సబ్ ఫీచర్

జంగిల్ బామ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అడవితల్లి ఒడిలో చెట్టుచెట్టుకో కథ..
పచ్చివి.. పండినవి.. ఎన్నో రకాల పండ్లు..
మేలు చేసే వేర్లు మరెన్నో..
వసంతకాల పువ్వులు..
వానాకాల చినుకులు, చలికాల రాత్రులు..
ఇలా రుతువులెన్నో..
నాట్యమయూరాలు.. కోయిల మధురగానాలు..
చెంగున దూకే జింకలు, పక్షుల కిలకిలారావాలు..
నక్కల ఊళలు, చిరుతల గాండ్రింపులు.. ఇలా మరెన్నో జంతువులు.. ఇలా.. వీటన్నింటి గురించి వివరిస్తూ ‘మేమంతా అడవి తల్లి బిడ్డలం..’ అంటుంది డెబ్భై ఏళ్ల బామ్మ అయిన లక్ష్మీ కుట్టీ. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్ అటవీ ప్రాంతంలో ‘కానీ’ అనే గిరిజన తెగలో పుట్టింది లక్ష్మీ కుట్టి. దాదాపు ఐదు దశాబ్దాలుగా వనమూలికలతో చికిత్స చేస్తోంది లక్ష్మి. పాముకాటుకు వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది లక్ష్మి. అందుకే భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీతో సత్కరించింది.
జంగిల్ బామ్మగా పేరుగాంచిన లక్ష్మీ కుట్టికి అడవే పాఠశాల. చెట్లు, పుట్టలే ఆమెకు గురువులు. ప్రతి విషయాన్నీ ఆమె అడవినుంచే నేర్చుకుందట. దానే్న సమాజానికి పంచుతున్నాను అని చెబుతుంది లక్ష్మికుట్టి నవ్వుతూ.. 1950లో ఈ గిరిజన తెగలో బడికి పోయి చదువుకున్న తొలి మహిళ కూడా ఈ జంగిల్ బామ్మే.. అడవి చీమ కుట్టిన వాళ్ల దగ్గరి నుంచి, పాము కాటుకు గురయిన వాళ్ల వరకూ.. అందరూ ఈమె దగ్గరికే వస్తారు. కొన్ని దశాబ్దాలుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎందరికో ఈమె చికిత్సను అందించింది.. నేటికి అందిస్తోంది. అయిదు వందలకు పైగా మూలికలు, మొక్కలను చక్కగా గుర్తించగలదు లక్ష్మీ కుట్టి. ఈ విషయం తెలిసిన కేరళ ప్రభుత్వం ఈమెకు 1995లో ‘నాటు వైద్య రత్నం’ అనే బిరుదును ప్రదానం చేసింది. దీనితో పాటు అయిదు వేల ఒక్కరూపాయి నగదు, ధన్వంతరి కాంస్య విగ్రహంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందించింది. బొటానికల్ గార్డెన్ పరిశోధకులకు, గార్డెన్‌లకు, పరిశోధక కేంద్రాలకు ఔషధ మొక్కలు, మూలికలను ఏరి ఇస్తూంటుంది లక్ష్మీకుట్టి. వారు వాటిని గురించి చెప్పమని ఈమెను ఆహ్వానిస్తే వెళ్లి వాటి గురించి ప్రసంగిస్తూంటుంది. కొన్ని కాలేజీల్లో కూడా అడవుల్లో దొరికే మూలికల గురించి, మొక్కల గురించి క్లాసులు చెబుతూంటుంది లక్ష్మీ కుట్టి.
‘నేను ప్రధానంగా విషానికి విరుగుడు ఇస్తాను. అందుకే నాకు ఇన్ని పురస్కారాలు వచ్చాయి. ఈ భూమిపై పుట్టినందుకు నా బాధ్యతను నేను నిర్వర్తించడం, ఇతరులకు సాయం చేయడం, రేపటి గురించి ఆలోచించకపోవడం.. ఇదే నా సిద్ధాంతం. భారతదేశం నలుమూలల నుంచీ ప్రజలు ఇక్కడకు వస్తూంటారు. నా చికిత్సపై వారికి ఎంతో నమ్మకం ఉంది. నేను మందులిస్తే తప్పక నయమవుతుందని వారు చెబుతుంటారు. వారు అలా చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది’ అని చెబుతుంది లక్ష్మీకుట్టి.