సబ్ ఫీచర్

ఊరు వెలేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్‌లోని బుండీ గ్రామం. ఆ ఊర్లో నలుగురు అక్కచెల్లెళ్లు.. తండ్రి సంపాదనతో అందరూ ఆనందంగా ఉండేవారు. 2012లో ఆ తండ్రికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. అప్పటివరకూ ఇంటిని అతనే నడుపుతూ వచ్చాడు. తరువాత నుంచీ ఆ కుటుంబ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. తల్లితో పాటు నలుగురు అక్కచెల్లెళ్లు చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించి ఇంటి ఖర్చులను వెల్లబుచ్చేవారు. ఆ సమయంలో బంధువులెవరూ ఎలాంటి సాయం చేయలేదు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారికే తెలుసు. ఎట్టకేలకు నలుగురూ ఓ ఇంటివారయ్యారు. వారి పరిస్థితిని తెలుసుకున్న వారి వారి అత్తింటివారు, భర్తలు అండగా నిలిచారు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. అన్ని బాధ్యతలూ ఆ నలుగురూ, వారి తల్లి మాత్రమే మోశారు. ఇది గమనించిన మంచంలోని తండ్రి ఆ నలుగురు కూతుళ్లను ఒకటి కోరారు. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ మనకు సాయం చేయలేదు. అన్ని బాధ్యతలూ మీరే మోశారు. ఎవరినీ సాయం అడగలేదు. ఆడపిల్లలయినా మగపిల్లల్లా ఎన్నో కష్టాలు పడి పెళ్లిళ్లు చేసుకుని మీ జీవితాల్ని మీరు నిలబెట్టుకున్నారు. కాబట్టి నేను చనిపోయాక కూడా మీరే నాకు తలకొరివి పెట్టాలి’ అని. ఆయన కోరిక నెరవేర్చాలని ఆ ఆడపిల్లలు ఆ క్షణమే నిర్ణయించుకున్నారు.
ఇటీవల ఆ తండ్రి చనిపోయాడు. ఆయనకోసం పాడెను సిద్ధం చేయగానే దాన్ని ఎత్తడానికి ఆ నలుగురు కూతుళ్లు లేచి నిలుచున్నారు. అక్కడున్న అందరూ కంగారుపడి వారిని వెనక్కి లాగారు. ‘మేం అంత్యక్రియలు నిర్వహించాలని మా నాన్న ఆఖరి కోరిక కోరాడు. మేము అంత్యక్రియలు నిర్వహించాలి’ అని ఓ కూతురైన మీనా అక్కడున్నవారితో చెప్పింది. ‘అమ్మాయిలు ఈ పని చేయడమేంటి? మేమంతా చచ్చిపోయామనుకున్నారా?’ అంటూ వారి చిన్నాన్న, పెదనాన్నలు మండిపడ్డారు. పాడెను మోయకుండానే.. కార్యక్రమాలేవీ మొదలుపెట్టకుండానే వారు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. కానీ ఈ తతంగం అక్కడితో ఆగలేదు. ఆ కూతుళ్లు చేస్తున్న పని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అంతకుముందెప్పుడూ వాళ్లు అలాంటి దృశ్యాన్ని చూడలేదు మరి. విషయం పంచాయితీ వరకు వెళ్లింది. పంచాయితీ పెద్దలు కోప్పడ్డారు. ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి గ్రామస్థులు, బంధువులూ వెలేశారు.
ఎవరి ఇంట్లోనైనా చావు సంభవిస్తే చుట్టుపక్కలవారు ఆ కుటుంబానికి అండగా ఉంటారు. వారిని కలవడానికి, పరామర్శించడానికి ఇంటికి వస్తారు. కానీ ఆ గ్రామం, ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేసింది. ఎవరైనా చనిపోతే, ఆ రోజు వాళ్లింట్లో వంట చేయరు. చుట్టుపక్కల వాళ్లే వండిపెడతారు. కానీ వారికి మాత్రం ఎవ్వరూ భోజనం పెట్టలేదు. సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ వాళ్లే ఇంట్లో వంట చేసుకుని తిన్నారు. ఒకపక్క తండ్రి చనిపోయాడనే బాధ, మరోపక్క అయినవాళ్లు వదిలేశారనే ఆవేదన.. గ్రామం నుంచి వెలివేశారనే ఆక్రోశం మరోవైపు.. వారికి ఏం చేయాలో తోచలేదు. వారు ఎలాంటి తప్పూ చేయలేదు. అందుకే వారు అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. పంచాయితీ విధించిన ఆంక్షలు ఎంతోకాలం నిలువలేదు. విషయం పోలీసులు, మీడియా దృష్టికి వెళ్లింది. వారి చొరవతో పంచాయితీ వెనక్కి తగ్గింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులకు తమ కూతుళ్లు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఘటనలు అనేకం.. ఇటీవల మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌కి కూడా అతని దత్తపుత్రిక నమిత అంత్యక్రియలు నిర్వహించింది. అయినా కూతుళ్లు ఆ క్రతువు నిర్వహిస్తే అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. మన సంప్రదాయాల్లోనే ద్వంద్వనీతి కనిపిస్తోంది. సంప్రదాయపరమైన విషయాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం లేదంటే పరోక్షంగా వాళ్ల స్థాయి కూడా తక్కువని చెప్పడమే.. వివక్ష చూపినట్లే..