయి. మత్తులో జోగుతూ వాహనాలు నడిపే యువతీ యువకులు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులు పెట్టే కేసులంటే ఎవరికీ భయం లేదు. రెండురోజులు జైలులో కూర్చుని రాజభోగాలు అనుభవించి, విడుదలైన తర్వాత మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. సినిమాల విషయంలో సెన్సారు బోర్డు కఠినంగా వ్యవహరిస్తూ, సంప్రదాయ విరుద్ధమైన దృశ్యాలు తొలగించాలి. చట్టవిరుద్ధ కార్యక్రమాలు తెరపై చూపరాదు. అశ్లీల సినిమాలు, అసభ్య ప్రకటనలను నిషేధించాలి. దారితప్పుతున్న యువతను సక్రమమార్గంలో నడపాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కూడా ఇందుకు కృషిచేయాలి. వారు ఆదర్శవంతులుగా ఉంటూ యువతకు స్ఫూర్తిని అందించాలి.

-వేదుల సత్యనారాయణ 96183 96071