సబ్ ఫీచర్

బడి.. ఒక విముక్తి వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై ఒకటవ శతాబ్దంలో విద్య కుంటివానికి కట్టెలా, గుడ్డివానికి దారిలా సహాయ పడుతుంది. మూగవానికి నోరిస్తుంది. అంగవైకల్యం ఉన్న వారికి కూడా జీవించే హక్కును విద్య ప్రసాదిస్తుంది. శారీరక వైకల్యం సానుభూతితో పరిష్కరించే సమస్య కాదు. కొందరిలో అంగవైకల్యం పుట్టుకతో కాకుండా మానవత్వం వైఫల్యం వల్ల కూడా జరిగింది. అణుబాంబు వేస్తే ఎంతోమంది గుడ్డివారైపోయారు. కొంతమందికైతే శ్వాసకోశాలు దెబ్బతిన్నాయి. అంగవైకల్యం సహా కొంతమందికి లెర్నింగ్ పరిజ్ఞానం కూడా పోయింది. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది తమ శరీర భాగాలను కోల్పోతున్నారు. టెక్నాలజీ కేవలం మార్కెట్‌కే కాకుండా అంగవైకల్యం సమస్యను తీర్చడానికి రకరకాల పరికరాలను సృష్టించింది. వికలాంగులకు కూడా ‘విద్య’ ఒక సహాయకారిగా ఇవ్వవలసిన బాధ్యత తీసుకుంది. నేటి పాఠశాలలను ఇలాంటి వారికి స్వాగతం చెప్పాలంటే బోధనా పద్ధతులు, స్కూలు సంస్కృతి మారటమే కాకుండా అణగారిన వ్యక్తుల విముక్తికై మనం దారిచూసే సాయకారులుగా ఉండాలి. ఇలాంటి పిల్లలకు విద్యను, నైపుణ్యాన్ని నేర్పించటానికి ప్రత్యేక స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి వారిని సరైన చోట చేర్పించగలిగితే మన ధర్మాన్ని పూర్తిచేసిన వాళ్లమవుతాం. కొన్ని దేశాల్లోనైతే పాఠశాలల్లోనే వికలాంగులకు శిక్షణనివ్వటానికై అధ్యాపక వర్గాన్ని నియమిస్తున్నారు. ప్రభుత్వం కూడా తన వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చి టీచర్లను నియమిస్తే ఒక ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్లమవుతాం. మన బోధనా పద్ధతులు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారికి ఉపయోగపడవచ్చు. కానీ అవయవ లోపాలున్న పిల్లల కోసం శ్రద్ధ తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. అమెరికాలో భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆఫ్‌కిన్స్ పేరుపైనే ఆఫ్‌కిన్స్ విశ్వవిద్యాలయం పెట్టారు. ఈయన నడవలేడు. కానీ మొత్తం ప్రపంచాన్నీ నడిపించే భౌతిక శాస్త్రంలో ఆయన మేటి ప్రొఫెసర్. ఆయన పేరిట మెడికల్ కాలేజీని కూడా పెట్టారు.
ప్రస్తుత శతాబ్దంలో అంగవైకల్యం ఉన్నవారిని కూడా విద్యకు యోగ్యులుగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. ఇదొక సామాజిక న్యాయం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి ఏ స్ఫూర్తితో ప్రభుత్వం సహకరిస్తుందో, దివ్యాంగులకు ఏ చిన్న సహాయం చేసినా స్కూలు ఒక విముక్తి వ్యవస్థగా మారుతుంది.
సవాళ్లను ఎదుర్కోవాలి...
చదువంటేనే అక్షర జ్ఞానమనే కాలం పోయింది. చదువంటే ఆలోచనను పెంచటం. కొందరికే చదువు అబ్బుతుందని, మేధావులకే అబ్బుతుందని పాత సాంప్రదాయపు అభిప్రాయం. మేధో రంగంలో జరుగుతున్న ప్రయోగాలు విద్యాసంస్థలను, అధ్యాపకులను, ప్రభుత్వాలను ఆలోచింపజేస్తున్నాయి. దీంతో ఏదో ఒక రంగంలో ప్రతి ఒక్కరూ రాణించే స్థితి ఉంటుందన్న అభిప్రాయాలు విస్తృతంగా బలపడుతున్నాయి. ఈనాడు రోబోలు, కృత్రిమ పరిజ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచం పునరాలోచనలో పడింది. మనం తరగతి గదిలో చెప్పే చదువు, సమాచారం ఆటోమిషన్ అయింది. ఈనాడు తరగతి గదులు మనుగడ సాగించాలంటే బోధనా పరిధిని విస్తతృతపరుచుకోవాలి. బోధనలో, సాధనలో మార్పు రావాలి. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంచటమే మన లక్ష్యం కావాలి. పాఠశాలకు, ఇంటికి గల తేడాను తక్కువ చేసుకోవాలి. ఇంట్లోని సుహృద్భావ వాతావరణాన్ని తరగతి గదిలో కల్పించవలసిన అవసరం ఉంది. ఈ రెండింటి మధ్యన ఎంత సాన్నిహిత్యం ఉంటే తరగతి గది అంత తొందరగా నవీనమవుతుంది. ఒకనాడు తప్పులు చేయటం ఉపాధ్యాయుని అసహనానికి కారణమవుతుంది. ఈనాడు తప్పులతోనే పిల్లల పటిమ పెరుగుతుందని, సాధించే శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి ఆలోచించినప్పుడే మోధో కణాలు ఎక్కువ ఉత్తేజం అవుతాయని శాస్తవ్రేత్తలు నిర్థారణకు వచ్చారు. ఇప్పుడు బోధనలో విద్యార్థులకు పోరాట పటిమను పెంచటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. విద్యార్థి తాను చేసిన తప్పులను సవరించుకునే దశకు తీసుకపోవాలి. పిల్లలు తప్పులు చేస్తే తీర్చిదిద్దుకునే విధంగా తరగతి గది ప్రోత్సహించాలి. సవాళ్లను ఎదుర్కొనేలా చేయటమే తరగతి గది లక్ష్యం.
కొత్త తరగతిలోకి...
ప్రతి సంవత్సరం ముస్తాబవుతుంది. కొందరు అదే పాఠశాలలో చదువుకుని కొత్త తరగతికి వస్తారు. మరి కొందరైతే ఇతర పాఠశాలల నుంచి వస్తారు. తరగతి గది మాత్రం కొత్త పిల్లలతో కళకళలాడుతుంది. ఎన్నో కొత్త భావాలతో పిల్లలు కొత్త తరగతుల్లోకి అడుగుపెడతారు. టీచర్ చెప్పబోయే పాఠ్యాంశాలు ఎలా ఉంటాయో? అని కొందరు బిక్కమొకంతో కనపడతారు. ఈ ఏడాది ఏ కొత్త స్నేహితులు వస్తారోనని కొందరనుకుంటారు. ఏ కొత్త టీచర్లు వచ్చి పాఠాలు చెబుతారోనని ఊహిస్తుంటారు. ఈ ఏడాది మనముందున్న సవాళ్లు ఏమిటని కొందరు పిల్లలు ఆలోచిస్తుంటారు. కొత్త కల్చర్‌ను పాఠశాల పాలకవర్గం పిల్లలకు అందిస్తుంది. ప్రతి విద్యార్థి కూడా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహంతో ఉంటాడు. తమ శక్తికొద్దీ జ్ఞానాన్ని నేర్పాలని అందుకు తమ బోధనను సాధనగా మార్చుకోవాలనే ఉపాధ్యాయులుంటారు. ఏటా పాఠశాల తన సంకల్పాన్ని పునశ్చరణ చేసుకుని విద్యా కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుంటుంది. ‘పిల్లలందరూ యోగ్యులే, పిల్లలందరికీ నేర్చుకునే శక్తి ఉన్నది’. ఇందుకు బడికి కావల్సింది దృఢమైన సంకల్పం. ఈ దీక్షతో పాఠశాల తన బాధ్యతల నిర్వహణకు శ్రీకారం చుడుతుంది.

-చుక్కా రామయ్య