సబ్ ఫీచర్

ఓ వైపు దాతృత్వం.. మరోవైపు నియంతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపద సృష్టించి పంచడం ఈనాటి విధానంగా మారింది. ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండు బిలియన్ డాలర్ల (రూ.14,200 కోట్లు)తో దాతృత్వ నిధిని ఏర్పాటు చేశాడు. దీనికి ‘బెజోస్ డేవన్ ఫండ్’గా నామకరణం చేశాడు. ఈ నిధి నుంచి నిలువ నీడ లేని వారికి ఇళ్లు, పేద పిల్లల ప్రీ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు ధనం ఖర్చుచేస్తారు. ఈ ప్రీ స్కూళ్లు మాంటిస్సోరి స్ఫూర్తితో పనిచేస్తాయని చెబుతున్నారు. అమెజాన్ స్థాపనకు నిర్దేశించుకున్న సూత్రాలే ఈ ‘నిధి’కి వర్తిస్తాయని కూడా ఆయన చెప్పారు.
గతంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సిఈఓ మార్క్ జుకర్ బర్గ్ దంపతులు తమ కూతుళ్లు పుట్టిన సందర్భంగా పెద్దఎత్తున తమ సంపదను దాతృత్వానికి ప్రకటించి సంచలనం సృష్టించారు. ఫేస్‌బుక్‌లోని తమకున్న షేర్లలో 99శాతం అంటే 45 మిలియన్ డాలర్లను దాతృత్వానికి ఇచ్చేందుకు ఓ బహిరంగ లేఖను తన కూతురు పేరిట రాశారు. తన కూతురితోపాటు ప్రపంచంలోని ఇతర పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకోవాలన్న సదుద్దేశంతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంతో ఔదార్యం, పెద్దమనసుంటే తప్ప ఈ పనికి ఎవరూ పూనుకోలేరు. మిలియన్ల కొద్దీ తన సంపదను ప్రపంచంలో పేద విద్యార్థులకు విద్య-వైద్యం- సరైన వసతులు ఏర్పాటు చేసేలా ఖర్చుచేయాలని ఆయన నిశ్చయించారు.
‘గివింగ్ ఫ్లెడ్జ్’ పేర ప్రపంచంలోని 14 దేశాల నుంచి 135 మంది వ్యక్తులు, కుటుంబాలు తమ సంపదలో సగ భాగానికన్నా ఎక్కువ దానం చేసేందుకు ముందుకురావడం విశేషం. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారి బఫెట్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ‘వేదిక’ సమర్ధవంతంగా పనిచేస్తూ ప్రపంచంలోని ప్రముఖుల నుంచి సంపదను సేకరించి పేదలకు, శరణార్థుల అవసరాలకు ఖర్చు చేస్తోంది.
ఆరోగ్యకర సమాజం ఏర్పడేందుకు ప్రాథమిక విద్య, వ్యాధుల నివారణకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో మహిళా సాధికారత సైతం ఉండటం విశేషం. చైనా, జపాన్ లాంటి ఆసియా దేశాల సంపన్నులు-శ్రీమంతులు సైతం ‘గివింగ్ ఫ్లెడ్జ్’కు సహకరిస్తున్నారు. దీన్నొక వేదికగా తీర్చిదిద్దుతున్నారు. ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. కేవలం 31 సంవత్సరాల జుకర్‌బర్గ్ పెద్దమనసుతో భారీ మొత్తాన్ని దాతృత్వానికి కేటాయించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిలియనీర్లు తమ సంపదలోని సగానికి పైగా ‘గివింగ్ ఫ్లెడ్జ్’ వేదికకు అందివ్వాలని బిల్‌గేట్స్, బఫెట్ చాలా రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు మంచి స్పందనే కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రముఖులు ఈ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్ల ధనం వేదికకు ఇచ్చేందుకు చాలామంది పత్రాలను సమర్పించారు. వారిలో ఒరాకిల్ సంస్థకు చెందిన లారీ ఎలిసన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఎలెన్‌తోపాటు అరబ్బు దేశాలకు చెందిన అల్ వలాద్ బిన్ తలాల్ లాంటి వారున్నారు.
భారతదేశం విషయానికొస్తే ‘విప్రో’ అధిపతి ప్రేమ్‌జీ పెద్దమొత్తం దాతృత్వానికి ఖర్చుచేశారు, చేస్తూ ఉన్నారు. టాటా గ్రూపు దశాబ్దాలుగా దాతృత్వానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. దాతృత్వం కోసమే టాటాలు పలు కంపెనీలు ప్రారంభించారంటే అతిశయోక్తి కాదు. 60 శాతానికి పైగానే వచ్చిన లాభాలలో దాతృత్వ కార్యక్రమాలకు సంవత్సరాల తరబడి కేటాయిస్తున్నారు. ఎన్నో స్కాలర్‌షిప్పులు, పరిశోధనలకు ప్రోత్సాహకాలు, స్టార్టప్స్‌లకు స్నేహహస్తం అందిస్తున్నారు. ప్రపంచంలోనే గొప్ప పథ నిర్దేశకులుగా టాటాలు నిలుస్తారు.
ఇక రామ్‌దేవ్ బాబా తన పతంజలి సంస్థలో లాభంగా వచ్చిన ప్రతి పైసాను దాతృత్వానికి కేటాయిస్తున్నారు. ఎనె్నన్నో సంస్థలను నడుపుతూ భారతీయతకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక, సంప్రదాయ విద్యను కలగలిపి నూతన పద్ధతిలో పెద్దఎత్తున విద్యాలయాలను ఆయన నెలకొల్పుతున్నారు.
విరుద్ధాంశం...
సంపద సృష్టించి పంచడం అనే నినాదానికి వ్యతిరేకంగా, భిన్నంగా సోషలిస్టు భావనతో ఉన్న సంపదనే పంచుకుందామనే కానె్సప్ట్‌తో వెనిజులాలో ప్రభుత్వం పనిచేయడంతో ఇప్పుడు ఆ ప్రభుత్వం దివాలా అంచున నిలబడింది. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా ఆ దేశం ద్రవ్యోల్బణంలో చిక్కుకుని, విలవిలలాడుతోంది. 2014 సంవత్సరానికి ముందు ముడి చమురుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభించింది. ఆ తరువాత ధరలు క్రమంగా తగ్గడం ప్రారంభమయ్యేసరికి ఆ సహజ వనరుపైనే ఆధారపడిన ఆ దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. సోషలిస్టు పంథాలో పథకాలను ప్రారంభించడంతో అన్నీ ఉచితంగా లేదా సబ్సిడీతో ఇవ్వడం ప్రారంభించేసరికి విదేశీ మారకం కుంటుపడింది. రాబడి తగ్గి ఖర్చులు పెరిగి, ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు హాహాకారాలుచేస్తూ పొరుగు దేశాలకు వలసలుపోతున్నారు. పొరుగున ఉన్న కొలంబియాకు పది లక్షలు, ఈక్విడార్‌కు రెండు లక్షలు, పెరుకు నాలుగు లక్షలు, స్పెయిన్‌కు రెండు లక్షల పైచిలుకు, అర్జింటీనా, చిలీ, బ్రెజిల్, అమెరికా, మెక్సికో వంటి అనేక దేశాలకు అనేక లక్షల మంది శరణార్థులుగా వెళ్ళారు. గత సంవత్సరం ఈ వలసలు మరీ ఎక్కువ జరిగాయి. ఈ దశలో ఒక కప్పు కాఫీ ధర వెనిజులాలో 2.5 మిలియన్ల బొలివర్స్ అని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ఇక తిండి గింజలు, మందులు, నిత్యావసరాల సంగతి సరేసరి.
21వ శతాబ్దంలో ఇంటర్నెట్ ప్రపంచమంతటా పరచుకుని డిజిటల్ ఎకానమీ విస్తరిస్తున్న సందర్భంలో ఇలా కోట్లాది మంది ఒక దేశం నుంచి ప్రజలు వలసపోవడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ అంశంకాదు. దీనికి కారణం పాలకులు అనుసరించిన, అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సోషలిస్టు పాలసీలు. సోషలిస్టు విధానం ప్రపంచమంతటా విఫలమైందని ఆయా దేశాలే చెబుతుండగా ఆవేశంతో వెనిజులా పాలకులు ముఖ్యంగా గతంలో అధ్యక్ష స్థానంలో పనిచేసిన చావెజ్ దీనికి ముఖ్యకారకుడు. పెట్టుబడిదారీ వ్యవస్థపైగల అపరిమిత అక్కసుతో ప్రారంభించిన నియంతృత్వ సోషలిస్టు విధానాలు తన దేశానికిప్పుడు పెద్ద గుదిబండగా మారాయి. చివరకు ద్రవ్యోల్బణం ‘సాలెగూడు’లో ప్రజలు చిక్కుకున్నారు. వలసలు తప్ప మరో దారి లేదని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత సంక్షోభం ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణంతో వచ్చే అనేక అనర్థాలు, ఆకలి కేకలు, బలవంతపు మరణాలు, వ్యభిచార కూపంలోకి దిగడం, గూండాల స్వైరవిహారం, ఆయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడటం ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ అక్షరాలా అరాచకం రాజ్యమేలుతోంది.
సంపద సృష్టించి పంచే విధానంలో ఎంతో సాంత్వన కనిపిస్తోంది. సోషలిజం పేర రూపొందించిన విధానాలు చివరకు దేశం దివాలా తీసేందుకు దారితీశాయి. జీవితమే నరక ప్రాయమైంది. ఆత్మగౌరవమనే మాటకు మాన్యత లేకుండాపోయింది. మరి ఇది ఏ రకంగా ఆహ్వానించదగ్గ విషయం? నియంతృత్వాన్ని ఎలా స్వాగతిస్తారు?
విచిత్రమేమిటంటే శరణార్థులను, ఇలాంటి పేదలను ఆదుకునేందుకు ‘గివింగ్ ఫ్లెడ్జ్’ నిధులు ఖర్చుచేస్తున్నారు. ఆయా దాతృత్వ సంస్థలు- ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. భేషజాలకుపోయి సోషలిజం... స్వర్గం... భూలోకంలో సమానత సృష్టిస్తామని గొప్పలుపోయి బొక్కబోర్లాపడటం కన్నా రష్యా, చైనా, తూర్పు జర్మనీ లాంటి దేశాలు ముందుగానే మేల్కొన్నట్టు వెనిజులా సైతం మేల్కొని ఉంటే ఇంత ఉపద్రవం వచ్చి ఉండేదికాదు. ఇప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురో ఇంకా కన్ను తెరవక తన గురువు చావెజ్ అడుగుజాడల్లో నడుస్తుండటంవల్లనే పరిస్థితి విషమించిందని ఆ దేశ ప్రతిపక్షాలు- ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలకులు ప్రజల్ని పాలిస్తారా?...సిద్ధాంతాల్ని ప్రేమిస్తారా? అన్నది ప్రశ్న.
వెనిజులాలో మాత్రం సిద్ధాంతాల్ని ప్రేమించి పాలకులు వాటికి బానిసలయ్యారు. దాని ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. డిజిటల్ ఎకానమీలో, నాలెడ్జీ ఎకానమీలో కృత్రిమ మేధ అంతటా విస్తరించి విశ్వరూపం ప్రదర్శిస్తున్న తరుణంలో ఇలాంటి అపస్వరాలు- అపసవ్య పాలనలు మానవాళికి పెద్ద గాయంగా భావించాలి. ఉన్న గాయాలకే ఉపశమనం కోరుతున్నవేళ పాలకులు కొత్తగా పెద్ద గాయం చేయడం ప్రజలు తట్టుకోలేని స్థితి. ఆ పరిస్థితి నగ్నంగా వెనిజులాలో ఇప్పుడు కనిపిస్తోంది. వెనిజులా పాలకుల పెను నిద్దుర వీడేలా ప్రపంచ ప్రజాస్వామిక వాదులు ‘పొలికేక’ పెట్టక తప్పదు. నియంతృత్వం వీడి వెనిజులాను ప్రజాస్వామ్యంలోకి తీసుకొస్తే ప్రజలు ఏదోమేర ఉపశమనం చెందుతారు. ఈ నేపథ్యంలో దాతృత్వమా?... నియంతృత్వమా?... ఏది మేలైనదో ఎవరికివారే నిర్ణయించుకోవాలి!

-వుప్పల నరసింహం 99857 81799